కొత్త సంవత్సరమా!
కరోనా లేని వసంతమై వస్తావా?
————————
శుభ ప్లస్ ఆకాంక్ష – సవర్ణదీర్ఘ సంధి కలిస్తే శుభాకాంక్ష అవుతుంది. బెస్ట్ విషెస్ అన్న ఇంగ్లీషు మాటకంటే శుభాకాంక్ష అన్న సంస్కృతం లేదా తెలుగు మాట అర్థ విస్తృతి, లోతు, బరువు ఎక్కువగా ఉన్నట్లు అనిపించి; అంత గుండెలోతుల్లోనుండి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం లేదనుకుని ఇంగ్లీషు గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నాం. భాషదేముంది? ఇప్పుడిప్పుడే మాటలు, అక్షరాల్లేని ఇమోజి భాష నేర్చుకుంటున్నాం. ఇక ప్రపంచ భాషలన్నీ అంతరించి పాతరాతి యుగపు ఆది మానవులు గుహల్లో గీసుకున్న బొమ్మల ఇమోజి భాష ఒక్కటే రాజ్యమేలే రోజులు ఎంతో దూరంలో లేవు.
కొత్త సంవత్సరం వస్తుంటే కొత్త కోరికలు మొగ్గ తొడగాలి. రేకు విచ్చి కొత్త పరిమళాలు గాలికి గంధం పూయాలి. పాడుకాలం చీకటి పోయి రేపటి ఉదయకాలం అరుణారుణ వెలుగులు అందంగా ఉంటాయన్న ఆశలు మోసులెత్తాలి. 2020 పోయి- 2021 వస్తోంది. కరోనా నామ సంవత్సరం 2020 కంటే – వస్తున్న 2021 ఎలా భిన్నంగా ఉండబోతోందో ఎవరికీ అంతుబట్టడం లేదు. 2020 ప్లస్ కరోనా కలిసి సవర్ణ సుదీర్ఘ వైరస్ సంధి అయి ఇప్పటిదాకా అది విసంధి కాకుండా అలాగే వ్యాపిస్తూ ఉంది.
Ads
కొత్త స్ట్రెయిన్ లతో విశేషణ ఉత్తర పద వైరస్ కర్మధారయ సమాసమై వైద్య వ్యాకరణానికి అంతు చిక్కకుండా ఉంది. దేశాలు, ఖండాలు, సముద్రాలు దాటి వ్యాపించిన, వ్యాపిస్తున్న కరోనాను నిర్వచించడానికి ఉన్న వ్యాకరణం చాలడం లేదు. అన్ని సందులూ దానివే. అన్ని చెడు గుణాలు దానివే. రోగాలతో సహవాస సమాసం చేయించేది అదే. గృహ నిర్బంధాల్లోకి తోసి మన మొహం మీద వర్ణాన్ని వివర్ణం చేసేది అదే. చావుతో సంధి కుదిర్చేదీ అదే. ఎంత పొడువు గురువునయినా రెండ్రోజుల్లో లఘువుగా మార్చేది అదే. బతుకు గతిలో యతి ప్రాసలకు మతి పోగొట్టేది అదే.
అయినా- శుభమా అని కొత్త సంవత్సరం 2021 వాకిట్లో అడుగుపెడుతుంటే చావు ఛందస్సు, పాడు కరోనా పాత వ్యాకరణం ఎందుకు?
వ్యాక్సిన్ వచ్చి వసంతం వెల్లివిరిసే కొత్త వ్యాకరణం నేర్చుకుందాం. ఫైజరో, ఆక్స్ ఫర్డో, కో వ్యాక్సినో…ఏదో ఒకటి కనీసం ఈ వేసవికి పనిచేసి ప్రపంచం మళ్లీ మాములుగా పట్టాలెక్కి పరుగులు అందుకోవాలని కోరుకుందాం. ఉన్న ఉద్యోగాలు పోయి దిక్కులేని పక్షులై దిక్కులు చూస్తున్న కోట్లమందికి మళ్లీ పనులు దొరికి పట్టెడన్నం దొరకాలని కోరుకుందాం. వందల, వేల మైళ్లు నడిచి వెళ్లిన వలస కార్మికుల పాదముద్రల కింద చిట్లిన రక్తం పాడలేక పాడే విషాద రుధిర గీతాలు ఇక వినాల్సిన అవసరంలేని మంచి రోజులు రావాలని కోరుకుందాం. ముసుగు దాచిన మొహాల్లో పంటిబిగువున భరిస్తున్న బాధలు, భయాలు తొలగిపోయి- మనిషి సహజమయిన చిరునవ్వులు పూలు పూయాలని కోరుకుందాం. ఇంకా ఎన్నో ఎన్నో కల్లలు కాని కలలు కనాలని కోరుకుందాం.
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే- అన్నది కదా ఓదార్పు వాక్యం!
ఇంతకంటే జగతికి శోకమెక్కడిది?
ఇక ఉన్నది సుఖమే. ఆ సుఖాన్ని 2021 వెంటబెట్టుకుని రావాలని కోరుకుంటూ….
నూతన సంవత్సర శుభాకాంక్షలతో-…. By… పమిడికాల్వ మధుసూదన్
Share this Article