స్వర్ణ భారతం కోసం ఉద్భవించిన భారత రాష్ట్ర సమితిలోకి ఏపీ నాయకులు కూడా తండోపతండాలుగా, మందలుమందలుగా చేరడానికి సిద్ధంగా ఉన్నారట… మంచిదే… ఇన్నాళ్లూ రాష్ట్ర విభజనకు కారకుడని కేసీయార్‌ను నిందించే వాళ్లే కేసీయార్ నాయకత్వాన్ని కోరుకోవడం అంటే అంతకు మించిన గుణాత్మక మార్పు ఇంకేముంటుంది..?
తోట చంద్రశేఖర్, కిషోర్ బాబు, పార్థసారథి తదితరులు ఏ అవసరాల కోసం బీఆర్ఎస్‌లో చేరారనే చర్చ జోలికి వెళ్లాల్సిన పనేమీ లేదు ఇప్పుడు… వాళ్లను తన పార్టీలోకి తీసుకురావడం మాత్రం కేసీయార్ పొలిటికల్ లెక్కలకు అనుగుణంగానే ఉంది… వైసీపీ రెడ్ల పార్టీ, టీడీపీ కమ్మ పార్టీ, మరి కాపులకు…? మనకూ ఓ పార్టీ ఉందనీ, ఇది మన పార్టీ అనే భావనను పవన్ కల్యాణ్ బలంగా కలిగించలేదు కాబట్టి, బీఆర్ఎస్ ఇటు లాక్కొంది… ఆ ముగ్గురిలో కిషోర్ బాబు దళితనేత, గతంలో అధికారాన్ని చూసినవాడు… మంత్రిగా కూడా చేశాడు…
వీళ్లలో ఒకరు రాష్ట్ర అధ్యక్షుడు… మరొకరు జాతీయ స్థాయి కోఆర్డినేటర్… బస్… నిజానికి వాళ్లు బీఆర్ఎస్‌లో చేరగానే ఏపీలో పార్టీ దూసుకుపోతుందనే భ్రమలు చేరినవారికి లేవు, చేర్చుకున్నవారికి లేవు… కానీ ఏదో ఒక అడుగు ఎక్కడో ఓచోట స్టార్ట్ కావాలి కదా… ఏపీలో శాసనసభలో బలం చేజిక్కించుకోవాలనే తలంపు కేసీయార్‌కు ఉందని చెప్పలేం… కాకపోతే జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పడానికి ఏవో కొన్ని ఎంపీ సీట్లు కావాలి… కాదు, ప్రతిచోట తనకు ఉనికి కావాలి… అంతకుమించి ఇప్పుడప్పుడే సాధించేదేమీ ఉండదు…
Ads
నిజానికి నిన్నటి చేరికల మీటింగ్ ఏదో పొలిటికల్ మీటింగ్‌లా లేదు… ప్లానింగ్ బోర్డు సమావేశంలా ఉంది… కేసీయార్ అయితే ఏకంగా జింబాబ్వే భారీ డ్యామ్ దాకా వెళ్లిపోయాడు… లక్షల టీఎంసీల గురించి, లక్షల మెగావాట్ల గురించి చెబుతూ పోయాడు… కానీ ఏపీలో పాలన మీద పల్లెత్తు మాట అనలేదు… అనలేడు… జగన్ మనవాడే… చంద్రబాబు అధికారంలో లేడు… అసలు ఏపీ పాలిటిక్స్ అంటేనే బూతులు, విషాలు, విద్వేషాలు… అవేమీ లేకుండా ఏపీ పార్టీ శాఖ ప్రారంభం ఏమిటి అసలు..? తాట తీస్తా, నాలుక కోస్తా భాషేదీ అసలు..?
రేప్పొద్దున తెలంగాణలో చర్చ జరుగుతుంది… కేసీయార్ జింబాబ్వే డ్యాముల దాకా వెళ్లిపోయాడు, ఏదేదో చెబుతున్నాడు… వైజాగ్ స్టీల్ ప్లాంటు అమ్మినా, మనమే కొని జాతీయీకరిద్దాం అంటున్నాడు… బాగుంది… కానీ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు పొక్కను వెడల్పు చేస్తుంటే, ఏపీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేసీయార్ దాన్ని వ్యతిరేకించడా ఇక..? ఆల్‌రెడీ శ్రీశైలంలో పవర్ వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది… కృష్ణాజలాల్లో 50 :50 కాదు, 64 :36 శాతాల వాటాలు అట…
మరి శ్రీశైలం ఎగువన మన జలప్రయోజనాల మాటేమిటి..? ఎవరు మాట్లాడాలి ఇవన్నీ..? ఇలా రెండు రాష్ట్రాల నడుమ కుప్పలుతెప్పల ఇష్యూస్ ఉన్నాయి ఇంకా..! ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పుడొక లెక్క షేర్ ఖాన్ అని సినిమా డైలాగ్ ఒకటి వల్లెవేసుకుని, చప్పట్లు కొట్టాలా తెలంగాణ జనం..? ఈరోజుకూ పప్పులు, నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం, నిజమే… ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణలో పప్పులు, నూనెగింజల వైపు రైతుల్ని మళ్లించే ప్రయత్నం ఎందుకు సాగలేదు..? సో, రాజకీయంగా ఇప్పుడు ఏపీలో ఎవరినీ ఏమీఅనలేడు కాబట్టి దేశమంతా దళితబంధు, రైతులకు ఉచితకరెంటు తదితర సోకాల్డ్ తెలంగాణ మోడల్ విశేషాల్ని మాత్రమే చెబుతున్నాడు కేసీయార్… వివాదాస్పద అంశాల జోలికి వెళ్లే ఉద్దేశం బీఆర్ఎస్‌లో చేరినవాళ్లకు లేదు, అవి మాట్లాడేంత సీన్ కూడా లేదు…!! ష్, ఏమాటకామాట… తోట చంద్రశేఖర్‌తోపాటు పార్టీలోకి ఓ డప్పు చానెల్ కూడా వచ్చింది… శుభం…
Share this Article