మనది ప్రపంచంలోకెల్లా జనాభా రీత్యా అతి పెద్ద ప్రజాస్వామిక దేశం… సైనిక తిరుగుబాట్లు గట్రా ఏమీ లేని సుస్థిర పార్లమెంటరీ అధికార వ్యవస్థ… సహజంగా మనం మనవంటి వ్యవస్థలనే కోరుకుంటాం… ప్రత్యేకించి మన ఇరుగూపొరుగూ దేశాల్లో కూడా డెమోక్రటిక్ వాతావరణాన్ని ఆశిస్తాం… తద్వారా ఆయా దేశాలతో మన సంబంధాలు కాస్త పద్ధతిగా ఉంటాయని అనుకుంటాం…. అంతేకదా…! కాదు… తప్పు… ఆయా దేశాల్లోని వర్తమాన పరిస్థితులను బట్టి ఈ సిద్ధాంతం, ఈ ధోరణి, ఈ వైఖరి మారుతూ ఉంటుంది… ఉదాహరణకు… బర్మా ప్రస్తుత స్థితి… ఆ దేశపు సైన్యం తిరగబడి, ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి, ఆమెను జైల్లో పారేసింది… అంటే నిర్బంధంలో ఉంచింది… వీథుల్లోకి వచ్చిన వాళ్లను తొక్కిపారేస్తోంది… 800 మంది హతులయ్యారు ఈ ఆందోళనల్లో… ఊళ్లకూళ్లు తగులబెట్టి మరీ లక్షలాది మంది రోహింగ్యాలను దేశం నుంచి తరిమేసిన బర్మా సైన్యానికి ఈ వీథి ఆందోళనల్ని తొక్కడం పెద్ద సమస్యా…? మరి అంతర్జాతీయ సమాజం ఏం చేస్తోంది అంటారా..?
ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, సైన్యం వెంటనే నిర్బంధించిన నేతలందరినీ విడుదల చేయాలనీ, ఏ దేశమూ దానికి ఆయుధాలు సప్లయ్ చేయకూడదనీ ఐక్యరాజ్యసమితి ఓ తీర్మానం ప్రతిపాదిస్తే… 193 దేశాల్లో కేవలం 119 దేశాలు మాత్రమే దానికి మద్దతు పలికాయి… అంటే మిగతా దేశాలు సైన్యం తిరుగుబాటును మౌనంగా సమర్థిస్తున్నట్టే కదా… అందులో ఇండియా కూడా ఉంది… మనమే కాదు, బర్మాకు ఇతరత్రా ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, లావోస్, నేపాల్, థాయిలాండ్… చివరకు రష్యా, చైనా కూడా సైలెంటుగా ఉండిపోయాయ్… ఒక్క బెలారస్ మాత్రం ఆ తీర్మానాన్ని వ్యతిరేకించింది… ఆసియా దేశాల కూటమి ‘ఆసియాన్’ ఓ పరిష్కార ప్రయత్నం ప్రారంభించిందనీ, దానికి సహకరించాలే తప్ప ఐరాస ఇంకో రూట్లో వెళ్తోందని ఇండియా తన నిశ్శబ్దాన్ని సమర్థించుకుంది… భద్రతామండలిలోనూ ఇదే తీర్మానం ప్రవేశపెడితే 15 దేశాల్లో 11 మాత్రమే సమర్థించాయి… అక్కడా చైనా, రష్యా సైలెంట్… ఎందుకు ఇన్ని దేశాలు బర్మాలో సైనిక తిరుగుబాటుకు పరోక్షంగా తలూపుతున్నట్టు..? ప్రజాస్వామిక వాతావరణం పునరుద్ధరణను ఎందుకు మనస్పూర్తిగా స్వాగతించడం లేదు..?
Ads
రకరకాల విశ్లేషణలు అంతర్జాతీయ మీడియాలో సాగుతున్నయ్… ఇండియన్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు… అయితే ఇక్కడ ఓ ప్రశ్న… తన తీర్మానాన్ని పెద్ద దేశాలు పట్టించుకోకపోతే… ఐరాస ఏం చేయగలదు..? దానికి అసలు కోరలున్నాయా..? అందుకే బర్మా సైన్యం లైట్ తీసుకుంటోంది… దానికి ఈ తిరుగుబాట్లు, ఈ పిల్లిశాపాలు, ఉడతఊపులు అలవాటే… సో, సూకీకి ఇప్పట్లో విముక్తి ఉండకపోవచ్చు అనుకోవాలి… ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చాన్స్ లేదనే భావించాలి… మరి అప్పుడు ఐరాస ఏం చేయాలి..? భద్రతామండలి ఏం చేయాలి..? మళ్లీ భేటీ వేయాలి… వేసి ఏం చేయాలి..? అదే మనం వేచి చూడాలి..! ఆ దేశంతో మనకు ప్రస్తుతానికి మంచి సంబంధాలే ఉన్నయ్… ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రవాదుల ఏరివేతకు సహకరిస్తోంది… ఆ సైన్యాన్ని వ్యతిరేకిస్తే అది మరింత దూరమై చైనాకు ఇంకా దగ్గరయ్యే ప్రమాదముంది… మరోవైపు అక్కడి ప్రజలు తమ సైన్యానికి చైనాయే సహకరిస్తోందనే ఆగ్రహంతో ఉన్నారు… వీథుల్లోకి వస్తున్నారు… సో, ఇండియా సైలెంటుగా ఉండటమే ప్రస్తుతానికి శరణ్యం… ఆ దేశానికి మనతో 1468 కిలోమీటర్ల సరిహద్దు ఉంది… సో, అక్కడ ఏం జరుగుతున్నా మనకూ ప్రాధాన్యాంశమే అవుతుంది…!
Share this Article