‘ఆకాశం నీ హద్దురా’… ఈ సినిమా పేరు ఇప్పుడు మోగిపోతున్నది… సూర్య నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిట్టయింది… ఓ బయోపిక్ ఇది… కేవలం రూపాయి టికెట్టు ధరతో సామాన్యుల్ని కూడా విమానప్రయాణం చేయించడం అనే కాన్సెప్టు జనానికి బాగా కనెక్టయింది… విమానం అనేది ధనికుల విలాసమేనా..? సామాన్యుడి సౌకర్యం కాదా..? ఇదీ ప్రశ్న…
అయితే సినిమాలో చూపించిందంతా నిజమేనా..? అది కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్కేనా..? కాదు..! ఆయన స్వయంగా రాసుకున్న ‘సింప్లీ ఫ్లై’ బయోగ్రఫీ నుంచి కొన్ని పాయింట్సే తీసుకున్నారు… చౌక విమానయానం అనే కాన్సెప్టుకు తగిన ఇతరత్రా మెటీరియల్ కలిపారు… సినిమా అంటే కాస్త మెలోడ్రామా గట్రా కావాలి కాబట్టి… క్రియేటివ్ లిబర్టీ తీసుకుని, ఓ కొత్త కథ రాసుకున్నారు… కాకపోతే స్థూలంగా అది గోపీనాథ్ బయోపిక్‌గానే చెలామణీ అవుతోంది…
నిజంగానే ఆయన రూపాయికే సామాన్యుడికి విమానప్రయాణ సౌకర్యం కల్పించాడా..? తను నిర్మించిన ఆ ఎయిర్ డెక్కన్ నడుస్తోందా..? సినిమాలో చూపించింది నిజమేనా..? ఈ ప్రశ్న చాలామందిలో ఉంది… అసలు ఎవరీ గోపీనాథ్..? తను తమిళుడా..? కాదు… కన్నడిగుడు…
Ads
తన పేరు గోరేరు రామస్వామి అయ్యంగార్ గోపీనాథ్… ఆయన తండ్రి టీచర్… తనకి ఎనిమిది మంది సంతానం… గోపీనాథ్ సెకండ్… సైనిక్ స్కూల్లో చదివి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పాసై, ఇండియన్ ఆర్మీ అకాడమీలో చదువు పూర్తిచేశాడు… బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా పాల్గొన్నాడు… ఎనిమిదేళ్లకే రిటైరయ్యాడు… (సినిమాలో ఒక్కడే సంతానం అన్నట్టుగా చూపించారు…)
సినిమాలో చూపించినట్టుగా… రిటైర్ కాగానే… ‘ఏవేవో గ్రామీణుల కష్టాలు చూసి… రూపాయికే విమానప్రయాణం అనే సంకల్పం తీసుకోలేదు తను… ఆర్మీ నుంచి వచ్చేశాక పట్టుపురుగుల పెంపకం స్టార్ట్ చేశాడు… మంచి ప్రాఫిట్స్ వచ్చాయి… తర్వాత ఆటోమొబైల్, హోటళ్లు… పలు రంగాల్లో వేలు పెట్టాడు… నాలుగు డబ్బులు పోగేసుకున్నాడు… సినిమాలో చూపించినట్టుగా జనం అందరూ ఎగబడి విరాళాలు ఏమీ ఇవ్వలేదు… 1997లో తొలిసారిగా డెక్కన్ ఏవియేషన్ కంపెనీ పేరిట హెలికాప్టర్ సేవల్ని స్టార్ట్ చేశాడు… అర్థమైంది కదా… సినిమా వేరు… అసలు కథ వేరు…
ఇప్పుడంటే చార్టర్డ్ ఫ్లయిట్స్, ఛాపర్లు బోలెడు… కానీ అప్పట్లో సెలబ్రిటీలు, నాయకులు, ధనిక వ్యాపారులు, ఇండస్ట్రియలిస్టులు గోపీనాథ్ హెలికాప్టర్లను ఎక్కువగా వాడుకునేవాళ్లు… ఆ తరువాత తనకు తట్టిన ఆలోచన విమానాలు… 2003లో ఎయిర్ డెక్కన్ స్టార్ట్ చేస్తే… రూపాయి టికెట్టు అనే ఆలోచన అమలు చేసింది 2006లో… చిన్న విమానాలు అనే కాన్సెప్టుతో… ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా తన కంపెనీని సక్సెస్ చేశాడు…
చాలాముందుగా బుక్ చేసుకుంటే, కారుచౌక ప్రయాణం అనే కాన్సెప్టును రాను రాను దాదాపు అన్ని విమానయాన సంస్థలూ అందిపుచ్చుకున్నయ్… అయితే గోపీనాథ్ ఎయిర్ డెక్కన్ ఈ రూపాయి ప్రయాణం స్టార్ట్ చేసినా… రాను రాను అది తను ఆశించిన లాభాల్ని తీసుకురాలేదు… కంపెనీని నష్టాల్లోకి నెట్టేసింది… రూపాయి టికెట్టు జస్ట్, రెండేళ్లలోనే సంస్థను దాదాపు దివాలా స్థితికి తీసుకొచ్చింది…
ఇక్కడే అసలు ట్విస్టు… సినిమాలో విజయ్ మాల్యా (పాత్ర పేరు బాలయ్య) తనకు అమ్మేయాలని అడిగితే… ఫోరా, నా కలల్ని కొంటావా నువ్వు అని తిట్టి ఫోన్ పెట్టేస్తాడు… కానీ నిజానికి అదే మాల్యాకు 2008లో తన కంపెనీని అమ్మేశాడు గోపీనాథ్… అదే ఐరనీ… కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేసేశాడు… కానీ అది కూడా నష్టాల్లోనే నడిచింది… 2012లో ఏకంగా విమాన సర్వీసులే నిలిచిపోయినయ్…
కానీ గోపీనాథ్ వదిలిపెట్టలేదు… డెక్కన్ 360 పేరిట కార్గో సేవల్ని ప్రారంభించాడు… 2017లో ఎయిర్ డెక్కన్ రీఎంట్రీ… కేంద్రం ప్రవేశపెట్టిన ఉడాన్ అనే పథకం ద్వారా చిన్న విమానాలతో చౌక రేట్లకు విమానసేవల్ని స్టార్ట్ చేశాడు… రూపాయి టికెట్టు అమలు చేశాడు… కానీ దానికి లక్కీ డ్రా పెట్టి, గెలిచినవారికే రూపాయి టికెట్టు… నిజానికి మాల్యాకు తన కంపెనీని అమ్మేసుకోవడం తననూ కష్టాల్లోకి నెట్టింది… తీసుకున్న రుణాలను పక్కదోవ పట్టించాడనే సందేహాలతో సీబీఐ పలుసార్లు తనను ప్రశ్నించింది… అప్పట్లో తను కింగ్‌ఫిషర్ బోర్డు సభ్యుడు కాబట్టి…! ఇప్పుడు తనకున్నవి మూడు చిన్న ఎయిర్ బస్సులు మాత్రమే… కరోనా కదా… సర్వీసులు ఆగిపోయాయి… సో, సినిమాలో చూసిన కథ కేవలం ఓ కల్పన… అయితే ఆ కథలోని స్ఫూర్తి మాత్రం సూపర్… ఆకాశం నీ హద్దురా అన్నట్టుగానే ఉంది… ఎటొచ్చీ నిజజీవితం అలా ఉండదు కదా…
Share this Article