.
అసలు ఈయన పాత చంద్రబాబేనా..? ఏమైంది తనకు..? ఏ ఇష్యూ వచ్చినా సరే, అధికార యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకుని, ఇష్యూ సార్టవుట్ చేయగలిగే సామర్థ్యం, పేరు ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఫేడవుట్ అయిపోయాడా..? ఆ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఏమైపోయాయి..? నిర్వీర్యం అయిపోయాయా..? అసలు ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని..?
ఈ సందేహాలు, పెదవివిరుపులు ఎందుకంటే..? ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల వివాదంలో చంద్రబాబు చేతులెత్తేయడం… రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగడం…! దాదాపు లక్ష మంది అభ్యర్థుల సమస్య… రోస్టర్ సరిగ్గా లేదనీ, దిద్దుబాటు అవసరమనీ చాన్నాళ్లుగా కోరుతున్నారు, కోర్టుకూ ఎక్కారు…
Ads
నిజంగా ఏవైనా తప్పులుంటే ఖచ్చితంగా సరిదిద్దాల్సిన బాధ్యత ఏపీపీఎస్సీదే… ఈమేరకు ఏపీ ప్రభుత్వం నుంచి కూడా కఠిన, దృఢ వైఖరి అవసరం… కానీ ఏం జరిగింది..? ఏపీపీఎస్సీ ఏ ప్రభుత్వ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నదో ఆ ప్రభుత్వ నిర్ణయాన్నే ధిక్కరించింది… ఎహెఫో అని తీసిపారేసింది… ఎంతగా అంటే..?
సాక్షాత్తూ చంద్రబాబు లేఖ రాసినా ఖాతర చేయలేదు ఏపీపీఎస్సీ… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరుతున్నా సరే, వాయిదా వేద్దామని ప్రభుత్వం సూచించినా సరే… యాక్టింగ్ సీఎం లోకేష్ ట్వీటినా… ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు సరికదా పరీక్ష యథాతథంగా ఉంటుందని క్లియర్‌కట్‌గా ప్రభుత్వానికి చెప్పేసింది… ప్రభుత్వం తెల్లమొహం వేసింది…
ప్రస్తుతం రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంది కాబట్టి పరీక్షల వాయిదా కుదరదట… అదేం వాదన..? వివాదాలు, సహేతుక సందేహాలు వ్యక్తమవుతున్నప్పుడు ఏపీపీఎస్సీ వాటిని పరిగణనలోకి తీసుకోలేమంటే ఎలా..? ఇప్పుడు చంద్రబాబు మీద కూటమి కేడర్ నుంచే వస్తున్న విమర్శలకు నిజానికి చంద్రబాబు దగ్గర కూడా జవాబు లేదు…
ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ అనూరాధను ఏరికోరి నియమించుకున్నది చంద్రబాబే… సిన్సియర్, ఎఫిసియెంట్ అధికారిణి అనే పేరుంది… కానీ తీరా ఈ ఇష్యూ వచ్చేసరికి అనారోగ్యం సాకుతో ఆమె అందుబాటులోకే రాలేదు… సెక్రెటరీ లేడు… ఇన్‌ఛార్జి సెక్రెటరీ పరీక్షల వాయిదా కుదరదు అని ప్రభుత్వానికి తిరుగుటపా పంపించాడు… అసలేం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టని అరాచకం…
(నిజానికి వోటుకునోటు కేసు సమయంలో తెలంగాణలో ఏం జరుగుతున్నదో సమాచారం సేకరించడంలో విఫలమైందని అసంతృప్తితో చంద్రబాబు అప్పట్లో ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అనూరాధను ఆ పోస్టు నుంచి తొలగించాడు… ఆమె ప్లేసులో ఏబీ వెంకటేశ్వరరావును తెచ్చుకున్నాడు… మరి అదే అనూరాధకు ఏపీపీఎస్సీ పోస్టింగ్ ఎలా ఇచ్చాడు..? తెలియదు..!)
సరే, ఆ నియామకాల సంగతి పక్కన పెడితే… పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ, స్వతంత్ర సంస్థే… కానీ ఆ స్వతంత్రతకూ పరిమితులుంటాయి… ఉండాలి కూడా..! అదిక్కడ లోపించినట్టు కనిపిస్తోంది… ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఈ వివాదంతో మేం ఓడిపోవడం తథ్యమనే ఆందోళన ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థుల్లో మొదలైెందట…
అదీ పక్కన పెడితే రాష్ట్రవ్యాప్తంగా యువత, నిరుద్యోగులు హఠాత్తుగా కూటమికి వ్యతిరేకులు అయిపోయారనే బాధ తెలుగుదేశం కేడర్‌లో కనిపిస్తోంది… అవును, ఈ చంద్రబాబు మునుపటి చంద్రబాబు కాదు… ఎందుకోగానీ అప్పటి సమర్థ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు ఇప్పుడు కనిపించడం లేదు..!! మీలోని ఆ పాత చంద్రబాబును బయటికి తీయండి సార్…!
Share this Article