Prabhakar Jaini ఒక రోజు ఉదయం చీకటి తెరలు ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు కూడా! అప్పుడు కలిసిన వ్యక్తి! మేం కొత్త దంపతులం. అంటే అప్పటికే మా పాపకు రెండు నెలల వయసు. విమానంలో తిరుపతికి వెళ్ళాలని ప్లాను చేసుకుని, అంతకు ముందు సంవత్సరం పాటు డబ్బులు కూడబెట్టుకున్నాము.
అప్పుడు నాది చాలా చిన్న ఉద్యోగం. వరంగల్ మునిసిపాలిటీలో క్లర్క్ ఉద్యోగం. కానీ, కోరికలు ఉండకూడదని ఏం లేదు కదా? వరంగల్ నుండి ముందు రోజు బయలుదేరి హైదరాబాదుకు వచ్చి ఆబిడ్స్ లోని ఒక హోటల్లో బసచేసి మరునాడు ఉదయాన్నే ఆటోలో కోఠీ నుండి బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నాము. అసలు అంతకు ముందు విమానాశ్రయం కాదు కదా నిజం విమానం కూడా చూడలేదు, సినిమాల్లో తప్ప.
వెలుగుల తోరణాలు కట్టినట్టున్న విమానాశ్రయంలోకి బిక్కుబిక్కుమంటూ ప్రవేశించి వాళ్ళనూ, వీళ్ళనూ అడిగి చెకిన్ కౌంటరులో టికెట్ చూపించాలని చెబితే అటు వైపు నడిచాము. విమానం ఎక్కడమే ఆశ్చర్యమని మేమనుకుంటుంటే, ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళను చూసి మేము ఉక్కిరిబిక్కిరి అయ్యాము. మొత్తం తెలుగు, కన్నడ, హిందీ సినిమా రంగంలోని హీరోయిన్లు, హీరోలు అక్కడే ఉన్నారు.
Ads
హేమామాలిని, జమున, జయసుధ, జయప్రద, వాణిశ్రీ వీళ్ళందరినీ చూసి మూర్ఛపోయినంత పనయింది. మద్రాస్ వయా తిరుపతి వెళ్ళే ఆ విమానంలో మేమిద్దరం తప్ప మిగిలిన వాళ్ళంతా సినిమారంగానికి చెందినవారే. ఆ ముందు రోజు రవీంద్రభారతిలో జమునగారికి జరిగిన పేద్ద సన్మానానికి హాజరయి వాళ్ళంతా తిరిగి బొంబాయి, మద్రాసు, బెంగుళూరు వెళ్ళిపోతున్నారని మాటల్లో తెలిసింది!
ఎట్లాగో వాళ్ళు వేర్వేరు విమానాలు ఎక్కేంత వరకు చూస్తూ, మా విమానానికి పిలుపు రావడంతో మేము విమానం ఎక్కాము.
సినిమా తారల మధ్యలో నుండి నడుచుకుంటూ వెళ్ళి మా సీట్లల్లో కూర్చున్నాము.
మా ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా పూర్తిగా వెనక్కు వాలే సరికి, మా పాపకు ఇబ్బంది కలిగి ఉలిక్కిపడి ఏడవడం మొదలుపెట్టింది. దానికి ఆయన కంగారు పడి తన సీటు ముందుకు జరుపుకుని, లేచి నిలబడి, ఏడుస్తున్న మా పాపను, మా ఆవిడను చూసి,
“సారీ తల్లీ! దెబ్బ తాకిందా?” అంటూ మా పాపను ఎత్తుకుని లాలించాడు.
ఆయనే #శ్రీపతి_పండితారాధ్యుల_బాలసుబ్రహ్మణ్యం #మన_యస్పీ_బాలసుబ్రహ్మణ్యం
ఆయన చేతుల్లో నుండి మా పాప విమానం మొత్తం హీరోయిన్ల చేతుల్లో తిరిగి, యాభై నిముషాల తర్వాత, తిరుపతిలో దిగే సమయానికి మా చేతుల్లోకి వచ్చింది.
వాళ్ళెవరికీ ఈ సంఘటన గుర్తు ఉండకపోవచ్చు. కానీ, మాకు మాత్రం అదొక గొప్ప, మరుపురాని మధురస్మృతి. అప్పటి నుండి ఆయనంటే నా భార్యకు విపరీతమైన అభిమానం. ఆ తర్వాత ఆయన పాడిన ప్రతీ పాట మా కోసమే పాడినట్టనిపించేది. ఎందుకో, ఆ సంఘటన, ఆ #వ్యక్తి, గుర్తొచ్చి కళ్ళు చెమరుస్తున్నాయి.
.
Share this Article