ఆహా… పవన్ కల్యాణ్ అదృష్టమా మజాకా… ఓ మెయిన్ స్ట్రీమ్ పత్రిక… అదీ అనేక దశాబ్దాల చరిత్ర ఉన్న పత్రిక… బీమ్లానాయక్ అనబడే సినిమా మీద ఓ రివ్యూ కమ్ భజన కమ్ కీర్తన కమ్ డప్పు భీకరంగా థమన్ బీజీఎం రేంజులో వాయించేసింది..! కార్యకర్తకూ, అభిమానికీ నడుమ… సినిమాకు, రాజకీయానికీ నడుమ… రేఖలు గీసుకోలేని పవన్ కల్యాణ్ ధోరణిలాగే…!! పాత్రికేయానికి రోజురోజుకూ కొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో ఆంధ్రప్రభ ఎప్పుడూ వెనుకంజ వేయదు… హహహ…
పవన్ కల్యాణ్ పార్టీలో సదరు పత్రిక యజమాని సభ్యుడు… ఐతేనేం, అవసరార్థం జగన్‌కు, కేసీయార్‌కు కూడా అన్నమాచార్య రేంజులో కీర్తనలు రాసి తరిస్తుంటాడు… మరి యాడ్స్, డబ్బు గట్రా కావాలి కదా… పవన్ తన పొలిటికల్ బాస్ అయితే మరీ ఈ స్థాయికి చేరి (దిగజారి అని అనడం లేదు ఇక్కడ…) బోనాల పండుగ వేళ, బజారులో నిలబడి, శివాలూగుతూ, కొరడాతో కొట్టుకునే పోతరాజు తరహాలో చెళ్లుచెళ్లుమని కొట్టుకుంటున్నట్టుగా ఉంది ఈ కథనం…
Ads
ఫస్ట్ పేజీలో… ఒక సినిమా గురించి ఈ రేంజు సమీక్షా..? పైగా ఈ సినిమా అహంకారానికీ ఆత్మగౌరవానికీ మధ్య జరిగే యుద్ధం అని చెబుతూ… ఇదేదో జగన్ అహంకారానికీ, పవన్ ఆత్మగౌరవానికీ నడుమ యుద్ధంగా చూపించే విఫల ప్రయత్నం… ఈ యుద్ధంలో పవన్ గెలిచినట్టుగా ముక్తాయింపు… ఓహో, మా బాస్, మా హీరో గెలిచాడోచ్, జగన్‌కు వాతలు అన్నట్టుగా ఏదేదో రాసుకుంటూ పోయాడు ఈ సంకీర్తనాచార్యుడు ఎవరో గానీ..! మరీ సగటు పెయిడ్ యూట్యూబ్ చానెల్ రేంజుకు ఓ మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఎగబాకిన తీరు ఎంతైనా ఓ వింత సక్సెస్ స్టోరీ…!!
‘‘పవన్ మ్యానియా, రాష్ట్రవ్యాప్తంగా కనిపించింది… 80 శాతం సినిమా హాళ్లలో ఇదే సినిమా ప్రదర్శించారు… అభిమానుల ఆశల్ని మించి విజయం సాధించింది… పవన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది… నటనాపరంగానే కాకుండా రాజకీయంగానూ ఈ చిత్రం ద్వారా పవన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు… వ్యవహారాన్ని రాజకీయంగానే తేల్చుకుంటానంటూ స్పష్టం చేశాడు… ఇది ఇండస్ట్రీ హిట్… ఇంత ప్రజాదరణ గతంలో ఏ చిత్రానికీ లేదు… మహిళలు, వృద్ధులు సైతం థియేటర్లకు పోటెత్తారు… తగినంత మంది పోలీసుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు…
దీంతో జనసైనికులు, పవన్ అభిమానులే సొంతంగా బాధ్యతల్ని చేపట్టారు… వారే క్రమశిక్షణగా మహిళలు, వృద్ధుల్ని థియేటర్లలోకి తీసుకెళ్లి, సీట్లు చూపించి మరీ కూర్చోబెట్టారు… వారికి భద్రతగా నిలబడ్డారు… ఇది రాజకీయంగానూ పవన్‌కు కలిసొచ్చే ఓ ప్రధానాంశం… అభిమానులు హుండీల్ని ఏర్పాటు చేశారు, ఎగ్జిబిటర్లు నష్టపోవద్దనే భావనతో…!! భారీ వ్యయప్రయాసలకోర్చి గొప్ప నిర్మాణ విలువలకు అనుగుణంగా తీర్చిదిద్దారు సినిమాను… సరిపడా టికెట్లు దొరక్క జనం విలవిల్లాడారు… రాజకీయంగా పవన్ శక్తిసామర్థ్యాలకు అద్దం పట్టింది ఈ పరిస్థితి… పవన్ పైచేయి సాధించారు… ఇది ఖచ్చితంగా జనసేన బలాన్ని పెంచేదే…’’
……… ప్లీజ్ నమ్మండి… ఇంత ఉత్కృష్ట కథారచన నభూతోనభవిష్యతి… పైన ఉన్నదంతా ఆ ఫస్ట్ పేజీ విశేష, ప్రత్యేక, ఎక్స్‌క్లూజివ్ కథనంలో రాయబడిందే… ఈ సినిమాకూ రాజకీయ శక్తి సామర్థ్యాలకూ లింక్ ఏమిటో… పవన్ రాజకీయంగా పైచేయి సాధించడం ఏమిటో… రాజకీయంగానే తేల్చుకోవడం ఏమిటో… తొలిరోజు ఆటతోనే ఇండస్ట్రీ హిట్ అట… అసలు ఓ సినిమా విడుదలకు ఇన్నిరకాల బాష్యాలు చెప్పగలగడం సదరు పత్రిక యాజమాన్యం అత్యున్నత అభిరుచి… సామర్థ్యం… సార్, సార్, చిన్న ప్రశ్న… పాత్రికేయంలో మీరు సృష్టించిన ఈ వినూత్న ప్రక్రియకు ఏమైనా పేరు పెట్టారా..?! Just Asking…!!
Share this Article