Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాపం శమించుగాక… బంగ్లాదేశ్ సరే… మరి మన బంగళాలు పదిలమేనా..?

August 6, 2024 by M S R

అచ్చం అప్పట్లో శ్రీలంకలో జరిగినట్టుగానే… ఇప్పుడు బంగ్లాదేశ్… ఒక్కసారి మూకలు అదుపు తప్పితే… కారణాలేవైనా గానీ… అత్యంత పటిష్ఠ భద్రత అని మనం పైకి చెప్పుకునే అన్ని బారికేడ్లు విరిగిపోతాయి… సైన్యం, పోలీసులు చేష్టలు దక్కుతాయి… అధ్యక్షులు, ప్రధానులు చివరకు బతుకుజీవుడా అని పారిపోవాల్సి వస్తుంది…

వాళ్ల నివాసభవనాలను మూకలు ప్రతి అంగుళం దోచేస్తారు, తగలేస్తారు, సెల్ఫీలు దిగుతారు… అదొక సామూహిక ఉన్మాద స్థితి… బంగ్లా ఇందిరగా చెప్పబడే షేక్ హసీనా, ఏళ్లకేళ్లుగా పాలిస్తున్న ఓతరహా నియంత ఇప్పుడు నిరాశ్రయురాలు… ఆమె మొదటి నుంచీ ఇండియాతో స్నేహంగా ఉంది గనుక మోడీ ప్రభుత్వం సహకరిస్తోంది… లండన్ ఆమెకు ఆశ్రయం కల్పించేదాకా ఇండియాలో ఉండటానికి అనుమతిస్తుంది…

మనకు గాంధీ ఎలాగో… ఆమె తండ్రి షేక్ ముజిబిర్ రెహమాన్ బంగ్లాకు జాతిపిత… ప్రాణాలకు తెగించి, బంగ్లా విముక్తికి పోరాటం చేసిన ఆయన విగ్రహాన్ని, బొమ్మల్ని కూడా ఆమె మీద కోపంతో ధ్వంసం చేస్తున్నారు… అంతే, ఉన్మాద సునామీ ముంచెత్తిన వేళ విచక్షణలు, వివేచనలు పనిచేయవు… అసలు ఎందుకీ దుస్థితి..?

Ads

అసలే అక్కడ బాయ్‌కాట్ ఇండియా పేరిట ఇండియా ఉత్పత్తుల్ని కొనకుండా ఆందోళనలు నడిపిస్తున్నాయి ప్రతిపక్షాలు, భారత వ్యతిరేక శక్తులు… అదీ హసీనాకు వ్యతిరేక పోరాటమేనట వాళ్ల దృష్టిలో… గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షాలు పాల్గొనలేదు… సమయం కోసం కాచుక్కూర్చున్నాయి… చైనా కూడా పెట్రోల్ పోస్తుందనే విమర్శలూ ఉన్నాయి… అదంతే… దానికి భారత్ చుట్టుపక్కల ఏ దేశమూ భారత్‌కు అనుకూల స్థితిలో పదిలంగా, ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదు…

బంగ్లా మిలిటరీ పాలన, పాకిస్థాన్ ఆల్మోస్ట్ మిలిటరీ పాలన, శ్రీలంకలో అనిశ్చితి, నేపాల్‌లో రాజకీయ అనిశ్చితి, మయన్మార్‌లోనూ సైన్యం పెత్తనం… వెరసి ఇండియా చుట్టూ… ఎక్కడా సుస్థిర, సజావు వాతావరణం లేదు… నిజానికి తాజా అల్లర్లకు కారణమైన రిజర్వేషన్లపై గతంలోనే వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది… కానీ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు మళ్లీ దేశంలో అన్‌రెస్ట్ పెచ్చరిల్లేలా చేసింది…

సున్నితమైన సమస్యల మీద మేం చెప్పేదేదో చెప్పేస్తాం, తరువాత దేశం ఖర్మ అన్నట్టుగా ఉంది… తమ నుంచి విడిపోయిన బంగ్లాపై పాకిస్థాన్‌కు మొదటి నుంచీ మంటే… ఏ పాకిస్థాన్ నుంచి విముక్తి పొందారో, చివరకు ఆ పాకిస్థాన్ సాయాన్నే హసీనా వ్యతిరేక శక్తులు తీసుకున్నాయనే వార్తలూ వస్తున్నాయి… పిటీ… ఏ ఇండియా సాయంతో విముక్తి పొందారో ఆ ఇండియా వ్యతిరేకతలో ఎగిసిపడుతున్నారు… మతపరమైన దాడులు సరేసరి…

అక్కడి నుంచి వచ్చే హిందువులకు పౌరసత్వం ఇస్తామంటే మన మమతలు, మన అఖిలేషులు, మన రాహుల్ గాంధీలు, మన స్టాలిన్లకు మంట… అది చెబుతూ పోతే అదొక ఒడవని ముచ్చట… మన రాజకీయాలూ విచక్షణారాహిత్యాలే… అందుకే ఇక్కడ చెప్పుకోవాల్సింది మరో ప్రధాన విషయం ఉంది…

ఢిల్లీ సురక్షితమేనా..? అప్పట్లో ప్రధానీ హత్యకు గురైంది కదా… తరువాత అల్లర్లలో వేలాది మంది హతులు, బాధితులు, క్షతగాత్రులు… ఆ గాయాలు ఎప్పుడూ మానేవి కావు… రైతు ఆందోళనల పేరిట కొంతకాలం క్రితం ఢిల్లీలో అరాచకం ప్రబలిన తీరూ చూశాం… ఏకంగా ఎర్రకోట మీదే జెండా ఎగిరింది… ప్రధాని పంజాబ్ వెళ్తే ఓ ఇరుకు బ్రిడ్జి మీద జస్ట్, ఓ ట్రాక్టర్ అడ్డుపెట్టి ప్రధానిని దాదాపు దిగ్బంధించారు…

ఆప్ చాలా కోణాల్లో అరాచకశక్తే… ఖలిస్థానీ శక్తులకు అది ఊతం… ఢిల్లీ దానికి అడ్డా… ఢిల్లీకి రాష్ట్ర హోదా తీసేసి, వంద శాతం కేంద్ర పాలిత ప్రాంతం చేసేసి, రాజకీయాలకు అతీతమైన ఓ పాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి… కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్ని అడ్డాలుగా చేసుకుని ఖలిస్థానీ శక్తులు బలపడుతున్నాయి… వాటికి మోడీ అంటే ప్రతి కణంలోనూ మంట… ఇక్కడా పాకిస్థాన్ వాటికి మద్దతు… పాకిస్థాన్ మద్దతు అంటే చైనా మద్దతు కూడా…

భారత ఉపఖండంలో ఎన్ని అవాంఛనీయ రాజకీయాల పోకడలున్నా సరే… ఈరోజుకూ ఇండియా మాత్రమే సుస్థిరంగా ఉంది… ఆర్థికాభివృద్ధిలో ఉంది… యావత్ ప్రపంచమూ మనల్ని ఏమాత్రం ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదిప్పుడు… దీంతో కడుపు రగిలిపోతున్న శక్తులు ఇంటా ఉన్నయ్, బయటా ఉన్నయ్… సో, బంగ్లా సరే, మరి మన బంగ్లాలూ పదిలమేనా..? అజిత్ ధోవల్, మోడీ కూర్చుని సావధానంగా సమీక్షించుకోవాల్సి ఉంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….
  • ఒక గొప్ప ఫోటో..! దీని వెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!
  • నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ కథ…
  • గొప్పల తిప్పలు తరువాత… ముందు నీ గోచీ సరిచూసుకోవయ్యా ట్రంపూ…
  • ఇది ఆ పాత కాంగ్రెస్ కాదు… ఈ జుబ్లీ గుట్టల్లో కొత్తగా స్ట్రాటజిక్ అడుగులు…
  • ‘‘కేసీయార్‌వి ప్రచార నాటకాలు- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు’’
  • మొన్నటి అమ్మాయిల విజయం వెనుక ఓ అలుపెరుగని గురువు..!!
  • ఓ సుదీర్ఘ వీక్షణం… ఆ పాత వైబ్స్ లేవు, ఆ గూస్ బంప్స్ లేవు…
  • అదే రవితేజ… అదే మొనాటనీ… అదే యాక్షన్… అదే ‘మాస్ జాతర’…
  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions