మోడీ అఫిడవిట్ మీద ఇంకా ఎవరూ కూతలు మొదలుపెట్టినట్టు లేదు… తన మీద కేసుల్లేవు… తన పేరిట ఆస్తుల్లేవు… గతంలో ఏం చెప్పాడో గానీ ఈసారి యశోదాబెన్‌ను భార్యగా పేర్కొన్నాడు… గతంలోనే బోలెడు వివాదాలు, విమర్శలు వచ్చిన బీఏ, ఎంపీ మళ్లీ చూపించాడు…
నాలుగు తులాల్లోపు నాలుగు ఉంగరాలు… అంతే, ఇల్లు లేదు, కారు లేదు… ఏ కంపెనీలోనూ షేర్లు లేవు… వాటాల్లేవు… ఉన్నవి పొదుపు పథకాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు… మొత్తం 3 కోట్ల దాకా చూపించాడు… అందులో గత అయిదేళ్లలో దాదాపు 50 లక్షల దాకా చేరి ఉంటాయి… ప్రధానిగా తనకు వచ్చే జీతం ప్లస్ తన పాత డిపాజిట్ల మీద వడ్డీ…
అంతే, ఎవడికీ రూపాయి ఇచ్చేది లేదు… ఎవడినీ రూపాయి అడిగేది లేదు… మొత్తం వ్యవస్థే చూసుకుంటుంది కదా… ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా ఉన్నప్పటి నుంచీ నియమబద్ధ జీవితమే కాబట్టి వేరే విలాసాలు లేవు… రేప్పొద్దున రిటైరయిపోయినా సరే, వ్యవస్థే తన బాగోగులు, రక్షణల్ని చూసుకుంటుంది జీవితపర్యంతం… కాదంటే అపరిమిత సాధనసంపత్తి కలిగిన పార్టీ ఉండనే ఉంది…
Ads
ఏ రుషికేశ్‌లోనో గడిపేయగలడు… మనకు మోడీ పాలన విధానాలు, రాజకీయ నిర్ణయాలు, సగటు మనిషికి కనెక్ట్ కాని వైఫల్యాలపై బోలెడు అభ్యంతరాలు, వ్యతిరేకత ఉండవచ్చుగాక… లక్షల కోట్ల రుణాల రద్దు, కార్పొరేట్ కంపెనీలకు దన్ను వంటి విమర్శలు ఎన్నయినా ఉండవచ్చుగాక… కానీ వ్యక్తిగత నియమబద్ధ జీవితం మాత్రం ఆదర్శమే… ఇండియా వంటి అత్యంత అవినీతి, అక్రమ రాజకీయ పార్టీలు, నాయకుల నడుమ మోడీ జీవనసరళి ఖచ్చితంగా విశిష్టమే…
ఆమధ్య లాలూ ఏదో అన్నట్టున్నాడు కదా… సంసారం, పిల్లలు ఉంటే తెలిసేది కష్టమేమిటో అని..! నిజమే, మన దేశంలోని కుటుంబ పార్టీలన్నీ పీకల్లోతు అక్రమాలు, అవినీతి వ్యవహారాల్లోనే తలమునకలై ఉంటాయి కదా… లెఫ్ట్, రైట్ పార్టీలే కాస్త నయం… వందలు, వేల కోట్ల వరకు ఆస్తులు సంపాదించడం, వారసులకు రాజకీయాలతో పాటు అపరిమితమైన సంపదను పోగేసి ఇవ్వడం…
చివరకు ప్రజ్వల్ రేవణ్న వంటి భ్రష్టులు తయారవుతారు ఇలాంటి కుటుంబ వ్యవస్థల్లో..! లాలూ కూడా అంతే కదా… కుటుంబంలో పెద్ద కొడుకు మినహా అందరూ అంతే కదా… తను లేకపోతే భార్య సీఎం, బిడ్డలు అంతే, ఇప్పుడు పార్టీని నడిపే కొడుకూ అంతే… కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా బోలెడు పార్టీలు, బోలెడు కుటుంబాలు, వారసత్వాలు, తరచి చూస్తే అన్నీ చీకటి మరకలే…
నిజమే, అందరినీ వదిలేసిన రాజయోగి మోడీకి ఈ వికారాలకు పోవాల్సిన అగత్యమూ లేదు… లాలూ చెప్పినట్టు తనకు ఓ సంసారం లేదు, భవబంధాలూ లేవు… తన సోదరులు, వాళ్ల పిల్లల జోలికి పోడు, అమ్మ వెళ్లిపోయింది, భార్యతో ఉండడు… ఎవరికీ సంపాదించి పెట్టే బాదరబందీ లేదు, కోరికలూ లేవు… 70 దాటాడు, మిగిలిన జీవితమంతా బోనసే… మళ్లీ కుర్చీ ఎక్కితే నెహ్రూ కుటుంబం గాకుండా ఈ దేశానికి ఇన్నేళ్లు నాయకత్వం వహించిన మొదటి ప్రధాని అవుతాడు… ఇంకేం కావాలి..?!
Share this Article