.
Gottimukkala Kamalakar …. జంట నెలవంకలుండే నింగి ఉంటుందేమో కానీ….
“నా సంగతి అడిగినవు.., నాకు మొగడు దొర్కడని సాపిచ్చి పీక్కపొయినవు..! నీకెసుమంటి పెండ్లం గావాలెనో శెప్పు..!” అన్నది రావలచ్చిమి.
వన్ ప్లస్ వన్ ఆఫర్ల ఆరొందల తొంబై తొమ్మిది రూపాయలకు కొన్న నల్ల కండ్లద్దాలు తీశి అంగీ గుండీల సందుల నూకిండు యాదగిరి. హల్దీరామ్ మూంగ్ దాల్ పాకిట్ల కెంచి గిన్ని పప్పులు శేతుల వోస్కోని బుక్కిండు. రావలచ్చిమిని కిందికి మీదికి రెండుమూడు సార్లు సూశిండు.
ఆల్లిద్దరు షాపింగ్ మాల్ ఫుడ్ కోర్టుల ఓ మూలకు కూసున్నరు. రావలచ్చిమి షాపింగ్ జేశిన కవర్లు యాదగిరి మోసుకొచ్చిండు కాబట్కె అవి ఆని పక్కన ఉన్నయి. నీల్లూ, కేయెఫ్సీల కోళ్లూ, ఇంకేటియో తినేటియి నడిమిట్ల టేబులు మీద ఉన్నయి.
“లేత రంగు కాటన్ శీరలు కట్టుకోవాలె. ముక్కుకు ముక్కెర ఉండాలె. శెవులకు పోగులుండాలె..! శేతికి గడియారం పెట్కున్నా ఇంకోశేతికి గాజులుండాలె..!” అని షురూ జేశిండు.
Ads
నీ సొల్లు ముచ్చట ఇననీకె నేను టెంతుక్లాసు పిల్లను గాను..! నా పీజీ ఐపోయి మూడేండ్లయితుంది. నా శీర, ముక్కెర, పోగులు, గడేరం గాజులు సూస్కుంట ముచ్చట జెప్పి పటాయిద్దావనుకోకు..! నాట్కాలాడితె, నాలికె కోస్త…! సచ్ మే శెప్పు, ఎటువంటి పెండ్లం గావాలె…? అన్నది రావలచ్చిమి.
యాదగిరి నోరెల్లబెట్టిండు. నీల్లసీసలకెంచి గట్టగట్ట ఓ రెండు బుక్కల నీల్లు తాగిండు. “నడిమిట్ల ఆపనంటె శెప్త..!” అన్నడు. “ఆప..!” అన్నది రావలచ్చిమి.
****
యాదగిరి తల్కాయ నేలకేశి లిస్టు షురూ జేశిండు.
“పోరీలు ఈ మద్దెన మస్తు సిగిరెట్లు కాలుస్తుండ్రు, తాగుతుండ్రు. సుక్కురారం పొద్మూకింతల షురూ జేస్తె ఆదోరం నడిరాతిరి దాంక దోస్తులెంబడి పొయ్యి తాగుతుండ్రు..! నా పెండ్లం బైటికి పోవొద్దు..!
ఇప్పటివరకు ఏ పోరగానెంబటి ఓయో రూములల్లండ్లకు పొయిన చరిత్ర ఉండొద్దు..!
ఇప్పటివరకు ఒక్క మొగదోస్తన్న ఉండొద్దు..!
మొబైల్ ఫోను ఎక్వతక్వ వాడొద్దు..!
ఫేసు బుక్కు ఎకౌంటు ఉండొద్దు..!
టిండర్ల ఎవనికి టెండర్ ఎయ్యొద్దు…!
బంబుల్ల ఎవన్ని గ్యాంబుల్ చెయ్యొద్దు..!
ఫెమినిజమూ, జస్టిస్ ఫర్ ఆమే, జస్టిస్ ఫర్ ఈమే అనుకుంట క్యాండిల్సు పట్కోని నక్లెసురోడ్ల తిరుగొద్దు..!
ఒంటిమీది కెంచి పుస్తెల తాడు ఎప్పుడు తియ్యొద్దు..!
ఆడోల్ల పనులన్ని చెయ్యాలె..! నన్ను చెయ్యమనొద్దు..!
మా అమ్మనాయినలకు రోజు కాల్లు మొక్కాలె…!
దేవత సీన్మల సావిత్రి లెక్క ఇంట్ల చీర కట్టుక తిర్గాలె..!
నిన్నేపెళ్లాడుతా సీన్మల టబూ లెక్క తెల్లారుజామున నెత్తిమీది కెంచి తానం జేశి కుంకుమబొట్టు పెట్కోని, తులసికోటల దీపం బెట్టి సుట్టు తిరగాలె..! అటెన్క పైలట్ లెక్క నౌకరీ చెయ్యాలె..!
ఓ ఐదొందలు కర్సులకు ఉంచుకోని మిగిలిన జీతం నాకియ్యాలె..!
శిన్నశిన్న బట్టలేస్కోని ఫోటువలు దిగి ఇన్స్టా ల, ఫేసుబుక్కుల వెట్టి లైకులు సూస్కోనే మైకంల పడొద్దు…!
మేకప్ సామానుకు ప్యాకప్ చెప్పాలె..!
ఆల్ల అమ్మనాయినలతోని వారానికి నాలుగునిమిషాలే మాట్లాడాలె..! ఏడాదిల రెండుసార్లే ఆల్లింటికి పోవాలె…!
మా శెల్లెలుకు ఆమె బట్టలో, నగలో, హ్యాండు బ్యాగులో నఛ్చితే నవ్వుకుంట “తీస్కో ఒదినా..!” అని ఇయ్యాలె..!
ఆఫీసు ఐపొయిన అరగంటల ఇంట్ల ఉండాలె…!
వంట రావాలె…! స్విగ్గీ జొమాటోల నెలకు ఓ పూటకు మించి ఆర్డరు పెట్టొద్దు..!
నేనేడికి పొయ్యి ఒచ్చినా, ఎప్పుడొచ్చినా ఏమ్మాట్లాడొద్దు..!” అని సీసల మిగిలిన నీల్లన్ని తాగిండు యాదగిరి.
****
ఆడు చెప్తున్న ముచ్చటంత తల్కాయ దించుకోని ఫోన్ల రికార్డింగు చేస్కుంది రావలచ్చిమి. యాదగిరి సప్పుడు ఆగేసరికి తలెత్తి చూశింది. “అంతేనా…? ఐపొయ్యిందా…?” అన్నది. తలూపిండు యాదగిరి.
“సావిత్రి మూడో పెండ్లమై మూన్నాళ్ళ సంసారం జేశింది..! నీ అసుమంటోళ్లని ఆస్ట్రింజెంటు రిమూవింగ్ కాటన్ బడ్ లెక్క నేలకుగొట్టి టబ్బూ అసలు పెండ్లే జేసుకోలే…!” అనుకుంట లేశి నిలబడ్డది రావలచ్చిమి.
“అంటె, నేను కోరుకున్నట్టు ఒక్క ఆడమనిషన్న దొర్కదా…?” మొకం మాడ్సుకోని అన్నడు యాదగిరి.
“ఎందుకు దొర్కదు, దొర్కుతది…!” అనుకుంట రావలచ్చిమి హ్యాండుబ్యాగు భుజానికేసుకోని నిలబడి శీర సర్దుకుంట నవ్వింది.
“యాడ దొర్కుతది..? ఆశగ రావలచ్చిమిని సూసుకుంట నిలవడ్డడు యాదగిరి.
"ఓంగే, జరావా, సెంటినెలీస్ అని ఖతమైపోతున్న గిరిజన జాతులు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నయి. ఆ జాతులల్ల దొర్కుతది..!" అంటూ తన షాపింగ్ కవర్లను విసురుగా లాక్కుని వెళ్లిపోయింది రావలచ్చిమి.
Share this Article