ముందుగా ఒక వార్త చదవండి… ముంబై నుంచి వచ్చింది వార్త… గోవాలోని ఓ కోర్టు ఓ అసాధారణ షరతు విధించింది బెయిల్ ఇవ్వడానికి…18 ఏళ్ల ఓ యువకుడు… ఓ హత్యాయత్నం కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టయ్యాడు… బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు… సహజమే కదా…
బెయిల్ దరఖాస్తు చేసుకుంటే అదనపు సెషన్స్ జడ్జి బెయిల్ కోసం కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడానికి అంగీకరించారు… పాస్‌పోర్ట్ సమర్పించాలనేది కూడా అందులో ఒకటి… అన్నీ సరేగానీ, నాకు అసలు పాస్‌పోర్టే లేదని సదరు నిందితుడు చెప్పుకున్నాడు…
అంటే, ఇక సమర్పించడం… అంటే, సరెండర్ చేయడం అనే మాటే తలెత్తదు కదా… కానీ సదరు జడ్జి గారు ఏమన్నారూ అంటే… సరే, నీకు పాస్‌పోర్టు పొందడానికి నాలుగు నెలల గడువు ఇస్తున్నాను, అది వచ్చాక సమర్పించు అన్నారు సారు… బహుశా ఆ ఏరియా లాయర్లు అందరూ షాకై ఉంటారు…
Ads
సదరు నిందితుడు ఈసారి గోవా ధర్మాసనాన్ని ఆశ్రయించాడు… నాకు పాస్‌పోర్టే లేదు మొర్రో అంటుంటే, నాలుగు నెలల్లో తీసుకుని మరీ సరెండర్ చేయాలనడం ఏమిటి మహాప్రభో అనడిగాడు… గోవా ఏక సభ్య ధర్మాసనం వివరాలన్నీ పరిశీలించి బోలెడు విస్మయపడిపోయింది…
పాస్‌పోర్టు లేదన్న నిందితుడి విజ్ఙప్తిని జడ్జి పరిగణనలోకి తీసుకోకపోవడం ఏమిటి అనుకుని, 4 నెలలపాటు ఆ షరతును నిలిపివేయడం ఏమిటి అనుకుని, కాసేపటికి తేరుకుని… ఆ షరతును రద్దు చేస్తూ తీర్పు చెప్పింది…
సదరు అదనపు సెషన్స్ జడ్జి తన అధికార పరిధిని మించి వ్యవహరించారని జస్టిస్ భరత్ పాండే వ్యాఖ్యానించారు… ఇదీ వార్త… నిజానికి ఇక్కడ అధికార పరిధిని మించి వ్యవహరించడం కాదు, తను ఏం తీర్పు చెబుతున్నారో తమకే తెలియని ఓరకమైన అయోమయావస్థ అది…
సరే, ఇదీ వార్త… ఇలాంటి సమయాల్లో అలాంటి న్యాయమూర్తుల అర్హత, కొనసాగింపులపై హైకోర్టు గానీ, ఎగువ కోర్టులు గానీ ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు..? ఎందుకు వాళ్లు రిమూవల్స్‌కు అర్హులు కాకూడదు..? సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎందుకు సరైన గైడ్ లైన్స్ వెలువరించకూడదు..? అపెక్స్ బాడీ కదా, ఇలాంటి విషయాల్లో ఈ నిర్లక్ష్యం అన్యాయం కాదా యువరానర్..?!
Share this Article