సర్జికల్ స్ట్రయిక్స్‌కు ఆధారాలు, చైనా ఆక్రమణల మీద కేసీయార్ తాజాగా బీజేపీని ఏమని నిందిస్తున్నాడు, ఏం ప్రశ్నిస్తున్నాడు అనేది కాసేపు పక్కన పెడదాం… ఏయ్, కంటోన్మెంటుకు నీళ్లు, కరెంటు కట్ చేస్తాను బిడ్డా అని కేటీయార్ చేసిన బెదిరింపుల గురించీ కాసేపు విస్మరిద్దాం… యాంటీ బీజేపీ, యాంటీ నేషన్ ధోరణుల నడుమ తేడా గురించి చర్చ కూడా ఇక్కడ అక్కర్లేదు… కానీ ఇప్పుడు దేశమంతటా కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాపైన చర్చ సాగుతోంది…
కశ్మీరీ పండిట్ల వ్యథ ఇప్పటి తరానికి తెలిసొస్తోంది… దారుణమైన మారణహోమానికి బలై, వందల మంది మరణించి, లక్షల మంది తమ సొంత దేశంలో శరణార్థులుగా మారిపోయిన ఓ చారిత్రిక విషాదం ఏమిటో మరోసారి అందరికీ జ్జప్తికొస్తోంది… నిజంగా ఈ సమస్య మీద టీఆర్ఎస్ అధికారిక వైఖరి ఏమిటి..? కొందరైతే అసలు అక్కడ పెద్దగా హిందువులు మరణించనేలేదని చెబుతూ.., అప్పట్లో ఎవరో డీఎస్పీ ఆర్టీఐ కొర్రీకి సమాధానం ఇచ్చాడట, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… అసలు బీజేపీ కావాలనే అబద్ధాలు ప్రచారం చేయడానికి ఈ సినిమా తీయించిందని వ్యాఖ్యానాలు చేస్తున్నారు…
వాళ్లు ఒకసారి సాక్షాత్తూ కేసీయార్ కూతురు, మాజీ ఎంపీ కవిత పార్లమెంటులో ఇదే సమస్య మీద ఏం మాట్లాడిందో తెలుసుకోవాలి… ఆ వీడియో చూడాలి… యూట్యూబులో ఉంది… చాలా బాగా మాట్లాడింది… స్పష్టంగా, సూటిగా సమస్యను చెప్పిందామె… అందులో కొన్ని ముఖ్యాంశాలు ఓసారి చదువుదాం… ఈ ప్రసంగం 11 ఆగస్టు 2014 నాటిది…
Ads
‘‘మనం గాజా గురించి, పాలస్తీనా గురించి మాట్లాడుకుంటున్నాం… కానీ మన దేశంలోనే శరణార్థులుగా మారిపోయిన కశ్మీర్ పండిట్ల గురించి కూడా మాట్లాడుకోవాలి… వాళ్ల పునరావాసం కోసం బీజేపీ హామీ ఇచ్చింది… ఒక్కసారి నాటి ఘటనల్ని చెప్పుకోవాలంటే… 1990లో హిందువుల ఊచకోత సాగింది… వేల ఏళ్లుగా బతుకుతున్న తమ నేలను వదిలేసి 3.5 లక్షల మంది భయంతో నలుదిక్కులకూ పోవాల్సి వచ్చింది… 700 మంది మరణించారు… భయంకరమైన మారణహోమం జరిగింది… బతికి ఉన్నవారిని కోశారు…
పాకిస్థాన్ ప్రేరిత దుర్మార్గం సాగుతూనే ఉంది… ఒక్క 1990లోనే కాదు, 1991, 1997, 1998, 2003 సంవత్సరాల్లో కూడా సాగింది… 25 ఏళ్లుగా సాగుతూనే ఉంది… మనం వాళ్లకు న్యాయం చేయకూడదా..? డబ్బుల సమస్య కాదు… పెద్ద పెద్ద గుడారాలు వేశాం శరణార్థుల కోసం… అక్కడ పాముకాట్లు, వడదెబ్బ, డిప్రెషన్లతో వందల మంది మరణించారు…
అధికారిక సమాచారం ప్రకారమే 219 మంది మరణించారు… ఎఫ్ఐఆర్‌లు లేవు… విచారణల్లేవు, శిక్షల్లేవు, అరెస్టుల్లేవు… మరి పునరావాసం పేరిట పండిట్లను మళ్లీ అక్కడికి పంపిస్తే వాళ్ల భద్రత ఎలా..? చిన్న చిన్న అంశాల మీద మాట్లాడే అంతర్జాతీయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఇంతటి దారుణం మీద మాత్రం మాట్లాడలేదు… ఎవరూ ఈ పండిట్ల రెస్క్యూకు రాలేదు… చివరకు మీడియా కూడా…
రెండు ఉదాహరణలు చెప్పుకుందాం… 1990లోనే ఫరూక్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే తానొక్కడే 20 మందిని చంపినట్లు బహిరంగంగా టీవీలో అంగీకరించాడు… ఆ కేసులో జైలుకు వెళ్లాడు, బెయిల్‌పై వచ్చాడు… కానీ శిక్ష లేదు… జడ్జి తన తీర్పులో ‘‘ప్రాసిక్యూషన్ పూర్తిగా ఫెయిలైంది’’ అని చెప్పాడు… పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం ఏం చేస్తున్నట్టు..? ఒకరు ఆర్టీఐ కింద సమాచారం అడిగితే నాటి ఊచకోత సమాచారమే తమ వద్ద లేదని అధికారులు బదులిచ్చారు…
చాలామంది పండిట్లతో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను… ఓ సంఘటనలో నలుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని చంపేశారు… 25 ఏళ్లయినా కేసు కదల్లేదు, ఎవరిని అడుగుదాం..? వారిలో ఓ స్క్వాడ్రన్ లీడర్ కూడా ఉన్నాడు… వాళ్లకే రక్షణ లేకపోతే, రేప్పొద్దున భద్రతాదళాల్లోని మన యువత ఎలా చేరుతుంది..? 2003లో వాజపేయి ప్రభుత్వం… పునరావాసం అన్నాడు… పదేళ్ల తరువాత మళ్లీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది… మేనిఫెస్టోలో కూడా పండిట్ల పునరావాసం గురించి హామీ ఇచ్చింది…
కానీ నిజంగా ఈ సమస్య మీద ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నదో ఓ బ్లూప్రింట్ ఉందా..? తిరిగి కశ్మీర్ వెళ్తే వాళ్లకు రక్షణ ఏమిటి..? మళ్లీ ప్రమాదంలోకి పంపించలేం కదా… కశ్మీర్ ఇండియాలో ఓ భాగం… ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ కేసుల విచారణ ప్రారంభించాలి… వాళ్లకు సరైన న్యాయం జరగాలి…’’ ఎస్… కశ్మీరీ పండిట్ల సమస్యను బీజేపీ కోణంలో కాదు, ఓ మానవీయ కోణంలో మాత్రమే చూడాలి… నాటి ఊచకోతను చూపించాలంటే కశ్మీర్ ఫైల్స్ సినిమా సరిపోదు… లేదు, లేదు, అసలు అప్పట్లో ఏమీ జరగలేదు, జస్ట్, ఆ దర్శకుడి సొంత పైత్యం మాత్రమే అంటారా..? కానివ్వండి…!!
https://www.youtube.com/watch?v=KRxaDZVzJ5o
Share this Article