.
ఒక ఏడాదిలో 53 లక్షల కోట్ల ఆయుధాల అమ్మకం…
దాదాపు డెబ్బయ్, డెబ్బయ్ అయిదేళ్ల కిందట దేవరకొండ బాల గంగాధర తిలక్ “సైనికుడి ఉత్తరం” పేరిట ఒక కవిత రాశాడు. నాలుగు పదుల వయస్సు మాత్రమే బతికి తన అక్షరాలను వెన్నెల్లో, ఇసుక తిన్నెల్లో ఆడుకునే అమ్మాయిల్లా తీర్చి దిద్దినవాడు తిలక్.
Ads
కవితా సతి నొసట నిత్య రస గంగాధర తిలకం- అని శ్రీ శ్రీ అంతటి వాడు పొంగి పరవశించిన కవిత తిలక్ ది. తెలుగు లేఖా సాహిత్యంలోనే ఆణిముత్యంలాంటి కవిత అది. ఒకప్పుడు తిలక్ రాసిన నీవులేవు నీపాట ఉంది…. ఈ సైనికుడి ఉత్తరం కవితలు చదవనివారు అసలు ఉండేవారే కాదు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏ దేశం కోసమో, ఏ దేశంతోనో, ఎక్కడో యుద్ధం చేసే మన సైనికుడి మానసిక సంఘర్షణను తిలక్ ఈ కవితలో ఒక డాక్యుమెంటరీ కంటే అద్భుతంగా రికార్డు చేశాడు. ఆ మధ్య క్రిష్ చక్కగా తెరకెక్కించిన కంచె సినిమా కథకు మాతృక ఈ “సైనికుడి ఉత్తరం” కవితే.
కంచె సినిమాలో “విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా?” అని సిరివెన్నెల ప్రశ్నించారు.
విద్వేషం పాలించే దేశాలు ఉన్నాయి. విధ్వంసం నిర్మించే నరకాలు ఉన్నాయి. భూగోళం చూస్తోంది. ఈకాలం వింటోంది. సరిహద్దుల కోటగోడలను నిర్మించడమే నవీన నీతి. ఆయువు తీసే ఆయుధమే ఇప్పటి పాఠం. రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యాన్ని ఈపూటే ఇంకింపజేయడమే ఇప్పటి యుద్ధ ధర్మం. ఖండాలుగా విడదీసే జెండాలే ఇప్పటి అజెండా.
సిరివెన్నెల పాటలు, తిలక్ కవితలు వినపడాల్సినవాళ్లకు వినపడవు. వినిపించినా అర్థం కాదు. అర్థమయినా ఆయుధం వదలరు. ఆయుధం వదిలినా పగను వదులుకోరు. యుద్ధం ఏదయినా మొదట చచ్చేది సైనికులే. ఆపై చావల్సినవాళ్లు సామాన్యులే.
అన్నట్లు-
ఆసియా ఖండంలో ఉద్రిక్తలు; రష్యా- ఉక్రెయిన్; గాజా గొడవల నేపథ్యంలో ప్రపంచ ఆయుధాల మార్కెట్ పంట పండిందట. ప్రపంచంలో పేరున్న వంద ఆయుధ తయారీ కంపెనీలు గడచిన ఒక్క సంవత్సరం అమ్మిన ఆయుధాల విలువ అక్షరాలా 53 లక్షల కోట్లట.
యాభై మూడు తరువాత ఎన్ని సున్నాలు పెడితే ఈ లెక్క సరిపోతుంది అన్నది సన్నాసులో, సున్నాసులో తీరుబడిగా చేసుకోవాల్సిన పని. బూడిద చేసే సున్నాలకు విలువేముంది? అని మనమనుకుంటే… బూడిదచేయడంలోనే అంతులేని వ్యాపారం దాగి ఉందని ఆయుధవ్యాపారులు చెప్తారు.
నిజజీవితంలో జరక్కపోయినా సినిమా తెరమీద 84 ఏళ్ళక్రితం ది గ్రేట్ డిక్టేటర్ సినిమా ముగింపులో ది గ్రేట్ చార్లీ చాప్లిన్ ప్రపంచశాంతిని కోరుతూ…యుద్ధం వద్దేవద్దని చెప్పిన అనన్యసామాన్యమైన ఉపన్యాసం వినండి:-
https://youtu.be/J7GY1Xg6X20?si=widAa44FdB4F-TUY
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article