బీజేపీతో జగన్ రహస్య అవగాహన లేదా దోస్తీ ముగిసినట్టేనా..? లేక ముగింపు దశకు వచ్చేసినట్టేనా..? తెలుగుదేశం అధినేత చంద్రబాబు వదిన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏకంగా సుప్రీంకోర్టుకే లేఖ రాసింది… జగన్ అక్రమాస్తుల కేసులో నంబర్ టూ నిందితుడు సాయిరెడ్డి తన బెయిల్‌ను పదేళ్లుగా ఎలా దుర్వినియోగం చేస్తున్నాడో ఏకరువు పెట్టింది…
అంతేకాదు, ఆ లేఖలో జగన్ ప్రస్తావన కూడా ఉంది… బెయిల్ రద్దు చేయాలని కోరుతోంది… అంటే జగన్‌ను మళ్లీ జైలుకు, సాయిరెడ్డితోసహా పంపించాలని విజ్ఞప్తి చేసుకుంది… ఆమె జస్ట్, ఓ మాజీ ఎంపీ కాదు… ఇక్కడ చంద్రబాబు వదిన మాత్రమే కాదు, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు… సో, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ లేకుండా ఆమె జగన్ మీద విరుచుకుపడదు… మరేమిటి దీనర్థం..?
ఇలాంటి లేఖలు, బెయిల్ రద్దు డిమాండ్లతో జగన్‌ను కట్టడిలో ఉంచుకునే ఓ పరోక్ష వ్యూహమా..? బిడ్డా, నీ మెడపై ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది, ఆ కత్తి రిమోట్ మా చేతుల్లో ఉంది అని పదే పదే గుర్తుచేయడమా..? లేక నిజంగానే పొరపాటున టీడీపీ, జనసేన వైపు దోస్తీకి మొగ్గు చూపడమా..? పురందేశ్వరి లేఖను ఎలా అర్థం చేసుకోవాలి..?
Ads
సీబీఐకి, ఈడీకి కూడా లేఖలు రాయొచ్చు కదా అంటారా..? అవును, ఆమె నేరుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కే లేఖ రాసింది… సరే, ఈ లేఖకు సుప్రీంకోర్టు స్పందిస్తుందా లేదా చెప్పలేం… కానీ నిజంగానే జగన్ బెయిల్ రద్దు మీద బీజేపీకి లేదా పురందేశ్వరికి సీరియస్‌నెస్ ఉంటే ఏకంగా సుప్రీంలో ఓ కేసు వేయవచ్చుకదా…
ప్రజాజీవితంలో ఉన్న కేసుల్ని తక్షణం వేగంగా విచారించి డిస్పోజ్ చేయాలని సుప్రీంకోర్టు గతంలో కూడా చెప్పింది… మరి జగన్ కేసుల్లో విచారణలో ఇంత జాప్యం ఏమిటి..? అనేకసార్లు కోర్టు వాయిదాలు ఏమిటి..? నిన్ననే కదా, సీజేఐ చంద్రచూడ్ ఏదో కేసులో ‘తారీఖ్ పే తారీఖ్’ (పదే పదే వాయిదాలు) పద్ధతి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు… సో, ఆయన ఈ లేఖ మీద స్పందించే చాన్స్ ఉందా..?
నిజంగానే జగన్ మళ్లీ జైలుకు వెళ్లాలని బీజేపీ హైకమాండ్ కోరుకుంటోందా..? దానివల్ల పార్టీకి వచ్చే ఫాయిదా ఏముంది..? అదెలాగూ చంద్రబాబును నమ్ముకుని గోదావరి ఈదలేదు… గతంలోనే వెన్నుపోట్లకు గురైంది కదా… చంద్రబాబు అంటేనే ఆ పదానికి పేటెంట్ హక్కుదారు కదా… జగనే కాస్త నయం, భయభక్తుల్లో ఉంటున్నాడు… మరి జగన్‌ను వదిలేస్తే వచ్చేదేమిటి..?
‘‘పెద్దగా పవర్‌లో లేనప్పుడే ఈ నిందితులు బెదిరింపులకు పూనుకున్నారు… ఇప్పుడు పవర్‌లో ఉన్నారు… అంతెందుకు..? నన్నే సాయిరెడ్డి బెదిరించాడు… బెదిరించి భూములు ఆక్రమించుకుంటున్నాడు… ఇవిగో ఆధారాలు’’ అంటూ ఆమె చాలా అటాచ్‌మెంట్స్ జతచేసింది… జగన్ సార్, ఏమిటిదంతా..? ఎక్కడో ఏదో తేడా కొట్టినట్టు అనిపిస్తోందా..? సర్, మోడీ సాబ్… ఏ సబ్ క్యా హై భాయ్ సాబ్…!? అవునూ, జగన్‌తో దోస్తీ కటీఫ్ కావాలనుకుంటే సీబీఐ, ఈడీలు బెయిల్ రద్దు కోరుతూ కోర్టులో పిటిషన్ వేయొచ్చుగా…!!
Share this Article