Taadi Prakash…. కాకినాడ వెన్నెల కెరటాలూ… తణుకు చెరుకు రసాస్వాదనా… ముళ్లపూడి శ్రీనివాసప్రసాదూ….
…………………………………….
A pure poet of sheer joy
Ads
……………………………………
ముళ్లపూడి శ్రీనివాస్ ప్రసాద్ అనే పేరు
మీకు తెలియదు కదా!
కొంపలేం మునిగిపోవు. నాక్కూడా తెలీదు.
పోనీ అతను రాసినవో, అనువాదం చేసినవో
మీరు చదవలేదు కదా!
ప్రపంచం తల్లకిందులేమీ అయిపోదు.
నేనూ చదవలేదు.
అయినా, ఈ అన్నోన్, అన్ సంగ్, అండర్ కవర్
రైటర్ గురించి మనం మాట్లాడుకోవచ్చు.
కవిత్వం అంటే చాలు…. వేల సీతాకోక చిలకల జలపాతమై మనల్ని మబ్బుల్లోకి ఎగరేసుకుపోతాడు. బైరాగి… అంటే చాలు వూగిపోతాడు.
నోరు జారి, మరి బైరన్ అన్నావో… చెలరేగిపోతాడు. నెరూడాని నిలువెల్లా నిలబెట్టి అప్పజెబుతాడు. చూస్తూచూస్తుండగానే కృష్ణశాస్త్రి పదాలతో
మన చేతుల్లో గోరింటాకు పండిస్తాడు.
ఒక్క క్షణం ఆగి, ఆనా అఖ్మతోవా పద్యాలు చదివారా? అని అడుగుతాడు.
టోనీ హరిసన్ ‘అండర్ ది క్లాక్’ పోయెమ్స్ అప్పజెబుతాడు.600 పేజీల డెరిక్ వాల్కాట్ పోయిట్రీ బుక్కిచ్చి,ఏముంది -రెండు రోజుల్లో చదివేయొచ్చు అంటాడు.
మోహన్ ప్రసాద్ కవిత్వం అంటే యిష్టం.
అజంతా అక్షరాలంటే ప్రేమ.
ఇస్మాయిల్ పోయిట్రీ అంటే పిచ్చి. శ్రీశ్రీ సరేసరి!
ముళ్లపూడి శ్రీనివాసప్రసాద్ కమ్యూనిస్టు కాదు. కమ్యూనిస్టు వ్యతిరేకీ కాదు. అతన్ని చూస్తే నాకు ఒక్కటే ముచ్చట.కవిత్వానికి కుడి వైపూ నేనే, ఎడమ వైపూ నేనే అన్నట్టు మాట్లాడతాడు.
పైగా మాట మీద నిలబడతాడు.
పాత తెలుగు కవిత్వం పంట పొలాల్లో బయల్దేరి గోదావరి వచన కెరటాలై మెరిసి, ఇంగ్లీష్ పొయిట్రీ ఛానల్ యీది, ఆనక ఆధునిక ప్రపంచ కవితా
మహా సముద్రంలో ముంచేస్తాడు, నిన్నూ, నన్నూ…..
శుద్ధ కళాసౌందర్య తత్వ రక్త పిపాసిలా జ్వలిస్తూ వుంటాడు.ఓ పెగ్గులో కవిత్వం కలిపి ఆఫర్ చేస్తుంటాడు.మీ అంచనాలకు మించిపోయేలా దెంచనాల శ్రీనివాస్ కవిత్వం ఇంగ్లీషులోకి తర్జుమా చేశానన్నాడు. అంబటి సురేంద్రరాజా… అతను
నాకు గత జన్మనించీ తెలుసన్నాడు.పతంజలా, నాకెందుకు తెలీదు-అని దీర్ఘం తీస్తున్నాడు.
షేక్ స్పియర్ ది తణుకూ, గ్లెన్ మాక్స్ వెల్ ది
కాకినాడ అన్నట్టు మాట్లాడతాడు.
నాకిదంతా ఒకింత ఆనందం. ఒకింత సంభ్రమం.
నిజానికితను ఇంటర్నేషనల్ లిటరరీ డ్రగ్ కార్టెల్ కింగ్ పిన్. అసలు పేరు ముళ్లపూడి శ్రీనివాస ఎస్కోబార్! ట్రినిడాడ్ టొబాగో నీలి కెరటాల్లో సేదదీరి, మెక్సికో లిటరరీ ఎన్ కౌంటర్లలో రాటు దేలి, చార్మినార్ పక్కనే దొరికే ఇరానీ కడక్ చాయ్ కోసం హైద్రాబాద్ వచ్చిన మార్లిన్ బ్రాండోలా వుంటాడు.ఏదీ నా బ్లాక్ స్టాలియన్ అని అడిగి భయపెడుతుంటాడు.
* * *
ఇప్పుడే ఆనాకెరినినా తో మాట్లాడి, రాస్కాల్నికోవ్ తో సిగరెట్ కాల్చి, గ్రేటా గార్బోతో గొడవ పడి వచ్చినట్టుగా వుండే శ్రీనివాసప్రసాద్… అసలు వూరు తెనాలి, గుంటూరు జిల్లా.1993లో హైదరాబాద్ సీఫెల్ లో Post graduate Diploma in Teaching English చేశాడు. అక్కడే Susie Tharu దగ్గర ఎం.ఫిల్. చేసి, పి హెచ్ డి కూడా పూర్తి చేశాడు.
రావులపాలెంలో కొంతకాలం ఇంగ్లీషు లెక్చరర్. ‘అచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ’ అని పేరు పొందిన కాకినాడ పి. ఆర్.(పిఠాపురం రాజా)కాలేజీలో అధ్యాపకునిగా, ప్రిన్సిపల్ గా చాలా ఏళ్లు నాన్ స్టాప్ టీచింగ్. మిల్టన్, బ్రౌనింగ్, ఎమర్సన్, విట్మన్, ఇలియట్, కీట్స్,ఏట్స్, లారెన్స్,బెర్నార్డ్ షా నుంచి ఏ కె రామానుజన్ దాకా గుక్క తిప్పుకోకుండా చెప్పడంలో ఆరితేరినవాడని పేరు పొందాడు.
టీచింగ్ అనుభవాలూ, జ్ఞాపకాలతో శ్రీనివాస ప్రసాద్ ‘తోటలో కాలేజి’ అనే పెద్ద పుస్తకం వేశారు. రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి పథం, పిఠాపురం రాజా వారి కరుణ రథం అంటూ ఆ బతుకు పుస్తకంలో అనేక విలువైన వ్యాసాలను చేర్చారు.అందులో వాడ్రేవు వీరలక్ష్మీదేవి,ఇంద్రగంటిజానకి బాల,ఇస్మాయిల్,గుడిపాటి వెంకట చలం,కృష్ణశాస్త్రి,చిరంజీవినీకుమారి,ముట్నూరి కృష్ణారావు,చింతా దీక్షితులు,హేమలతా లవణం,బొల్లోజుబాబా,శిఖామణి,కంచర్ల సుగుణమణిల వ్యాసాలు తప్పక చదవదగినవి.
ఓ నెల క్రితం హైద్రాబాద్ లో ఈ పుస్తకం
ఆవిష్కరణకి శ్రీనివాస ప్రసాద్ నన్ను పిలిచారు.సురేంద్రరాజు,పాశం యాదగిరి,కొప్పర్తి వెంకట రమణమూర్తి,నేను ఆ సభలో మాట్లాడాం.
ఆ పుస్తకంలో కృష్ణశాస్త్రి,ఇస్మాయిల్,శ్రీనివాస ప్రసాద్ కవితలున్నాయి. పిఠాపురం రాజావారు అనాధల కోసం కట్టిన శరణాలయం శిధిలాలయంగా మారిన విషాదాన్ని పడాల కృష్ణారెడ్డి రాసిన తీరు కన్నీరు పెట్టిస్తుంది.
* * *
నిజానికి శ్రీనివాస్ ప్రసాద్ పేరు నాకు నలభైయేళ్ళ క్రితమే తెలుసు.మా ఏలూరు ఆర్టిస్టు కాళ్ళ సత్యనారాయణ,మా చెల్లాయి శకుంతల,కార్టూనిస్టు సురేంద్రల సన్నిహిత మిత్రుడని తెలుసు.అయిదు,పది నిమిషాలు కలిసి మాట్లాడానేమో గుర్తు లేదు. .’నిజం’పేరుతో మనకందరికీ బాగా తెలిసిన కవి, ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు గార శ్రీరామ్మూర్తి భార్య భాగ్యలక్ష్మి శ్రీనివాస ప్రసాద్ సొంత అక్క అని కూడా తెలుసు.ఇప్పుడిలా 2024 లో నెల క్రితమే కలవడం.
“మా తణుకు రండి,నేను కొన్న వేల పుస్తకాల లైబ్రరీ చూపిస్తాను”అని బెదిరించాడు. THE PENGUIN BOOK OF ELEGY అనే 600 పేజీలున్న కవిత్వం పుస్తకం యిచ్చి చదవండన్నాడు.స్టీన్ బెక్,కాఫ్కా, సాల్మన్ రష్దీ పుస్తకాలు యిచ్చి ఉక్కిరిబిక్కిరి చేశాడు పొరపాట్న ప్రపంచ సినిమా అన్నామా….
చచ్చామన్న మాటే! రిత్విక్ ఘటక్ ,సత్యజిత్ రే,బిమల్ రాయ్ ,శ్యామ్ బెనగల్ నించి గ్రిఫిత్ ,ఫెలినీ,ఐజెన్ స్టీన్,ఇంగ్మర్ బెర్గ్ మన్,అకిరాకురసోవా,గోడార్డ్ నుంచి క్లింట్
ఈస్ట్ వుడ్ దాకా ఎన్ని డజన్ల సినిమాలు చెబుతాడో…రే అపూ ట్రిలజీ అప్పజెప్పేస్తాడు. చారులత నుంచి గరమ్ హవా దాకా,మదరిండియా నుంచి మండీ, భూమిక,జానే భీ దో యారో దాకా, గురుదత్ ,వహిదా ,గీతా దత్ ల ప్రణయ కావ్య కన్నీటి చారికల దాకా…. నటులు,దర్శకులు,సంగీతం,ఫోటోగ్రఫీ…
ఒక భారీ ఆడియో విజువల్ ఎక్స్ పీరియన్స్ ని
మన కళ్ళ ముందు పరుస్తాడు.నేను ఎన్నడూ వినని,నాకు సుతరామూ తెలియని అనేకమంది పేర్లని అలవోకగా చెప్పాడు.ఏళ్ళ తరబడి
లెక్చరర్ గా పని చేసి,పాఠాలు చెప్పిన దురలవాటు వల్ల ఏ విషయం అయినా గొప్ప క్లారిటీతో గడగడా చెప్పుకుంటూ పోతాడు.
కవిత్వమూ,సినిమా అంటే ఎలా పేట్రేగిపోతాడో,WORLD OF ART అన్నా అంతే వున్మాదంతో వూగిపోతాడు.
సాల్వడార్ డాలీని ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ ఎలా
ఇన్ ఫ్లూయన్స్ చేశాడు?
హిచ్ కాక్ సినిమాల్లో డాలీ సర్రియలిస్ట్ పెయింటింగ్స్ ని సెట్ పాపర్టీస్ గా ఎంత బాగా వాడాడు?
విన్సెంట్ వాంగో సన్ ఫ్లవర్స్ ని మనం ఎందుకు కొనుక్కోలేం?పికాసో ఆధునిక కళా ఉద్యమానికి నాయకుడు ఎట్లా అయ్యాడు?
చెవి కోసుకున్నా,అరచేతిని కాల్చుకున్నా వాంగో విషాదానికి కారణమేంటి?
డి.ఎల్.ఎన్.రెడ్డి శిల్పాల్లోని సౌందర్య రహస్యం ఏమిటి?కాళ్ళ సత్యనారాయణ పెయింటర్ గా
ఏం సాధించాడు?బాపు వయ్యారపు రేఖా చిత్రాల్లోంచి మంద్రంగా వినిపించే సృజనాత్మక సంగీతం మీరు వినగలరా?
సూర్య ప్రకాశ్ పెయింటింగుల్లో రాలుతున్న ఆకుల్ని చేయి చాచి పట్టుకోవాలని మీకెప్పుడైనా అనిపించిందా?
గుస్తావ్ క్లిమ్ ట్ KISS లోని తియ్యదనం మీకు తెలుసా?రెంబ్రాంట్ పెయింటింగుల్లో
కాంతి రహస్యం ఏమిటో కనిపెట్టగలరా?
భారతీయ శిల్ప,చిత్రకళ ….ప్రపంచాన్ని ఎలా పాదాక్రాంతం చేసుకోగలిగింది?
ఇలాంటి వెయ్యి ప్రశ్నలకి తాపీగా,హాయిగా,తీరిగ్గా సమాధానాలు చెప్పగలిగిన వాడి పేరే ముళ్లపూడి శ్రీనివాస ప్రసాద్…….. An Organic intellectual and a pure poet to the core.
రేయింబవళ్లు ‘చదువు-అధ్యయనం’ అనే కఠోర తపస్సు చేసి,మేఘాలను తాకే శిఖరాలను అధిరోహించిన Himalayan Wonder అతను.ఇప్పుడు ప్రపంచ కవుల ఉత్తమ కవిత్వాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తున్నాడు.త్వరలోనే పుస్తకం తెస్తాను అన్నాడు.వొట్టి మాటలు చెప్పడం,ఆనాటి పాటల్ని గుర్తు చేయడమే కాదు,శ్రీనివాస ప్రసాద్
అనే ఈ ఇంగ్లీషు మేష్టారు,మృదువైన,
సుకుమారమైన తెలుగు వచనం రాస్తాడు.
అటు ఆంగ్లప్రావీణ్యమూ,ఇటు తెలుగు నైపుణ్యంతో అతను పరిమళాల పూల తోటల్లో పద్యాల్ని వెంటేసుకుని తిరుగుతుంటాడు.
తుమ్మెదలతో కబుర్లు చెప్తుంటాడు.
వహా కౌన్ హొ తేరా ….అని తనలో తానే పాడుకుంటూ, ‘సున్ మేరే బంధూరే…’ అని యస్.డి.బర్మన్ ని గొంతెత్తి పిలుస్తూ, పాత బ్లాక్ అండ్ వైట్ కాలంలోకి నడిచి వెళ్ళిపోతుంటాడు.
ఇతని మొదటి భార్య పేరు కోమలి.
రెండో భార్య పేరు కవిత్వం!
ముళ్లపూడి శ్రీనివాస ప్రసాద్ అనే ఒక సమ్మోహన శక్తికి 65 వ పుట్టినరోజు శుభాకాంక్షలు.
అతనికి నలుగురు అక్కలు.వాళ్ళ అవ్యాజమైన ప్రేమానురాగమే ఇతన్ని ఇంతగా పాడు చేసిందని
నా గాఢమైన అనుమానం!లేకపోతే ఇంత లిటరరీ మిషనరీ జీల్ తో పని చేయడం ఎంత కష్టం!
* * * -తాడి ప్రకాష్ 9704541559
Share this Article