రామానాయుడు తెలివిమంతుడు… పిల్లల్లో ఎవరి భవిష్యత్తు ఏమిటో తెలుసాయనకు… అందుకే అప్పట్లోనే స్టూడియో, సినిమా నిర్మాణ వ్యవహారాలు, ఆర్థికం అంతా సురేష్ బాబుకు వదిలేశాడు… వెంకటేష్‌ను నటనలోకి దింపాడు… రానాకు సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ గమనించి, నీకు నచ్చిన పాత్రలు పోషించు అన్నాడు, అంతే తప్ప నిర్బంధంగా ఓ హీరోగా ప్రేక్షకుల మీద రుద్దలేదు… రానా సోదరుడు అభిరామ్‌ను హీరోగానే కాదు, అసలు సినిమా సెట్ల దగ్గరకే రానిచ్చేవారు కాదు…
నటి శ్రీరెడ్డి వివాదాస్పద వీడియోలు, వ్యాఖ్యలతో అభిరామ్ యావత్ తెలుగు ప్రపంచానికి ఎప్పటి నుంచో పరిచయం… ఈయన వల్ల దగ్గుబాటి కుటుంబ పరువు మొత్తం బజారున పడింది… సరే, తను కూడా హీరో కావాలని అనుకున్నాడు… డబ్బు, బ్యాక్‌గ్రౌండ్ ఉంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని భ్రమపడ్డాడు… అందులోనూ గతంలో సక్సెస్‌లు కొట్టిన దర్శకుడు తేజ దొరికాడు… ఆయనే రానాతో నేనే మంత్రి, నేనే రాజు అనే సినిమా తీసి, ఓ మోస్తరు సక్సెస్ కొట్టాడు… సో, అహింస పేరుతో సినిమా నిర్మితమైంది… తెలుగు ఇండస్ట్రీని శాసించే సురేష్ అండగా ఉన్నా సరే, అనేకసార్లు వాయిదా పడి, ఎట్టకేలకు విడుదలైంది…
Ads
ఆ సినిమా నాణ్యత గురించి ఇక్కడ చర్చే అనవసరం… ఉత్త సోది సినిమా… అసలు అభిరామ్ హీరో మెటీరియల్ కాదు… ఓసోస్, ఇతర వారసులు మొదట్లోనే ప్రూవ్ చేసుకున్నారా, అభిరాముడూ మెల్లిగా ప్రూవ్ చేసుకుంటాడులే అంటారా..? ఇప్పుడు అంత సీన్ లేదు… ఒకటీరెండు సినిమాలతో ప్రేక్షకులు తేల్చేస్తున్నారు పనికొస్తాడా, రాడా…!! అంతెందుకు… తేజకు కూడా అభిరామ్ ప్రతిభ అర్థమైనట్టుంది… వీలైనంతవరకూ క్లోజప్ షాట్స్ జోలికి పోలేదు… అభిరామ్ మాట్లాడుతుంటే పక్కకున్నవాళ్లను చూపించాడు తప్ప తేజ కూడా పెద్దగా రిస్క్ తీసుకోలేదు…
అహింస సినిమా చూస్తుంటే తేజ పాత సినిమాలైన జయం, నువ్వు-నేను వంటివి పదే పదే గుర్తొస్తాయి… తేజ దగ్గర కొత్త సరుకేమీ లేదు… ఓ అమాయక హీరో, బలహీనుడైన హీరో… పరిస్థితుల కారణంగా హింసను నమ్ముకుని చెలరేగిపోతాడు… నడుమ ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం… తేజ తన పాత సినిమాల్నే మరోసారి రుద్దే ప్రయత్నం బాగానే చేశాడు… కానీ బోర్, బోరర్, బోరెస్ట్ అయిపోయింది… కథ ఎక్కడా లాజిక్‌తో నడవదు…
చివరకు సంగీత దర్శకుడిగా కూడా తన పాత దోస్త్ ఆర్పీ పట్నాయక్‌నే ఎంచుకున్నాడు తేజ… పేరుకే సినిమా పేరు అహింస… కానీ ప్రేక్షకుడికి హింస, సినిమాలోనూ విపరీతమైన యాక్షన్, హింస… సురేష్ బాబు రియాలిటీలో బతికే మనిషి… ఈ సినిమా భవిష్యత్తు ఊహించే, మధ్యలోనే ఇక ఆపేయండి అని చెప్పాడట… ఈ సినిమాలో కాస్త చూడబుల్ సదా… తేజ పాత హీరోయిన్…
అభిరామ్‌ను హీరోగా చూడబుద్ది కాదు… హీరోయిన్ గీతిక తివారీ కొత్త అమ్మాయే… చూడబుల్‌గా ఉన్నా సరే, ఆమె నటిగా ఎదగడానికి చాన్నాళ్లు పడుతుంది… ఈ సినిమాను అలా వదిలేస్తే ఇదేరోజు రానా ప్రజెంట్ చేసిన ఓ చిన్న సినిమా పరేషాన్ విడుదలైంది… అదీ ఇలాంటి సినిమాయే… ఆ సినిమాలో ఏం చూసి రానా ప్రజెంట్ చేశాడో తనకే తెలియాలి… అసలే రానా నాయుడు అనే వెబ్ సీరీస్‌తో తెలుగు ప్రజల తిట్లు తిన్నాడు భారీగా… అంతేనా..? రానా నాయుడు-2 కూడా అలాగే ఉంటుందని ప్రకటించి భయపెట్టాడు కూడా…
ఆ సీరీస్‌లో నటించి వెంకటేష్ తన పరువు మొత్తం పోగొట్టుకున్నాడు… ఆ బూతులు, ఆ సీన్లు వెంకటేష్ ఇన్నాళ్లుగా పేర్చుకున్న మంచిపేరుకు పంక్చర్ చేసేశాయి… పోతేపోయింది, దృశ్యం వంటి సినిమాలతో డ్యామేజీ రిపేరు చేసుకోవచ్చు… కానీ రానా నాయుడు సెకండ్ పార్టులో కూడా చేస్తాడట… అంతేకాదు, సల్మాన్ ఖాన్ నటించిన అదేదో హిందీ సినిమాలో సైడ్ కేరక్టర్ పోషించి మరింత పరువు పోగొట్టుకున్నాడు… సినిమా కూడా అట్టర్ ఫ్లాప్… సో, ఒకేసారి వెంకటేష్, రానా, అభిరామ్… వీళ్లకు ఏమైంది..? ఓ బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్న వీళ్లు ఈ తప్పుటడుగులు ఎందుకు వేస్తున్నట్టు..? ఫాఫం రామానాయుడు..!!
ప్రొడక్షన్ చేయాలా..? స్టూడియో చూసుకోవాలా..? హీరోగా చేయాలా..? అనే సందిగ్ధంలో ఉన్న స్థితిలో… నాకు టాలెంట్ ఉందోలేదో, పనికొస్తుందో రాదో పరీక్షించుకోవడానికి అహింస తీశాం, ఈ సినిమాతో నా టాలెంట్, నా కెరీర్ తేలిపోతాయి అని చెప్పుకొచ్చాడు అభిరామ్ ఈమధ్య ప్రెస్‌మీట్‌లో… డౌటేమీ అక్కర్లేదు అభిరామ్… స్టూడియో వ్యవహారాలు చూసుకో… తెలుగు ప్రేక్షకుడు కూడా తేలికగా ఊపిరి పీల్చుకుంటాడు… ప్లీజ్…!!
Share this Article