.
ఒక నగరాన్ని అర్థం చేసుకోవాలంటే, అది పాడే పాటను వినాలి కదూ?
టిబిలిసి మొత్తం వర్షంలో తడిసిపోయింది. రోడ్ల మీద దీపాల కాంతి, వాహనాల లైట్లు, అప్పుడప్పుడూ మెరిసే సౌవెనీర్ షాప్‌ల నీయాన్ వెలుగులు ప్రతిబింబించాయి. తడి నేల వాసన, తాజా కాఫీ సువాసన గాలిలో కలిసిపోయాయి.
అన్నీ నిశ్శబ్దంగా అనిపించినా, ఓ మూలన కాస్త గోధుమ రంగు కప్పుకొని వర్షపు చినుకుల్లో తడుస్తూ ఓ సంగీతకారుడు తన అకోర్డియన్‌తో ఏదో పాడుతున్నాడు. దాని స్వరం చిన్న గుల్మోహర్ చెట్టు కింద నిలబడి వినిపించేది. ఆ పాటకి అర్థం తెలియకపోయినా, ఆ సంగీతం మనసును ఏదో తెలియని లోతులో తాకుతోంది.
Ads
అదే చోట నేను, ఒక పురాతన ఆకర్షణ లాంటి సౌవెనీర్ షాప్ ముందు నానుకుంటూ నిలబడ్డాను. లోపల వెళితే, చెక్కతో చెక్కిన చిన్న బొమ్మలు, చేతితో నేసిన స్కార్ఫ్‌లు, పురాతన పుస్తకాలు అవన్నీ సిటీ గతాన్ని స్వరపరుస్తున్నాయి. ఒక మట్టి కప్పు తీసుకుని చేతిలో తిప్పుతుంటే, ఓ స్వరం వెనుక నుంచి వినిపించింది.
మీరు కూడా వర్షాన్ని ఆస్వాదిస్తున్నారా?
తిరిగి చూసేలోపు, ఆమె నవ్వుతూ,. తెల్లటి స్కార్ఫ్ తీస్తూ పక్కన ఉన్న కాఫీ మగ్గును చేతుల్లో పట్టుకొని ముందుకు నా వైపుకు కదిలింది, కనురెప్పల వెనకాల ఒక ప్రశాంతత.
వర్షం తప్పించుకోవాలనుకుంటే, లోపల రా, అని ఆమె స్వరం..
అది అంతే. టిబిలిసిలోని ముత్యాల రంగుల రోడ్ల మధ్య, మబ్బులతో కలిసిపోయిన కొండల మధ్య, ఓ అనుకోని పరిచయం ప్రారంభమైంది.
ఒక నగరాన్ని అర్థం చేసుకోవాలంటే, అది పాడే పాటను వినాలి కదూ?
ఆ రోజున ఆ పాట ఎవరైనా మన కోసమే పాడినట్టే అనిపించింది.
మబ్బుల మధ్య కురిసిన పాట
నీకు ఎప్పుడైనా వాన పడ్డ నిమిషాల్లో పాడాలనిపించిందా?
ఆ నీలి మబ్బుల చాటున కూర్చుని హాట్ కాఫీ తాగుతూ, సూటిగా తను నన్ను చూసి అడిగిన భావన. వర్షం కొంచెం తగ్గింది. మేమిద్దరం పప్పేట్ షోలు జరిగే గబ్రీయాడ్జ్ థియేటర్ ఇరుకువీధుల్లో నడుస్తూ గాలి మోసుకొస్తున్న తుంపర్లను ఆస్వాదిస్తున్నాం.
నిజం చెప్పాలంటే, వాన పడే సౌండ్ వినిపిస్తుంటే నేనే ఓ పాటగా మారిపోతానని అనిపిస్తుంది, అన్నాను, నవ్వుతూ.
తను ఒక వయోలిన్ వాదకురాలు. టిబిలిసి వీధుల్లో షేక్స్పియర్ ప్లే హౌస్ లో ఆమె వినిపించిన సంగీతాన్ని మొబైల్ లో చూపించినప్పుడు. ఏదో తెలియని సాహిత్యం ఆమె చేతుల్లోంచి సంగీతమై పల్లవించేదేమోననిపించింది. ఇకపోతే నేను – ఓ ప్రయాణికుడిని, కళ్ళలో జ్ఞాపకాల కాంతి, చేతిలో కెమెరా, ఊహల్ని చిక్కించాలనే తపన.
ఆ రోజు వర్షం మొదలయ్యేంత వరకు మేమిద్దరం మాటలు కలపలేదు. నగరం తడుస్తూ ఉండగా, ఆమె మాటలే తొలి జల్లుల్లా తాకాయి.
ఒక పాట మన జీవితాన్ని మార్చగలదని నమ్ముతావా?
ఆమె ప్రశ్నలో ఒక విశ్వాసం ఉంది.
నేను ఒక ఫోటో దృష్టిని మార్చగలదని నమ్ముతాను. ఒక దృశ్యం ఎప్పటికీ నిలిచిపోయేలా చేయగలదని నమ్ముతాను. కాని పాట? అది వినిపించని చోట మళ్లీ వినిపించదుగా.
తను ఓ సుతి మెత్తని నాజుకైనా పెదాలతో చిన్న నవ్వు నవ్వి, వయోలిన్ తీయగా, నా సమాధానానికి ఒక సంగీత బదులిచ్చింది. చుట్టూ నగరం, మబ్బులు, వర్షం – అన్నీ ఒక మౌన సంగీతంలో మునిగిపోయాయి.
పాట ఎప్పుడూ ఒకే రీతిలో ఉండదని నువ్వన్నది నిజమే. కానీ కొన్ని పాటలు మన లోపల బ్రతికిపోతాయి. మన శ్వాసలో, మన గుండె చప్పుడులో, మన జ్ఞాపకాల వెన్నెలలో.
ఆమె వాదన ఒక విధంగా కాదనలేని నిజం. కొన్ని అనుభవాలు దృశ్యాల్లా కాకుండా, శబ్దాల్లా మనసులో నిలిచిపోతాయి.
నువ్వెప్పుడైనా ఒక పాట కోసం ప్రయాణం చేశావా?
ఆమె ప్రశ్న నాకు ఊహించని వరం. నిజానికి, నేను ప్రయాణించిన ప్రతి ఊరు, ప్రతి నగరం, తనకంటూ ఒక పాటను ఇస్తూనే ఉంది. కానీ కేవలం ఒక పాట కోసం, ఒక అనుభూతిని సంపాదించేందుకు నేనెప్పుడూ ప్రయాణం చేయలేదనిపించింది.
లేదు. కానీ ఓ రోజు తప్పకుండా ఆ ప్రయాణం చేస్తాను.
ఆ రోజున, ఆ ప్రయాణంలో, ఓ వాన కురిసే చోట నిలబడినప్పుడు, నువ్వు ఈ మ్యూజిక్ గుర్తు పెట్టుకుంటావా?
ఆమె వయోలిన్ వాదనం ఆగింది. ఆ పదాలను ఆలోచిస్తూ నిలిచిపోయా. ఒకసారి, రెండుసార్లు, మళ్ళీ మళ్ళీ. కొన్ని మాటలు వానలాగా మన జీవితాల్లో పడతాయి. తడుస్తాయి. మనల్ని ముంచెత్తుతాయి.
కానీ నువ్వు పాడదగిన వాన కురిసే చోట నిలబడి ఉన్నావు. అని అన్నాను, నా కెమెరా తీసి, ఆమె పెయింట్ చేసిన జీన్స్ షర్ట్ ని ఫ్రేమ్‌లో బంధిస్తూ.
ఆమె నవ్వింది. ఒక పాట కోసం ప్రయాణించకపోయినా, ఒక పాటలో ప్రయాణించవచ్చు కదా?
ఆ మాట వింటూనే నా కెమెరా ఓ కొత్త కోణంలో ఆమెను చూశింది.
ఆ రోజు మేమిద్దరం వానలో తడిచిన జ్ఞాపకాన్ని పంచుకున్నాం. మెల్లగా అస్తమించే ఆకాశాన్ని చూస్తూ, వయోలిన్ నుంచి కురిసిన వానపాటను మనసులో దాచుకున్నాం.
ఇన్నాళ్లకు…
ఏళ్ల తరబడి, ఆ వర్షపు రోజులు వెనక్కి తిరిగి చూడగా, ఎప్పుడో ఓ చోట వింటున్న సంగీతం ఒక్కసారి నా మదిలో మార్మోగింది. ఒక గొంతు అడిగింది, ఒక పాట కోసం ప్రయాణం చేశావా?
అప్పటికీ సమాధానం లేదు.
కానీ ఆ ప్రశ్న ఇప్పటికీ నా వానలో నన్ను వెతుక్కుంటూ వస్తోంది.
ఆమె నవ్వు ఓ ప్రశ్న వలె, నా మౌనం ఒక జవాబు వలె, ఆ వర్షం ఒక పద్యం వలె.
ఎక్కడో మనం మరిచిపోయిన కథల్ని, మనమే మళ్ళీ కనుగొంటున్నట్టుగా.
మన జీవితంలో కొన్ని క్షణాలు నిజంగా మనవి కావు… కానీ అవే మనల్ని మనల్ని చేసేస్తాయి.
.
రఘు మందాటి
Share this Article