Bharadwaja Rangavajhala……. నర్రా రామబ్రహ్మంగారు గౌతమీ పిక్చర్స్ పేరుతో ఎన్టీఆర్ తో చాలా సినిమాలు తీశారు. మహామంత్రి తిమ్మరుసు, ఆలీబాబా నలభై దొంగలు, నిర్దోషి ఇలా…
గౌతమీ పిక్చర్స్ వారి కార్యాలయం మద్రాసులో పింగళి నాగేంద్రరావుగారింట్లో ఉండేది. ఆయన కూడా పింగళి లాగే బ్రహ్మచారి. పింగళి నాగేంద్రరావుగారు మరణించే సమయంలో ఆయన దగ్గరున్న ఇద్దరిలో రామబ్రహ్మంగారు ఒకరు. రెండోవారు డి.వి.నరసరాజు.
అప్పటికే పింగళి తన ఇంటిని ఘంటసాలకు అమ్మేశారు. ఇలా అమ్మడం మీద ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. జబ్బు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయిస్తాం కదా … దానికోసం ఇల్లెందుకు అమ్మేయాలనేది రామారావు గొడవ.
Ads
నిజానికి పింగళికి కాన్సర్ అని తెలిసినప్పుడు రాయవెల్లూరు ఆసుపత్రికి పంపి … అక్కడ తన స్వగ్రామం నిమ్మకూరుకు చెందిన డాక్టరొకరు ఉంటే వారితో మాట్లాడి … ఆ ఏర్పాట్లు చేసింది ఎన్టీఆరే. అయితే ఇల్లు అమ్మేశారని తెల్సినప్పుడు ఆయన బాధపడి … కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేశారు.
ఓ సారెప్పుడో పింగళి డబ్బు అవసరమై రామ్మూర్తిగారిని పంపిస్తే … ఎన్టీఆర్ దొరకలేదు. బిజీ షెడ్యూల్స్ లో ఉన్నారాయన. తర్వాత నరసరాజు గారి ద్వారా విషయం తెల్సుకుని బాధపడ్డారట. మేముండగా …. ఇల్లు అమ్మడం ఎందుకు అనేది ఆయన గొడవ. అలా పింగళి మీద అలిగారు అన్నగారు.
కె.వి రెడ్డి గారి విషయంలోనూ … ఇలానే వ్యవహరించారాయన. ఆయన కుమారుడు అమెరికా వెళ్లడానికి డబ్బు అవసరమైతే తనే దగ్గరుండి ఆ పన్లన్నీ చేసి అతను అమెరికా వెళ్లడానికి తోడ్పాటునందించారు.
విజయా వారు కె.వి యూనిట్ తీసేసినప్పుడు ఆయనకు ఇచ్చిన కంపెనీ కారు తీసేశారని తెల్సి తన కారు పంపిన శిష్యుడు ఎన్టీఆర్.
ప్రస్తుతం మీరు చూస్తున్న స్టిల్లు నిర్దోషి షూటింగ్ టైమ్ లో తీసినది. ఫొటోలో ఉన్న వారు హీరోయిన్ సావిత్రి, నర్రా రామబ్రహ్మం, దర్శకుడు దాదామిరాసి …
Share this Article