కాలమహిమ… టైమ్, డెస్టినీ, గ్రహచారం ఏమైనా పిలవండి… కేసీయార్ పార్టీ ఉత్థానపతనాలూ ఉదాహరణే… ఇక పార్టీని నడపలేను, వైఎస్ ఈ పార్టీని ఇక బతకనివ్వడు అని బాధపడుతూ, మహాకూటమి పరాజయంతో ఇల్లు కదలని కేసీయార్‌కు వైఎస్ మరణంతో దశ తిరిగింది…
జగన్మోహన్‌రెడ్డిని నిలువరించడానికి కాంగ్రెస్ పరోక్ష సహకారం, వ్యూహంతో తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ లేపితే… కేసీయార్ మళ్లీ హీరో అయ్యాడు… కానీ సమైక్యాంధ్ర లాబీయింగుతో తెలంగాణ ఆగిపోయి, ఇక కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కేసీయార్ అన్నిరకాలుగా రెడీ అయ్యాడు…
మళ్లీ దిగ్విజయ్‌సింగ్ రూపంలో కేసీయార్‌కు పేకాటలో జోకర్ తగిలింది… సొంతంగానే బరిలోకి దిగి, పదేళ్లపాటు అధికారం అనుభవించాడు… అపారమైన సాధనసంపత్తి సమకూరింది… విలీనం కావాలనుకున్న కాంగ్రెస్‌నే తొక్కీ తొక్కీ నారతీశాడు, కాదు, తీశాను అనుకున్నాడు, రెడ్ల మీద టీవీ చానెళ్లలో దుష్ప్రచార డిబేట్లు పెట్టించాడు… చివరకు ఏమైంది..?
Ads
నిజాం నవాబు పోకడ, పాలన వైఫల్యాలతో జనం ఛీకొట్టేసరికి వెళ్లి ఫామ్ హౌజులో పడ్డాడు… ఏ కాంగ్రెస్‌లో విలీనం అవుతానని అనుకున్నాడో అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, అదే రెడ్డి సీఎం అయిపోయి కేసులతో వెంటపడుతోంది… ఏ విద్య తను నేర్పించాడో అదే విద్యను కాంగ్రెస్ ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేలను లాగేసుకుంటోంది… కేసీయార్ క్యాంపు ఖాళీ అవుతోంది…
బీజేపీతో ఎక్కడ బెడిసిందో గానీ కొన్నేళ్లుగా బీజేపీ వెంటపడ్డాడు, పార్టీ అగ్రనేతల్ని అరెస్టు చేయడానికి టీమ్స్ పంపించాడు, ఏవో డ్రామా టేపులు దేశవ్యాప్తంగా ప్రముఖులకు పంపించి బదనాం చేశాడు… మోడీషాలను నానా మాటలూ అన్నాడు… మళ్లీ ఇప్పుడేమైంది..? రేవంత్ దాడుల నుంచి తప్పించుకోవడానికి అదే బీజేపీ అవసరం అవుతోంది…
మొన్నటి లోకసభ ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు ప్రయత్నాలు చేసి భంగపాటు… ఇప్పుడు ఏదో ఓ పార్టీ అండ కావాలనే దురవస్థకు వచ్చింది కథ… మళ్లీ బీజేపీలో విలీనం, పొత్తు అనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు… నిజమా కాదా, అవి జరుగుతాయా అనే చర్చను పక్కన బెడితే… డెస్టినీ గురించి చెప్పుకోవడం ఇక్కడ…
అరెస్టు చేయించబోయిన అదే బీఎల్ సంతోష్, అదే కేసీయార్ ఒకే ఫోటోలో… నానారకాలుగా వేధించబడిన అదే ఈటల, అదే కేసీయార్ ఒకే సీన్‌లో… అదే మోడీ, అదే కేసీయార్ ఆలింగనం చేసుకునే ఒకే దృశ్యంలో… అదే కేటీయార్, అదే హరీష్‌లతో అమిత్‌షా కరచాలనాల ఎపిసోడ్లు… తలుచుకుంటేనే అదోరకంగా అనిపిస్తోంది…
ప్రధాని అవుతాను, నాకేం తక్కువ, గాయిగత్తర లేపుతాను, బీజేపీని బంగాళాఖాతంలోకి విసిరేస్తాను అని గప్పాలు కొట్టిన కేసీయార్ , అవసరమైతే యాంటీ-బీజేపీ కూటమికి దేశవ్యాప్త ప్రచారవ్యయం భరిస్తానన్న కేసీయార్ చివరకు అదే బీజేపీలో విలీనం కోసమో, పొత్తు కోసమో దేబిరిస్తున్న తీరే డెస్టినీ అంటే..!
సరే, ఇప్పుడు పొత్తుతో బీజేపీకి వచ్చే ఫాయిదా లేదు, లోకసభలో జీరో, అసలు పార్టీ మనుగడే సంక్షోభంలో పడుతున్నవేళ… చేసుకుంటే విలీనమే బెటరేమో… కానీ అప్పుడు కేసీయార్ స్థానం ఏమిటి పార్టీలో..? కేటీయార్, హరీష్ ఎలా, ఏయే పోస్టుల్లో ఇముడుతారు..? బీజేపీ కేడర్ డిమోరల్ అయిపోదా..? ఎన్డీయేలో చేర్చుకుంటే సరిపోతుందా..? మరి ఎన్డీయే భాగస్వామి టీడీపీ చంద్రబాబు పాత్ర ఏమిటి తెలంగాణలో..?
ఆల్రెడీ తహతహలాడుతున్నాడు, తెలంగాణలో అప్పుడే అధికారంలోకి వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు… కేసీయార్‌కూ చంద్రబాబుకూ నడుమ ఉప్పూనిప్పూ… తెలంగాణ వదిలెయ్, ఏపీ రాజకీయాలు మాత్రమే చూసుకో అని చంద్రబాబుకు చెప్పగలదా బీజేపీ..? అసలే తన మీద ఆధారపడిన ఢిల్లీ కుర్చీ… కొంపదీసి కేసీయార్, చంద్రబాబు ఆలింగన వైపరీత్యం చూడాల్సి వస్తుందా..? సో, ఇన్ని సమీకరణాల నడుమ ఏం జరుగుతుందనేది తరువాత సంగతి… ఈ దుస్థితి ఎందుకొచ్చింది అనేదే పెద్ద డిబేటబుల్..!!
Share this Article