.
మన దరిద్రం ఏమిటంటే..? వేలు, లక్షల కోట్లు సంపాదించే ధూర్త నేతలూ అవి బయటపడగానే గిలగిలా కొట్టుకుంటూ… ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో పెట్టబడిన కేసులు, విచారణలు అని మొత్తుకుంటారు… కోర్టులు, విచారణ కమిషన్లు నేరాల్ని, తప్పుల్ని నిర్ధారిస్తున్నా సరే…
అనుచరగణం మావాడు కడిగిన ముత్యంలా బయటపడతాడు అని జనం కళ్లకు ఇంకా ఇంకా గంతలు కట్టే పనిలోనే ఉంటారు… కబ్జాలు, అక్రమాలు, ఆబగా ఆస్తుల దోపిడీ, అవినీతి మాత్రమే కాదు, అన్ని హద్దులు దాటేలా… బెదిరించి మరీ లైంగిక దోపిడీలు కూడా…
Ads
జాతీయ పార్టీల నేతలు శుద్ధపూసలు ఏమీ కాదు, అసలు రాజకీయ నాయకుడు అంటేనే జనం ఏవగించుకునే దురవస్థ… ప్రత్యేకించి కుటుంబ పార్టీల్లో ఈ దారుణాలు, పెడపోకడలు ఎక్కువ.., ఓసారి ప్రజ్వల్ రేవణ్న కేసే తీసుకుందాం… వాడికేం తక్కువ..?
ఇంజినీరింగ్ మెరిట్ స్టూడెంట్… తాత మాజీ ప్రధాని, 92 ఏళ్ల వయస్సులో ఈరోజుకూ యాక్టివ్ పొలిటిషియన్… సొంత పార్టీ… ఓ కొడుకు మాజీ ముఖ్యమంత్రి, మరో కొడుకు రేవణ్న ఎమ్మెల్యే, ప్రజ్వల్ ఓసారి ఎంపీ, సోదరుడు ఎమ్మెల్సీ… ఆ కుటుంబంలో ఏ పదవీ లేకుండా ఉన్నవాళ్లు ఎవరూ లేరు… పది తరాలు కూర్చుని తిన్నా తరగనంత సంపాదించారు… ఇంకా ఇంకా ఈ సమాజం ఏమివ్వాలిరా మీ కుటుంబానికి..? ఇంత ‘ కనరు ‘ దేనికి..?
చిన్నప్పటి నుంచే అధికార పైత్యం అలా ప్రజ్వల్ మెదడులోకి ఎక్కుతూ పోయింది… ఏం చేసినా నాకేం అడ్డు అనే సగటు రాజకీయ నాయకుల కొడుకులు, వారసుల్లాగే అనుకున్నాడు… చివరకు ఇంట్లో పనిమనిషి మీద లైంగిక దాడి చేసి… ఎంత పర్వర్షన్ అంటే (వాడిని తిట్టడానికి తెలుగులో సరైన పదాలు దొరకడం లేదు…) వీడియోలు తీసి పెట్టుకున్నాడు…
అలా ఎందరిని వాడుకున్నాడో లెక్క తెలియదు… చివరకు ఆ వీడియోల పెన్ డ్రైవ్స్ బయటికొచ్చేసరికి, అబ్బే, ఫేక్, పొలిటికల్ దాడి అని సిగ్గూశరం లేని వ్యాఖ్యలు చేశాడు… సాక్ష్యాలు బలంగా ఉండేసరికి, ముడి బిగుస్తుంది అని తెలిసి పరార్… సాక్షాత్తూ తండ్రే బాధితురాలిని కిడ్నాప్ చేసి, తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించే ప్రయత్నం చేశాడు…
కొడుకు ఏక్ నంబరీ, తండ్రి దస్ నంబరీ… ఈ మొత్తం కేసు, శిక్ష, తీర్పులో మనం అభినందించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి…
1. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పలుకుబడి, అపారమైన సంపద ఉన్నా సరే… ఏదైనా కొంటాం, ఎన్నేళ్లయినా సాగదీస్తాం, మాకేమీ కాదు అనే పిచ్చి భ్రమల్ని బ్రేక్ చేసింది ఈ కేసు… ఇది రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కడికీ ఓ పాఠం…
- 2. చివరకు సుప్రీంకోర్టులో కొట్లాడినా బెయిల్ దొరకలేదు… ఏళ్లూపూళ్లూ పట్టడం కాదు, జస్ట్, ఏడాదిలో ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ పూర్తి చేసి, శిక్ష ఖరారు చేసింది… ఓ టైమ్ వస్తే ఎంత సాధన సంపత్తి ఎంత ఉన్నా కాపాడలేదు అని నిరూపణ…
3. అంత తోపు కదా, కోర్టులో బోరుమని ఏడ్చేశాడు, తక్కువ శిక్ష వేయండంటూ వేడుకున్నాడు, అప్పటికే తనకు అర్థమైంది తన మెడకు ముడి బిగుసుకుంటున్నట్టుగా… పైకి ఎలా కనిపించినా ఓ దశ వస్తే బ్రేక్ అయిపోయి, నిలువునా నీరైపోయి, వాడిలోవాడే కుమిలిపోయేలా చేసే బలం సమాజానికి ఉంది, వ్యవస్థకు ఉంది, కానీ ఆ టైమ్ రావాలి…
- 4. అందరూ అనుకున్నట్టు తనకు వేసింది సాధారణ జీవిత ఖైదు కాదు, సాధారణ జీవిత ఖైదు అయితే రెమిషన్స్ ఉంటాయి, క్షమాభిక్షలూ ఉండొచ్చు… కొన్నేళ్లకు విడుదల కావచ్చు… కానీ ప్రజ్వల్‌కు వేసింది “Imprisonment for life which shall mean remainder of natural life”… అంటే సరళమైన అర్థం పూర్తి జీవిత ఖైదు, అంటే ఖైదీ తన సహజ జీవితం చివరి వరకు జైలులో ఉండాలి… ఈ నిర్దిష్ట శిక్ష ప్రకారం, ఖైదీకి క్షమాభిక్ష లేదా ముందస్తు విడుదలకు ఎటువంటి అవకాశం ఉండదు… చనిపోయేవరకు అతను జైలులోనే ఉండాలి… (As per LiveLaw News)…
5. ఐనాసరే, తనపై ఇదంతా రాజకీయ కుట్రే అంటాడు వాడు… ఇంకా కేసులున్నాయి, తండ్రి మీద కేసుంది, బెయిల్ మీద బయట ఉన్నాడు… ఈ దెబ్బకు దేవగౌడ కుటుంబం తలదించుకుంది… సొసైటీలో గతంలోలా తలెగరేసుకుని తిరగలేని స్థితి… ప్రజ్వల్ కేసులోలాగే… అవినీతి, అక్రమాలు, సొసైటీని నానారకాలుగా దోపిడీ చేసిన ధూర్తనేతలకు కూడా ఎప్పటికప్పుడు ఇలాగే కఠినశిక్షలు పడే రోజులు వస్తే బాగుణ్ను..!!
Share this Article