నెవ్వర్… ముత్తా గోపాలకృష్ణ నాలాంటోళ్లను ఎవరినీ, ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు… పరచడు కూడా… అసలు ఆంధ్రప్రభ చరిత్ర ఏమిటి..? ఆ ఘన వారసత్వాన్ని కొనసాగించడంలో… ఆ ఘన పాత్రికేయాన్ని కొనసాగించడంలో అనితరసాధ్యుడు ఆయన… అసలు అల్టిమేట్ ప్రొఫెషనల్ జర్నలిజం అనే ఓ భ్రమాత్మక లక్ష్యానికి తన పత్రికను వేగంగా చేరవేయడంలో అదొక తపస్సు… అదొక ఆత్మ సాక్షాత్కారం… అదొక జీవనసాఫల్యం… అదొక విముక్తిమార్గం… అది అందరికీ సాధ్యం కాదు… ఎక్కడో ఏ మూలో సందేహాలుండేవి… ఈరోజుకు అవి పటాపంచలయ్యాయ్… మన పత్రికల పవిత్రత, ఘనత, విశిష్టత చూస్తేనే ఓ ఆనందం… అది ఏ భాషలోనూ ఎవడికీ సాధ్యం కాని ఓ యజ్ఞఫలం… ఇది అయుత చండీయాగానికి నాలుగు రెట్లు ఎక్కువ… మామూలు జనానికి అర్థం కాక ఏవేవో తిట్లు తిడతారు గానీ, అసలు ఆంధ్రప్రభ నిర్వహిస్తున్న పాత్రికేయయాగంలో… ఆ హోమగుండాల్లో పడి కాలిపోతున్న మూర్ఖ పాఠక హవిస్సులు ఎన్నో… ఎన్నెన్నో…
Ads
ఒక ఆధునిక వివేకానంద… ఒక విప్లవ వీర చెగువేరా… మోడీ కాదు, ఆయన తాతను… చంద్రబాబునే కాదు, ఆయన తాతను కూడా కడిగేసిన ధైర్యం ఎవరికి ఉంటుంది..? ఒక పవన్ కల్యాణ్‌కు మాత్రమే ఉంటుంది… నిజానికి చెగువేరా తాత ఆయన… ఆయన కుడిభుజం ఈ ముత్తా ముత్యం… అది అర్థం కావాలంటే పాఠకుడికీ ఓ రేంజ్ ఉండాలె… ఫలితాల కోసం కాదు, అధికారం కోసం కాదు, జస్ట్, ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగడం కోసం ఎన్నికల్లో నిలబడే పార్టీ అసలు ప్రపంచంలో ఉందా..? అది అర్థం చేసుకున్నది, సరైన బాష్యం చెప్పగలిగిందీ ఆంధ్రప్రభ మాత్రమే… ప్రభ పెద్దలంతా గర్వంతో కాలర్లు ఎగరేసుకుని, తమను తాము చూసుకుని మురిసిపోయే క్షణాలు కొన్నే… ఇదుగో, ఇలాంటి ఫస్ట్ పేజీ బ్యానర్లు ముద్రించి.., తెల్లారిలేచి ఏడుపూ, నవ్వూ కలగలిసిన వైరాగ్యంతో కిందామీదాపడి కొట్టుకుంటున్నప్పుడే… (ఇప్పటికీ పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి, మోడీ ఇంట్లోకి నేరుగా ప్రవేశించి, ఏమోయ్, మోడీ… నిన్ను కడిగిన ధైర్యవంతుడిని నేనే, అసలు నేనెవరో, నా రేంజ్ ఏమిటో తెలుసా అని ప్రశ్నించే సీన్ ఊహించుకుంటుంటేనే ఒళ్లు ఎంత గగుర్పొడుస్తుందో కదా…)
అసలు పవనిజం అంటే ఏమిటో పవన్‌కే తెలియదు, ఆంధ్రప్రభకు తెలుసు… వాళ్లు రాసింది చదివి పవన్ తెలుసుకోవాలి… అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, అర్థం కాకపోతే ముత్తాకు ఫోన్ చేయాలి… ఒక సాక్షి సిగ్గుపడాలి, ఎప్పుడైనా జగన్ మీద ఇలాంటి కీర్తన రాయగలిగిందా..? ఒక నమస్తే తలదించుకోవాలి, ఎప్పుడైనా కేసీయార్‌కు ఈ రేంజ్ భజన చేయగలిగిందా..? అంతెందుకు..? అప్పట్లో ఎన్టీయార్‌కు కూడా ఈనాడు ఈ లెవల్ స్టోరీ ఒక్కటైనా రాయగలిగిందా..? రామోజీరావు సిగ్గుపడాలి… కాదు, కాదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అందరికన్నా ఎక్కువ శరం ఫీల్ కావాలె… చంద్రబాబు మీద ఇందులో పావువంతు ‘ఆలాపన’ చేయగలిగిందా..? ఛిఛీ, ఎందుకయ్యా మీ బతుకులు… ఆంధ్రప్రభ కథనాలు చూసైనా బుద్ది తెచ్చుకోవాలె కదా… భజన చేస్తే ఓ అన్నమయ్య రేంజులో… ఓ రామదాసు రేంజులో చేయాలి… అదీ ముత్తా వారు నిరూపిస్తున్న నిజం… చివరకు పవన్ కల్యాణ్ కూడా హాశ్చర్యపోవాలె, ఔనా… నేను ఇంత గొప్పోడినా అని డౌటొచ్చి ముత్తాకు స్వయంగా ఫోన్ చేయాలె…!!
Share this Article