స్లమ్ డ్లాగ్ మిలియనీర్… మారియా కాన్సీకోవా!
రోల్స్ రాయిస్ కారులో సూట్ బూటు వేసుకుని దిగినంత మాత్రాన హీరోలైపోరు. కురచ దుస్తులు ధరించి అందాల విందు ప్రదర్శించేవారంతా హీరోయిన్సూ కారు. చలించేలా ఇన్స్పైర్ చేసిన ఓ కథకు నాయకత్వం వహిస్తే.. కథానాయకులు, కథానాయకలవుతారు. అలాంటి ఓ కథానాయకే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మారియా కాన్సీకావో.
జస్ట్ టాయిలెట్ క్లీనర్… ఎవరెస్ట్ ను మించిన ఎదిగిన కథ ఇది.
Ads
అచ్చ తెలుగు భాషలో మనం పిల్చుకునే పాకీ పని చేసుకునే ఓ మహిళ మారియా కాన్సీకావో. బంగ్లాదేశ్ ఢాకా మురికివాడల చీకట్లను పారద్రోలి మెర్క్యూరీ వెలుగులు నింపిన ఓ ఉత్తేజ తరంగం. టాయిలెట్ క్లీనర్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ అటెండెంట్ గా.. అంటే ఎయిర్ హోస్టెస్ స్థాయికెదిగి.. పది రికార్డ్ బ్రేకింగ్ స్టోరీస్ తో.. బూర్జ్ ఖలీఫా ఎత్తులో నిల్చిన ఓ మహిళ మారియా. మరంతలా వావ్.. ఓహ్… ఔరా అనిపించేలా సాధించిన మారియా విజయాల వెనుకున్న కథేంటి..?
ఇంతకు మారియా ఏం చేసిందని.. ఈ పొగడ్తలు..?
2023లో ఎస్టోనియా ట్యాలిన్ లోని మైండ్ వ్యాలీ యూనివర్సిటీలో.. మారియా చెప్పిన మాటల ప్రకారం… ‘‘నేను కష్టపడి ఓ టాయిలెట్ క్లీనర్ స్థాయి నుంచి హెయిర్ హోస్టెస్ స్థాయికి ఎదిగాను. ఓరోజు ప్లైట్ లో ప్రయాణిస్తున్నప్పుడు.. ఢాకాలో ఫ్లైట్ ల్యాండింగ్ టైంలో అక్కడ కనిపించిన స్లమ్స్ పై నా దృష్టి పడింది. ఎక్కడ చూసినా మురికివాడల్లో.. లక్షల మంది తమ బతుకులను ఎంత విషాదభరితంగా ఈడుస్తున్నారో నేనే స్వయంగా తిరిగి పరిశీలించాను. అప్పుడే ఢాకా మురికివాడల్లోని బతుకుచిత్రాలు నన్ను చలింపజేశాయి. కనీసం తనవంతుగా నూటొక్క కుటుంబాల తలరాతలను మారుస్తాననని.. వారిని పేదరికం నుంచి బయట పడేస్తానని ప్రమాణం చేశాను. అది నా లైఫ్ మారథాన్ గా… ఓ బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా మారిపోయింది. అప్పట్నుంచే నా లక్ష్యం కోసం ఈ పరుగు ప్రారంభమైందంటుంది మారియా.
నేనూ ఓ శరణార్థి దగ్గర పెరిగాను.. ఆమె నన్నెలా పెంచి పెద్ద చేసిందో.. నేనూ ప్రామిస్ చేసిన 101 కుటుంబాలకు చెందిన 600 మంది పిల్లలను పెంచుతానని ప్రతిన బూనాను…’’ కానీ, అలా వారిని సాకాలంటే ఏం చేయాలో మాత్రం అప్పటికి నాకు తెల్వదంటుంది మారియా.
2005లో మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ ను చేపట్టిన మారియా… ఆ తర్వాత పేదల బతుకుచిత్రాన్ని మార్చేందుకు అదే జీవితకాల మిషన్ గా మార్చుకుని.. మిషన్ పాజిబులిటీ కోసం పరుగులు పెడుతూనే ఉంది. తను ఒట్టు పెట్టినట్టుగానే తాను కష్టపడుతూ సంపాదిస్తున్నదాంతో ఎన్నో జీవితాలకు చదువునందిస్తూ వెలుగులు నింపుతోంది కనుకే.. ప్రపంచమిప్పుడు మారియా గురించి మాట్లాడుతోంది.
మారియా మిషన్ వెనుక.. తన బతుకుచిత్రపు కన్నీటి కథనం!
పోర్చుగల్ లో భర్తను కోల్పోయిన ఓ ఒంటరి మహిళకు పుట్టింది మారియా కాన్సీకావో. పేదరికంతో వచ్చే కష్టాలు.. అలాంటి వారి జీవితాల్లో కమ్ముకునే చీకట్లు.. వారి మనుగడ.. ఇంత పట్టెడన్నం కోసం పడే ఈతిబాధలన్నీ బాల్యం నుంచే అనుభవిస్తూ.. మొత్తంగా రంగుల ప్రపంచం నుంచి తమలాంటి వారు ఎలా వెలివేయబడుతారో చూస్తూ పెరిగింది మారియా.
మారియాకు కేవలం రెండేళ్లున్నప్పుడే.. వితంతువైన ఆమె తల్లి.. ఇక మారియాను సాధలేక… అంగోలన్ శరణార్థి, పాకీ పని చేస్తూ అనాథ పిల్లల శిబిరాన్ని నిర్వహిస్తున్న క్రిస్టినాకు.. సంరక్షణ కోసం అప్పగించింది. క్రిస్టినా వద్దనున్న ఆరుగురు పిల్లలకు తోడు.. ఏడోదానిగా మారియా రెండేళ్లకే అభంశుభం తెలియని వయస్సులో శరణార్థి శిబిరానికి చేరుకుంది. కానీ, మారియాకు తొమ్మిదేళ్లు వచ్చేసరికి.. తన తల్లి తనను వదులుకుని అప్పగించిన క్రిస్టినా కూడా ఆకస్మికంగా మరణించడంతో.. మారియా జీవితం విషాదభరితంగా మారింది.
ఇక అప్పుడు తను కూడా తనను సాకిన తల్లి క్రిస్టినాలాగే.. టాయిలెట్ క్లీనర్ కంటే ఎక్కువగా ఎదగలేనేమోనన్న ఒకింత సందేహంతో.. తానూ ఓ పాకీ మహిళగా తన 18 ఏళ్ల వయస్సులో పని ప్రారంభించింది. కానీ, ఆ పనిలోనూ పోటీతత్వం ఉంటుంది కాబట్టి… చేసేది పాకీ పనైనా అందులో నంబర్ వన్ గా ఉండాలన్నదే మారియా మోటో. అందుకే, తానెంచుకున్న రంగంలో కూడా ఓ డీగో మారడోనా, ఓ మెస్సీ, ఓ రోనాల్డోను తలపించేలా పని చేయాలన్న సంకల్పాన్ని ఏర్పర్చుకున్నానంటుంది మారియా.
కట్ చేస్తే కొంత కాలానికి మారియా స్విట్జర్లాండ్… ఆ తర్వాత ఇంగ్లండ్ వంటి దేశాలకు వెళ్లింది. అలా వెళ్లిన ప్రతీచోటా ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం.. గిరి గీసుకుని కూర్చోకుండా ఆత్మవిశ్వాసంతో తన పరిధిని మరింత పెంచుకోవడం.. భిన్న మార్గాలను అన్వేషించడం చేస్తూ వచ్చింది.
ఎమిరేట్స్ ఫ్లైట్ అటెండెంట్ గా దుబాయ్ లో అడుగు పెట్టాక కూడా.. మారియాకు ఢాకా బతుకుల గురించి.. నూటొక్క మంది వితంతు తల్లులకు తమ జీవితాలను మారుస్తానని తాను ప్రమాణం చేస్తాననిగానీ ఆలోచన ఉండి ఉండదు. కానీ, అలాంటి ఊహించని ఘటనల పరిణామ క్రమమే జీవితం.
రికార్డులు బద్దలు కొట్టాలంటే… ముందు అడ్డంకులు బద్దలు కొట్టాలి! ఇదే మారియా మోటో!!
యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం 2022 నాటికి, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న బంగ్లాదేశీయుల్లో 20.5% మంది పేదరికంలోనే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 14.7%గా ఉంది. ఈ వాస్తవికత అనుభవించిన మారియాకు.. ఇదేం కొత్త విషయం కాదు. కాబట్టే తనను పెంచిన క్రిస్టినాలాగే.. తానూ ఓ టాయిలెట్ క్లీనర్ గానే అవతారమెత్తాల్సి వచ్చింది.
ఢాకా స్లమ్స్‌లో కష్టపడుతున్న కుటుంబాలకు వారి పిల్లల చదువు పూర్తయ్యే వరకు తాను చూసుకుంటానని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలనేది మాత్రం ఓ సవాల్ గా మారింది మారియాకు.
పోనీ ఇంటింటికీ వెళ్లి నిధులు సేకరిద్దామంటే.. అదంత సులభం కాదు. కష్టపడి సంపాదించిన డబ్బును అందించేందుకు మెజార్టీ సిద్ధంగా ఉండదు.
మరి మారియా ఏం చేసింది?
చాలామందిలాగే గూగుల్ తల్లిని నమ్ముకుంది. డబ్బు సంపాదించడానికి మార్గాలను అన్వేషించింది. వాటిలో ప్రభావవంతమైనవేంటో సెర్చ్ చేసింది.
ఏ ఓప్రా విన్ ఫ్రే లానో.. ఎల్లెన్ డీజెనరస్ లానో టీవీ వ్యాఖ్యాతో కావాలంటే.. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో అదీ అంత సులభం కాదు.
అలా ఆమె సెర్చింగ్ లో… గొప్ప కారణాల కోసం కొందరు చేసిన గొప్ప ప్రయత్నాలు కనిపించాయి. పర్యావరణవేత్త రోజ్ సావేజ్ భూగ్రహాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పుతూ మహాసముద్రాల మీదుగా ప్రయాణం సాగించిన తీరు.. పాలస్తీయన్ శరణార్థైన మొస్తఫా సలామే శాంతి, సౌభాతృత్వం కోసం ఎవరెస్ట్ ఎక్కిన ఘటనలు.. మారియాలో స్ఫూర్తి నింపాయి.
అదిగో ఆ స్ఫూర్తితో అథ్లెట్ గా.. స్విమ్మర్ గా.. పర్వతారోహకురాలిగా.. సైక్లిస్ట్ గా కొత్త అవతారాలెత్తింది. ఈ అవతారాలన్నీ… నలుపు, తెలుపుల్లో కునారిల్లితున్న ఢాకాలోని మురికివాడల ప్రజల బతుకు చిత్రాన్ని రంగుల మయం చేయడానికే. అలా ప్రతీ దాంట్లోనూ రికార్డులు బ్రేక్ చేస్తూ వచ్చింది. అయితే, ఆ రికార్డులు బ్రేక్ చేయడమంటే మాటల్లో చెప్పినంత వీజీ కాదు. ఎందుకంటే అప్పటివరకూ ఉరకడం ఒక్కటే వచ్చు తప్ప.. అదీ మారథాన్ లో రికార్డ్ బ్రేక్ చేసేంత అంటే మాటలు కాదు. ఈత రాదు. ట్రెక్కింగ్ అనుభవం ఏమాత్రం లేదు. సైక్లింగ్ లో అంత స్ట్రాంగ్ కాదు. కానీ, ఆమెలో ఉన్న సంకల్పబలం ఆమెను అవన్నీ నేర్చుకునేలా చేసింది. వాటన్నింటిలో నంబర్ వన్ గా నిలిపింది. తానెంచుకున్న వివిధ రంగాల్లోని సంపాదనతో పూరి గుడిసెల బతుకుల మార్చేసింది.
అందుకోసం నిత్యం తనను తాను శారీరకంగా వ్యాయామాలు, యోగా వంటివాటితో పాటు.. మానసికంగా సంసిద్ధం చేసుకుంది.
ఉత్తర ధృవాన్ని అధిరోహించిన ఘనతతో పాటు… ఎవరెస్ట్ పై జెండా పాతిన మొట్టమొదటి పోర్చుగీస్ మహిళగా కూడా మారియా పేరు మార్మోగింది. ఆ తర్వాత ఆమె మారథాన్ ను ఎంచుకుంది ఏడు ఖండాల్లోని ఏడు మారథాన్ లలో పాల్గొంది. ఇంగ్లండ్ నుంచి ఫ్రాన్స్ వరకూ ఈత కొట్టి స్విమ్మర్ గా కొత్త రికార్డ్ సృష్టించింది. కిలిమంజారో, ఎల్బ్రస్, అకాన్ కా గువా, డెనాలి, విన్సన్ వంటి పర్వత శ్రేణులను అధిరోహించి.. ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవంలోని అంటార్కిటికాకు చేరుకున్న మొట్టమొదటి పోర్చుగీస్ మహిళగా కూడా మారియాదే రికార్డ్.
అయితే, ఒక టాయిలెట్ క్లీనర్.. ఎయిర్ హోస్టెస్ గా అవతరించడమంటే పట్టుదల అనుకోవచ్చునేమోగానీ… ఆమె ఢాకా స్లమ్ బతుకులు మార్చిన ఓ మిలియన్ డాలర్స్ మనసున్న స్లగ్ డాగ్ మిలియనీర్ గా రూపాంతరం చెందిన తీరే ఇప్పుడు ప్రపంచాన్ని అబ్బుర పరుస్తోంది. ఆ కష్టం వెనుక పీడకలలున్నాయి, ఆర్థిక ఒత్తిడుంది. శారీరక శ్రమ ఉంది. మానసిక సంఘర్ణ ఉంది. అయితే, వీటన్నింటినీ మించి సంకల్పం బలం ఇంకా బలంగా ఉంది కాబట్టే మారియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
ఆమె బద్దలు కొట్టిన ప్రతీ రికార్డును నైతికంగా, ఆర్థికంగా ఢాకా స్లమ్స్ కే అంకితం చేసింది. అంతేకాదు, ఆ ప్రతీ రికార్డ్ వెనుక ఢాకా బతుకు వ్యథల ఆర్తనాదాలున్నాయి.
ఎగిసిపడిన ఉత్తుంగ తరంగం మరియా కాన్సీకావో!
షాహిన్ ఖాన్ అనే ఓ ఢాకావాసి ఏమంటుందంటే… తమ బతుకులు మార్చుకునేందుకు వేసే అడుగుల విషయంలో అంతా అదెందుకు, ఇదెందుకు, మనమేం చేయగలం అనే నిరాశ, నిస్పృహలతో కనిపించినావారే తప్ప… ఏస్, చేయగలమని ముందుకొచ్చే రకం మాత్రం తనకు మారియా రూపంలో మాత్రమే కనిపించిందంటుంది. మారియా ప్రభావం వల్ల మురికివాడల్లో భవిష్యత్తేంటో తెలియని పిల్లలు.. ఇవాళ అద్భుతమైన కెరీర్స్ నిర్మించుకుంటున్నారు. మారియాలాగా వారూ.. అదే స్ఫూర్తితో స్లమ్ డాగ్ మిలియనీర్స్ గా మారుతున్నారు.
కేవలం టాయిలెట్ క్లీనర్ వృత్తిలోనైనా తాను రోనాల్డో కావాలని ఆశించిన మారియా.. ఢాకా బతుకు వ్యథల ముఖచిత్రానికే క్రిస్టియానో రోనాల్డోగా అవతరించింది. సెలవు దినమంటూ తెలియకుండా ట్వంటీఫోర్ ఇంటూ సెవెన్ పరుగు పెడుతూ పరితపించింది. ఒక షాహీన్, ఒక షోకత్ వంటి వందల మంది జీవితాల్ని మార్చేసింది.
మారియాలాగా అత్యంత అసాధారణ రీతిలో ఎదిగే విషయాలను మనమెందరమో మాట్లాడుకోగలమేగానీ.. అలా చేయడమంటే మాటలా అంటారు మైండ్ వ్యాలీ వ్యవస్థాపకుడైన విషెన్ వంటివారు. ఆమె మార్పు అనే మొలకను నాటితే.. ఇవాళ ఆ మార్పు అనే విత్తనం నుంచి మొక్కలు పెద్దవై.. వృక్షాలుగా మారి ఆమె స్ఫూర్తిని కొనసాగిస్తున్నాయంటారు.. మారియా అప్పగించిన పిల్లల అభ్యున్నతికి పాటుపడ్డ క్లయింట్ రిలేషన్ షిప్ మేనేజర్ విక్టోరియా ఆల్కోబర్ వంటివారు.
లక్ష్యానికి మించిన మార్పుకు కారణమైన ప్రభావవంతమైన మహిళగా మారియా!
కేవలం వితంతువులైన ఒంటరి మహిళల ఆరువందల మంది పిల్లల స్థితిగతులు మాత్రమే మార్చేందుకు కంకణం కట్టుకున్న లక్ష్యం నుంచి.. ఇప్పుడు ఆకాశమే హద్దుగా మారియా సేవలు కొనసాగుతున్నాయి. మురికివాడ బతుకులకు కొత్త వెలుగులను అద్దుతున్నాయి. ఢాకాలోని మురికివాడల బాల్యానికి.. మానవీయ కోణంతో తోడ్పాటునందిస్తూ.. మరోవైపు, అందుకోసం చేస్తున్న తన ఫీట్స్ తో పది గిన్నీస్ రికార్డుల చరిత్రను తిరగరాసిన నూతన అధ్యాయం 40 ఏళ్లు పైబడ్డ మారియా కాన్సీకోవా.
ఒక వ్యక్తి తన లక్ష్యం కోసం మాత్రమే ఎదగడం.. అందుకు సంకల్పాన్నేర్పర్చుకోవడం వేరు. కానీ, ఓ వ్యక్తి తనకంతకు ముందు పరిచయం లేని ఓ పేద ప్రపంచం కోసం పరితపించి వారి మేలు కోసం విజయాలను సాధించడం వేరు. అలా అత్యున్నతమైన రెండో కోవకు చెందింది కాబట్టే… నూటొక్క మంది వితంతువుల 600 మంది పిల్లలను తాను ప్రమాణం చేసినట్టుగా చదివించి ప్రయోజకుల్ని చేసింది. అలా తన సేవలను విస్తరించి.. ఇప్పుడు మారియా కాన్సీకోవా ఓ గ్లోబల్ ఉమన్ గా వివిధ వేదికలపై కరతాళధ్వనులందుకుంటోంది….. (Article By రమణ కొంటికర్ల)
Share this Article