ఈ ఫోటో గుర్తుపట్టగలరా..? నిన్న ఆమె బర్త్ డే… ఈమె పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర… అలియాస్ చిత్ర… పద్మభూషణ్, పద్మశ్రీ, ఆరుసార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులు, ఎనిమిది ఫిలిమ్ ఫేర్లు మాత్రమే కాదు… తన కెరీర్‌లో 25 వేల పాటలు… బ్రిటిష్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ కామన్స్ సత్కరించిన తొలి భారతీయ మహిళ… వాట్ నాట్..? ఎన్నెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు… మన దక్షిణ కోకిల… ఉత్తరభారతానికి ప్రియ బాసంతి, కేరళలో వనంబాడి, తమిళనాడులో చిన్న కుయిల్, తెలుగువారికి సంగీత సరస్వతి, కర్నాటకలో కన్నడ కోగిలె… ట్రివేండ్రంలో పుట్టిన ఈ గొంతు ఎన్ని భాషల్లో పాడిందో తెలుసా..? తెలుగు, కన్నడ, మళయాళ, తమిళ, హిందీ, ఒరియా, పంజాబీ, గుజరాతీ, తుళు, రాజస్థానీ, ఉర్దూ, సంస్కృత, బడగ, బెంగాలీ… అలాగే విదేశీ భాషలు మలయ్, లాటిన్, అరబిక్, సింహిళీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్…. మెలోడీ, పాప్, కామెడీ సహా అన్నిరకాల పాటలు… అసలు ఒక సింగర్ జీవితానికి ఇంకేం కావాలి..? అయితే ఉజ్వల కెరీర్ వెలుతురు వెనుక ఆమెను నిత్యం బాధించే ఓ చీకటి ఉంది…
ముందుగా ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలీ అంటే… ఈటీవీలో కమెడియన్ ఆలీ ఓ షో చేస్తాడు తెలుసుగా… ఆలీతో సరదాగా… తిక్కలోడు చాలాసార్లు ఏవేవో తిక్క కేరక్టర్లను తీసుకొచ్చి, ఏదో చిట్‌చాట్ చేస్తాడు… మనకు తిక్క లేస్తుంది ఆ షో చూస్తే… ఇంకెవరూ దొరకలేదా అనిపిస్తుంది… కానీ అదే ఆలీ మరికొన్నిసార్లు మనం ఊహించని కేరక్టర్లను తీసుకొస్తాడు, తన పరిచయాలన్నీ వినియోగించి…! అప్పుడు ఆలీ భుజం తట్టి అభినందించాలి అనిపిస్తుంది… ఆలీ ఏం అడుగుతాడు, వాళ్లేం చెబుతారు అనేది వేరే విషయం… చిత్ర వంటి సింగర్స్ అసలు ఈ ఇంటర్వ్యూలు, తెర మీదకు రావడం గట్రా చాలా చాలా తక్కువ… వాళ్లు అక్కడికొచ్చి కూర్చోవడమే ఈటీవీకి, ఆలీకి పెద్ద గౌరవం… నిజం… చిత్ర కచ్చితంగా దక్షిణ సినిమా గౌరవంగా చూసుకోవాల్సిన కేరక్టరే…
Ads
ఎస్పీ బాలు చుట్టూ బోలెడు వివాదాలు ఉండవచ్చుగాక… కానీ చిత్ర మాట, నడవడిక చాలా పద్దతిగా ఉంటుంది… అందరూ గౌరవిస్తారు, దాన్ని నిలుపుకుంటుంది ఆమె… ఒక్కోసారి అనిపిస్తుంది… మన దక్షిణాదికి ఆమె ఓ లతా మంగేష్కర్, ఓ ఆశా భోంస్లే… కాదు, ఇద్దరూ కలిసిన కేరక్టర్… పోనీ, ఎస్.జానకి, పి.సుశీల కలిసిన కేరక్టర్ అనుకుందాం… ఆలీ ఆమెను తన షోకు తీసుకొచ్చాడు… ఏవేవో అడిగాడు, ఈటీవీ వాడు ప్రోమో వేశాడు… కానీ ఆలీ తన పిచ్చి గుణాన్ని పోనిచ్చుకోడు కదా… చిత్ర బిడ్డ గురించి అడిగాడు, ఆమెను ఏడిపించాలనేదే ఆలోచన… గెస్టులుగా ఎవరొచ్చినా ఏదో కెలికి, కన్నీళ్లు పెట్టించి, ప్రోమోలు కట్ చేయించి, ప్రచారం చేసుకోవడం ఓ పైత్యం… ఆమెకూ ఓ విషాదం ఉంది… ఆ విషాదం ఫోటో ఇది…
ఇది గత ఏడాది చిత్ర స్వయంగా ట్వీట్ చేసిందే… ఆమె బిడ్డ ఈ అమ్మాయి… పేరు నందన… పుట్టుకతోనే ఓ జెనెటిక్ డిజార్డర్… దాని పేరు డౌన్స్ సిండ్రోమ్… ఓసారి ఓ ప్రమాదంలో మరణించింది… తరువాత ఆమె పేరిట ఓ ట్రస్టు ఏర్పాటు చేసి, వృద్ధులకు, దివ్యాంగులకు చిత్ర ఎంతో కొంత సాయం చేస్తూ వస్తోంది… అసలు నాలుగు పాటలు హిట్టయితేనే సింగర్లకు కళ్లు నెత్తికెక్కే రోజులివి… అందరూ కాదు, చాలామంది… మరి చిత్ర కళ్లు ఎక్కడుండాలి..? కాళ్లు ఎక్కడుండాలి..? అప్పుడప్పుడూ అనిపిస్తుంది ఆమె మన దక్షిణ సినిమా ఇండస్ట్రీకి ఫిమేల్ బాలసుబ్రహ్మణ్యం అని… పాటల సంఖ్య గురించి కాదు… ఏ పాటైనా సరే, ఎలాగైనా సరే, ఆమె గొంతులో పడితే పల్లవిస్తుంది… అంతలా ఆమె మెప్పిస్తుంది… ఆలీ షో కారణంగానైనా ఓసారి ఆమె గురించి తలుచుకున్నాం… చాన్నాళ్లు ఇలాగే చల్లగా బతుకమ్మా…. మా డెక్కన్ కోయిలా..!!
Share this Article