Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మనం తినేది ప్లాస్టిక్… తాగేది ప్లాస్టిక్… బతుకంతా ప్లాస్టిక్‌మయమే.,.

March 1, 2025 by M S R

.

మహారాష్ట్ర బుల్దానా జిల్లా షెగావ్ తాలూకాలోని బొండ్ గావ్, కలవాడ్, హింగానా మూడు గ్రామాల్లో ఇప్పుడు జుట్టు కలవాడు లేడు. ముందు తలమీద దురద మొదలవుతుంది. నెమ్మదిగా ముందు భాగం జుట్టు రాలిపోతుంది. వారంలో బట్టతల అవుతుంది.

ఆడామగా, చిన్నా పెద్ద తేడా లేదు. దాంతో ఊరు ఊరంతా మూకుమ్మడిగా ఏడుస్తుంటే ప్రభుత్వం పెద్ద మనసుతో వైద్యబృందాలను పంపింది. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. చర్మసంబంధ వ్యాధులు కూడా వచ్చినట్లు గుర్తించారు. ఈ గ్రామాలకు సరఫరా అయ్యే మంచినీటిలో పురుగులమందులేవో కలిసినట్లు నిపుణుల బృందం మొదట అనుమానించింది.

Ads

మరింత లోతుగా పరీక్షలు జరపగా వారు తిన్న గోధుమ పిండి రొట్టెలే కారణమని; నీటి కాలుష్యం కారణం కాదని రుజువయ్యింది. ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా సరఫరా అయిన గోధుమ పిండే ఈ బట్టతలోపద్రవానికి కారణం అని తేలింది. ఆ గోధుమలు స్థానికంగా పండినవి కాదు; పంజాబ్, హర్యానాల్లో పండినవి.

అక్కడి శివాలిక్ పర్వతశ్రేణుల్లో సిలీనియం రసాయనం ఎక్కువ. వర్షాకాలంలో అది నీటిలో కలిసి ఆ ప్రాంత గోధుమపంటల్లోకి చేరుతుంది. ఆ గోధుమ గింజల్లో పేరుకుపోతుంది. నిజానికి థైరాయిడ్ లాంటి హార్మోన్ తయారుకావడానికి శరీరానికి సిలీనియం అవసరం. కానీ పంజాబ్, హర్యానాలో పండి, తయారైన గోధుమ పిండిలో అది మోతాదుకు మించి ఉండడంతో నెత్తిన జుట్టును మాయం చేయడంతో పాటు ఇతర చర్మ సంబంధ సమస్యలను తెచ్చిపెడుతోంది.

idli day

అవే గోధుమలు మిగతా ప్రాంతాలకు కూడా సరఫరా అయి ఉంటాయి. వారందరూ ఇప్పుడు కేశోపహతులై తలలు పట్టుకుని కూర్చుంటున్నారట! “ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు ఫలానా”-అని మీడియాలో ప్రాయోజిత కార్యక్రమాలను చూస్తుంటాం. అలా “ఈ బట్టతలలను సమర్పించువారు మహారాష్ట్ర పౌరసరఫరాల శాఖ” అనిగానీ; “చౌక గోధుమ పిండి ద్వారా ఈ ఊరుమ్మడి ప్రత్యేక బట్టతలల ప్రాయోజిత కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఫలానా ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ” అనిగానీ చెప్పుకోవాలేమో!

bald head

మనలో మన మాట… సిలీనియం ఎక్కువైతేనే వారు అల్లకల్లోలమవుతున్నారు. మన దగ్గర చూడండి. తినేవాటిలో, తాగేవాటిలో ప్లాస్టిక్ ఎక్కువే. రంగుల రసాయనాలు ఎక్కువే. నిలువ ఉంచడానికి చల్లే రసాయనాలు ఎక్కువే. పురుగులు పట్టకుండా ఉండడానికి చల్లిన మందులు ఎక్కువే. ఏపుగా పెరగడానికి, పంట ఇబ్బడి ముబ్బడిగా పండడానికి చల్లిన ఎరువులు ఎక్కువే.

bald head

ప్యాక్డ్ ఫుడ్డు తళతళలాడుతూ, రంగు తగ్గకుండా, తాజాగా యుగాలపాటు ఉండడానికి కలిపిన నానా విష రసాయనాలు ఎక్కువే. అయినా మన జుట్టు రాలిందా? లేదే? రాలకపోగా గ్రోమోర్ ఎరువుతో పెరిగిన పంట తిన్నందుకు ప్రతిఫలంగా జుట్టు ఏపుగా, ఒత్తుగా పెరుగుతోంది! మొఘల్ సామ్రాజ్యాన్నే ఎదిరించిన మరాఠా యోధులు సిలీనియంతో పాటు మనలాగా మిగతా పురుగు మందులు, ఎరువులతో పెంచిన పంటల నుండి వచ్చిన ఆహారం తినడం లేదేమో! పాపం!!

కొస మెరుపు:- కర్ణాటకలో కొన్ని వందల హోటళ్ళ మీద ఆహార భద్రతా ప్రమాణాల శాఖ వారు దాడులు చేస్తే… ఇడ్లీల్లో ప్లాస్టిక్ బయటపడింది. ఆవిరి గిన్నెల్లో తడిపిన బట్టమీద ఇడ్లీలు పెట్టడానికి బదులు పాలిథిన్ (ప్లాస్టిక్) కవర్లు వాడుతున్నారు. వేడి తగలగానే ఆ ప్లాస్టిక్ ఈ ఇడ్లీల్లోకి చేరి… వేడివేడిగా ఆవిర్లు కక్కుతూ మన నోట్లోకి చేరి… హాయిగా పొట్టలో పేరుకుపోతోంది.

idli

మనం రోజూ తాగే పాల ప్యాకెట్లు ప్లాస్టిక్. మంచి నీళ్ళ బాటిళ్ళు ప్లాస్టిక్. టిఫిన్, లంచ్ బాక్సులు ప్లాస్టిక్. దాచుకున్న ఆహారం డబ్బాలు ప్లాస్టిక్. స్విగ్గీలు, జోమాటాలు తెచ్చిన డెలివరీ ప్యాకెట్లు ప్లాస్టిక్. మనం తిని, తాగి ఒంట్లో, పొట్టలో దాచుకుంటున్న ప్లాస్టిక్ పరిమాణాన్ని లెక్కకడితే మన కడుపులోపల ఎన్ని జెసీబీలు పెట్టి బయటికి తోడాలో ఉదరసంబంధ వ్యాధుల నిపుణులైన నాగేశ్వర రెడ్లకు కూడా లెక్క తేలదు!

idli

ఏమిటో! అనవసరంగా కేరళ కొండల్లో రబ్బర్ చెట్లు పెంచి… కొమ్మలకు కోతలు పెట్టి… చుక్క చుక్క రబ్బరు పాలు సేకరించి రబ్బరు, ప్లాస్టిక్ పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. ఎందుకంత శ్రమ! నెలకోసారి మన పొట్ట కోస్తే… కేజీ రెడీమేడ్ ప్లాస్టిక్ రెడీ! పొట్ట కోస్తే… అక్షరం ముక్క రాకపోవచ్చు కానీ… ప్లాస్టిక్ ముక్కలకేం కొదవ?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions