ఈ దేశ మహాసైనికాధికారి మరణం మీద తమ అజ్ఞానాన్ని వర్షిస్తూ, సెలబ్రేట్ చేసుకునే అనేకానేక అశుద్ధ జీవుల సోషల్ పోస్టుల్ని కాసేపు వదిలేయండి… పిశాచగణాల బెడద దేశానికి ఎప్పట్నుంచో ఉన్నదే… కానీ అదేసమయంలో కొన్ని వార్తలు, కొన్ని ఫోటోలు హఠాత్తుగా పుట్టుకొస్తయ్… ఆశ్చర్యపరుస్తయ్… సోషల్ పోస్టులు జడ్జిమెంట్లు చెప్పేస్తుంటయ్, వ్యక్తుల్ని జడ్జ్ చేస్తుంటయ్, సకల వ్యవస్థల్నీ దునుమాడుతుంటయ్, జనాన్ని ప్రభావితం చేస్తుంటయ్… ఇదొక మాయాప్రపంచం… నిన్న ఓ ఫోటో, పోస్ట్ బాగా సర్క్యులేటయింది… అదేమిటయ్యా అంటే… ‘‘ప్రజాతంత్ర అని ఇండోర్ నుంచి వెలువడే హిందీ పత్రిక ఉత్తమ పాత్రికేయ విలువల్ని కనబర్చింది… ఇది కత్రినా పెళ్లిఫోటోలు ప్రచురించాల్సిన సందర్భం కాదు, బిపిన్ రావత్ దంపతుల్ని స్మరించుకునే సమయం, గ్లామర్‌కన్నా పుణ్యస్మరణే ప్రస్తుతం అవసరం… అందుకే మమ్మల్ని క్షమించండి, కత్రినా పెళ్లిఫోటోల్ని వేయడం లేదు… ఇదుగో బిపిన్ రావత్ దంపతుల పెళ్లినాటి ఫోటో, వాళ్ల పెళ్లిపత్రిక అంటూ ఆ పత్రిక పబ్లిష్ చేసింది… అసలు ఇవి కదా పాత్రికేయ విలువలు అంటే…’’ ఇదీ ఆ పోస్టుల సారాంశం…
సరే… మన సైన్యాన్ని నడిపించే నాయకుడు అకస్మాత్తుగా మరణిస్తే ఆ సంతాపం సహజమే… స్మరణ కూడా సహజమే… ఆ దంపతులకు సంబంధించిన జ్ఞాపకాల్ని, ఫోటోల్ని కూడా పబ్లిష్ చేయడం సహజమే… ఒకేసారి జంటగానే ప్రమాదంలో మరణించి, ఒకే చితిపై పరుండి, ఈ లోకాన్ని వదిలేసిన తీరు జనంలో కొంత ఎమోషన్‌ను నింపడమూ సహజమే… అయితే కత్రినా కైఫ్ పెళ్లి ఫోటోలకు, వీటికీ లంకె పెట్టడం కరెక్టు కాదు… అవే ఉత్తమ పాత్రికేయ విలువలు అనిపించుకోవు… ఈ దంపతుల పుణ్యస్మరణ ఉంది కాబట్టి కత్రినా ఫోటోల్ని వేయడం లేదు, క్షమించండి అని పాఠకులను కోరడమూ విచిత్రమే… ఏ వార్త ఆ వార్తే… కత్రినా కైఫ్ పెళ్లి ఫోటోలు పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదని పత్రిక ఓ లైన్ తీసుకుంటే వోకే, అది ఆ పత్రిక సంపాదకీయ నిర్ణయం… కానీ బిపిన్ దంపతుల వార్తలతో ముడిపెట్టాల్సిన పనిలేదు…
Ads
అంతేకాదు, అదేరోజు లాలూప్రసాద్ యాదవ్ కొడుకు, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి పెళ్లి కూడా జరిగింది… చాలా మీడియా సంస్థలు అసలు ఆ వార్తే వేసుకోలేదు, ఫోటోలు లేవు… ఆయా పత్రికల ఇష్టం… నిజానికి బిపిన్, కత్రినా, తేజస్వి వార్తలన్నీ జనానికి అందాల్సిన వార్తలే… కాకపోతే ప్రయారిటీలు వేరు… ఏది ఏ పేజీలో ఏ ప్రాధాన్యతతో ప్రచురించాలో పత్రికల ఇష్టం… అసలు ఈ ప్రజాతంత్ర డెయిలీ పేపర్ ఎక్కడిదబ్బా, సోషల్ సర్క్యులేషన్‌లో ఉన్న ఈ-పేపర్ కరెక్టేనా..? నిజంగానే సదరు పత్రిక ఈ పెళ్లి కార్డు ఫోటో పబ్లిష్ చేసిందా అని చెక్ చేస్తే… డిసెంబరు 10 నాటి ఈ-పేపర్ నెట్‌లో కనిపించలేదు… ప్రజాతంత్ర పేరుతో ఒరియా పత్రిక ఒకటి ఉంది, హిందీ పత్రిక కూడా ఉంది… (తెలంగాణలోనూ ఓ పత్రిక ఉంది)… ఇండోర్ ఎడిషన్ కోసం వెతికితే మే నెల దాకా ఈ-పేపర్లున్నయ్ తప్ప ఈ డిసెంబరు ఎడిషన్లు కనిపించలేదు… ప్రజాతంత్ర హిందీ సైటులో మాత్రం ఈ రావత్ దంపతుల ఫోటో, కత్రినా ఫోటోలు వేయడం లేదు, క్షమించండి అనే ఓ వెబ్ స్టోరీ కనిపించింది… అదీ బ్రీఫ్‌గా… (మధూలిక వాళ్లది మధ్యప్రదేశ్… వాళ్లదీ ఆర్మీ ఫ్యామిలీయే… రావత్, మధూలిక తండ్రులిద్దరూ ఆర్మీలో కొలీగ్స్… అలా కలిసిన సంబంధం అది…)
అదుగో బిపిన్ రావత్ పూర్వీకుల ఇల్లు… రిటైర్ కాగానే అక్కడికి వెళ్లిపోయి, అక్కడే ఓ ఇల్లు కట్టుకుని, సేంద్రియ వ్యవసాయం చేయాలని అనుకున్నాడు, కానీ ఈలోపు తనే మరణించాడు అంటూ మరో పోస్టు, ఫోటో దర్శనమిచ్చాయి… మెయిన్ స్ట్రీమ్‌లో ఆ ఇల్లు ఫోటో కనిపించలేదు… ఆయనకు స్వస్థలం మీద ప్రేమ ఉండటం సహజమే… అక్కడ ఓ ఇల్లు కట్టాలని అనుకున్నట్టు బిపిన్ బంధువు ఒకాయన చెప్పడం వరకూ నిజమే… 2018లో ఓసారి తమ సొంతూరు వెళ్లాడు… అందరూ వలసపోతున్నారు… చాలా చిన్న ఊరు అది.,. రోడ్డు కనెక్టివిటీ కూడా లేదు… 4.5 కిలోమీటర్ల రోడ్డు తన చొరవతోనే నిర్మాణం స్టార్టయింది… మరో కిలోమీటర్ ఇంకా మిగిలే ఉంది… తను రిటైరైనా సరే వెంటనే అక్కడికి వెళ్లి ఉండలేడు… రక్షణపరమైన ఇష్యూస్ కొన్ని ఉంటయ్… పైగా తనకు ఇద్దరు ఆడపిల్లలు, ఒకరికి పెళ్లయింది, మరొకామె ఇంకా చదువుకుంటోంది… సో, కొన్ని సోషల్ పోస్టులు ఇలా వస్తూనే ఉంటయ్, ఎందుకొస్తయ్ అంటే దానికి సమాధానం బ్రీఫ్‌గా కష్టం, అది పెద్ద సబ్జెక్టు..!!
Share this Article