‘యానిమల్’ సినిమా మీద నెగెటివిటీ ఈరోజుకూ వ్యాపిస్తూనే ఉంది… ఫాఫం, వంగా సందీప్ రెడ్డి… సమర్థించుకోవడానికి నానా పాట్లూ పడుతున్నాడు… ఎవరు ఆ సినిమా మీద నెగెటివ్ కామెంట్లు పాస్ చేస్తున్నా సరే వాళ్లపైనా సెటైర్లతో విరుచుకుపడుతున్నాడు… ఎదురుదాడి… అంతా యానిమల్ పాత్రోచిత ప్రవర్తనే…
మొన్నామధ్య అమీర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం తను తీసిన లాపతా లేడీస్ లో యానిమల్ కేరక్టర్ మీద కొట్టినట్టుగా ఓ సీన్ పెట్టింది… దానికిక సందీప్ నుంచి కుయ్ లేదు, కయ్ లేదు… సైలెంట్… వందల కోట్లు వచ్చిపడ్డాయ్, మళ్లీ సినిమా తీసినా అదే అర్జున్ రెడ్డి తరహా, కాదు, దానికి మించిన ఓ పాత్రను తీసుకొస్తాడు… రుచిమరిగిన పులి కదా…
ఇప్పుడు విశేషం ఏమిటంటే..? రానా… అదేనండీ మరిచిపోయారా..? బాహుబలి విలన్… తను తెర మీదకు వచ్చాడు… యానిమల్ చూశాక నేను తీసిన, చేసిన రానా నాయుడు వెబ్ సీరీస్ చాలా నయం అనిపిస్తోంది, అందులోని నా పాత్ర డీసెంటుగా కనిపిస్తోంది ఇప్పుడు అన్నాడు ఎక్కడో… నిజానికి పైపైన చూస్తే, చదివితే చాలా కాజువల్ వ్యాఖ్యలా అనిపించినా సరే, యానిమల్ సినిమా మీద సీరియస్ కామెంటే అది…
Ads
ఎందుకంటే..? రానా నాయుడు వెబ్ సీరీస్ రామానాయుడు ఫ్యామిలీకి ఓ మరక… బాహుబలి బాపతు పాన్ ఇండియా పాపులారిటీని వాడుకుని ప్రభాస్ ఎక్కడికో వెళ్లిపోగా… ఏవే నాలుగైదు పిచ్చి సినిమాలతో రానా అటు విలన్ గాకుండా, ఇటు హీరో గాకుండా పోయాడు… చివరకు అశ్లీలమైన భాష, సీన్లతో రానానాయుడు సీరీస్ చేసి మరింత దిగజారాడు… తనే కాదు, ఫ్యామిలీ హీరోగా చూడబడే వెంకటేష్ పరువునూ, ఇమేజీని కూడా చెడగొట్టేశాడు…
తెలుగు ప్రజల తిట్లు తిన్నాడు భారీగా… అంతేనా..? రానా నాయుడు-2 కూడా అలాగే ఉంటుందని ప్రకటించి భయపెట్టాడు కూడా… నిజానికి వెంకటేష్‌కు ఏమైంది..? ఈ సీరీస్ సెకండ్ పార్టులో కూడా నటిస్తాను అన్నాడు ఆమధ్య… అదేదో సల్మాన్ నటించిన హిందీ సినిమాలో ఓ సైడ్ కేరక్టర్ పోషించి మరింత ఇమేజీ పోగొట్టుకున్నాడు… ఇదంతా పక్కన పెడితే… యానిమల్ సినిమాకన్నా మా రానానాయుడు వెబ్ సీరీస్ బెటర్ అని రానా చెప్పడం అంటే… ఎహె, యానిమల్ మా వెగటు సీరీస్కన్నా అధ్వాన్నం అని చెప్పినట్టే…
అసలే తెలుగు ఇండస్ట్రీలో ఎవరినీ ఎవరూ విమర్శించరు, ఎవరి ఖర్మ వాళ్లదే… ఎప్పుడైనా వేదికల మీద తమలపాకుతో కొట్టుకున్నట్టు చిలిపి, సరదా వ్యాఖ్యలే తప్ప సీరియస్ విమర్శలుండవు… కానీ ఇప్పుడు రానా వంటి నటుడు యానిమల్ మీద తీసిపారేసే వ్యాఖ్యలు చేశాడంటే విశేషమే… ! ఏమో… ఎప్పటిలాగే, నార్త్ సినిమా వాళ్లకు సెటైర్లతో ఎదురుదాడి సమాధానాలు ఇచ్చిన వంగ సందీప్ రెడ్డి రానాకు కూడా ఆ వెబ్ సీరీస్ డైలాగుల్ని గుర్తుచేస్తూ కౌంటర్ ఇస్తాడా..? చూడాలి..!!
Share this Article