కొన్ని వార్తలను అభినందించడానికి పెద్ద ఉపోద్ఘాతాలు, వివరణలూ అక్కర్లేదు… జస్ట్, ఆ ఫోటో చూసి, ఆ రైటప్ చదివితే చాలు… విషయం మొత్తం అర్థమైపోతుంది… బోలెడంత వ్యాఖ్యానం, వార్త అవసరం లేదు… ఒక మంచి ఫోటో చాలా పెద్ద వార్తను చెబుతుంది… అదే ఇది… నిజానికి ఇప్పుడు ఈనాడు పాత్రికేయ ప్రమాణాల కోణంలో చూస్తే ఆ పత్రిక ఓ చప్పిడి పథ్యం తిండి బాపతు… దాని ఘనత అంతా ఒకప్పటి వైభవం… ఇప్పుడు ఆ పత్రికలో చదవడానికి ఏమీ ఉండటం లేదు, ఆలోచించడానికీ ఏమీ ఉండటం లేదు…
అది ఖచ్చితంగా తన ఆలోచనలకు తగినట్టు, తన లక్ష్యాలకు, స్వార్థానికి తగినట్టు వార్తలు రాస్తుంది… ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అది… ఈనాడు అంటేనే థాట్ పోలీస్… పక్కా సెల్ఫిష్… తమ వియ్యంకులవారు భారత్ బయోటెక్ వేక్సిన్ దందాకు తగినట్టుగా ఈమధ్య కాలంలో ఎన్నెన్ని పిచ్చి వార్తలు, పిచ్చి ఇంటర్వ్యూలు రాసిందో చూస్తున్నాం కదా… ఈ చీకట్లో కొన్ని మెరుపులు ప్రజల కోణంలో ఒకటీ అరా అప్పుడప్పుడూ ప్రత్యక్షమవుతుంటయ్… ఇంకా ఈనాడులో అరశాతమో, ఒక శాతమో పాత్రికేయం బతికే ఉన్నదనే ఆశలు కలిగిస్తుంటయ్… ఇదీ అదే..
Ads
ఆ ఆశను బతికిస్తున్నది కూడా ఈనాడు చీప్‌గా తీసిపడేసే కంట్రిబ్యూటర్లే తప్ప అది భారీ జీతాలు ఇచ్చి పోషించే స్టాఫర్లు ఏమీ కాదు… పెద్దపల్లి నుంచి వచ్చిన ఫోటో వార్త ఇది… తెలంగాణ ఎడిషన్‌లో ఫస్ట్ పేజీలో ఫోటో వార్తగా వేశారు… అక్కడికి సంతోషం… నాన్సెన్స్, వాట్ ఈజ్ దిస్ అంటూ జిల్లా పేజీకో, జోన్ పేజీకో పరిమితం చేయలేదు… నిజానికి ఓ పత్రిక ఆత్మ ఇలా కదా ఉండాల్సింది… ఇలా కదా స్పందించాల్సింది… ఒకప్పటి ఈనాడు ఇలాగే ఉండేది… ఇప్పుడు బాగా భ్రష్టుపట్టిపోయింది గానీ, నిజానికి ఇవి కదా వార్తలు అంటే… (పొరపాటున ఫస్ట్ పేజీలో ఈ ఫోటో వార్త వేశాం, క్షమించగలరు, కేసీయార్ ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ అజ్ అని వివరణ ఇస్తారేమో, ప్లీజ్, అంత పనిమాత్రం చేయకండి…)
ఇది పెద్దపల్లి నుంచి వచ్చిన వార్త… పెద్దపల్లి జిల్లా, మంథని మండలం, నాగారం అనే గ్రామం… బెల్లంకొండ మల్లారెడ్డి అనే రైతు… ఒక ఎకరం పొలం… దాని పక్కనే ఓ విద్యుత్ ఉపకేంద్రం ఉందట… మూడేళ్ల క్రితం ఆ పొలంలో ఏకంగా 19 పోల్స్ వేసి పారేశారు… అధికారులు అనుకుంటే ఆగేది ఏముంది..? ఈలోపు మల్లారెడ్డి చనిపోయాడు… కొడుకు రాఘవరెడ్డి వచ్చి చూసేసరికి ఇదీ దురవస్థ… అడిగితే పట్టించుకునేవాళ్లు ఎవరూ ఉండరు… చేసేవాళ్లు ఉండరు… ఇదీ వార్త…
నిజం… కరెంటు సంస్థలు ఏది చేసినా అది అల్టిమేట్, ఎవడూ అడగడానికి ఏమీ లేదు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి… కేసీయార్ ప్రభుత్వంలో విద్యుత్తు మంత్రి, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అంటూ జస్ట్, కాగితాల మీద ఉంటారు… కానీ నిజానికి ట్రాన్స్‌కో-జెన్‌కో బాస్ ప్రభాకర్‌రావు ఏది చెబితే అది… హ్యూమన్ యాంగిల్ ఏమీ ఉండదు… ఎవడెలా నాశనమైపోతే ఏంటి..? అన్నట్టుగా ఉంది దుస్థితి… ప్రభుత్వానికి కూడా ప్రైవేటు కరెంటు కొనుగోళ్లు, కథా కమామిషు మాత్రమే కావాల్సింది… ఇది సరే, ఎవరి ఉసురు ఎవరికి ఎలా తగుల్తుందనేది వేరే సంగతి… కానీ ఇప్పుడు మాత్రం కేసీయార్ పాలనలో సామాన్యుడిని ఎవడూ పట్టించుకోడు అనే నిజానికి ఇదో తార్కాణం…
ఈ రైతుకు ఏమిచ్చారు..? ఓ మిస్టరీ… ఎకరం పొలంలో 19 పోల్స్ వేశాక ఇక దున్నేదేముంది..? బహుశా రైతుబంధు ఇస్తున్నారు కదా, నోర్మూసుకోవోయ్ అంటారేమో… ఇంత రాసే సోయి, సాహసం, విశ్లేషణ సదరు సూపర్ పత్రికకు ఇప్పుడు లేకపోవచ్చు, ఏం రాయాలన్నా ఉ- పడుతూ ఉండవచ్చు… ఏదో పొరపాటున పబ్లిష్ చేశారేమో కూడా… ఈ వార్త పెట్టిన సబ్ ఎడిటర్, రాసిన రిపోర్టర్‌ను కూడా ఉంచుతారో లేదో తెలియదు… ఈ ఎడిషన్ ఎడిటర్‌కు అక్షింతలు కూడా పడవచ్చుగాక… కానీ వార్త వార్తే… అవునూ, ఇది మిగతా పత్రికలకు ఎందుకు కనిపించలేదు..?! అసలు ఇవి కదా వార్తలంటే…!!
Share this Article