కురుక్షేత్రంలో అనేకమంది అతిరథులు, మహారథులు మరణించారు కదా… తరువాత కొన్నేళ్లకు యాదవులు, పాండవులు కూడా గతిస్తారు కదా… కురుక్షేత్రంలో మరణించకుండా మిగిలినవాళ్లలో కురుగురువు కృపాచార్యుడు, ధర్మరాజు సవతిసోదరుడు యుయుత్సు, యాదవ వీరులు సాత్యకి, కృతవర్మ కూడా కాలం చేస్తారు… అశ్వత్థామ కృష్ణుడి శాపానికి గురై, కుష్టు వ్యాధిగ్రస్తుడై, పిచ్చోడై దేశాలు పట్టిపోతాడు… ఈలోపు కలియుగం వచ్చేస్తుంది… మరి అనేకానేక దివ్యాస్త్రాల పరిజ్ఞానం అంతటితో అంతరించిపోయిందా..? అవి తెలిసిన వీరుడెవ్వడూ కలియుగంలోకి ప్రవేశించలేదా..? ఓ చిన్న చర్చ… మూలకథలో ఉందో లేదో తెలియదు గానీ ఎక్కువగా జానపదంలో ప్రాచుర్యంలోకి వచ్చిన వీరుడి కథ ఒకటి ఉంది… అన్ని దివ్యాస్త్రాల పరిజ్ఞానం కలిగిన ఆ వీరుడి పేరు వృషకేతు… విశ్వకేతు అని కూడా పిలుస్తారు… కర్ణుడి చిన్నకొడుకు… ఈ కథలో అనిర్వచనీయమైన ఓ ఉద్వేగం ఉంది… అదీ ఆసక్తికరం…
కురుక్షేత్రం మొదలయ్యే నాటికి వృషకేతు చిన్నవాడు… మిగతా కొడుకులను తనతోపాటు యుద్ధానికి తీసుకెళ్లిన కర్ణుడు చిన్న కొడుకును ఇంటి దగ్గరే వదిలేస్తాడు… కొడుకులతోపాటు మరణిస్తాడు… కర్ణుడు తమ సోదరుడే అని తెలిశాక పాండవుల్లో ఓ మథనం… అప్పటికే అశ్వత్థామ చేతుల్లో తమ కొడుకులను కోల్పోతారు… ఉత్తర గర్భంలో విగతజీవుడైన పరీక్షిత్తును కృష్ణుడు బతికిస్తాడు… అందరినీ కోల్పోయిన బాధలో ఉన్న పాండవులకు కర్ణుడి కొడుకు వృషకేతు మీద అభిమానం పెరుగుతుంది… చేరదీస్తారు… కర్ణుడి రాజ్యాన్ని తనకే ఇచ్చేస్తారు… ప్రత్యేకించి అభిమన్యుడిని కోల్పోయిన బాధలో ఉన్న అర్జునుడు వృషకేతులో అభిమన్యుడిని చూసుకుంటాడు… ఈలోపు…
Ads
ధర్మరాజు అశ్వమేధయాగాన్ని సంకల్పిస్తాడు… నాలుగు దిక్కులను నలుగురు తమ్ముళ్లూ వెళ్తారు… ఒకవైపు అర్జునుడి వంతు… తనతోపాటు వృషకేతు… అలవోకగా అన్ని రాజ్యాల్నీ లోబరుచుకుంటూ మణిపురం దాకా వెళ్తారు… అక్కడ చిత్రాంగద ఉంటుంది… అర్జునుడి భార్య… వాళ్లకు బభృవాహనుడనే కొడుకు పుట్టాక అర్జునుడు ఆమెను అక్కడే ఉంచేస్తాడు… ఈ యాగాశ్వం అక్కడికి చేరుకునేసరికి బభృవాహనుడు దాన్ని అడ్డగించి, స్వాధీనం చేసుకుంటాడు… తండ్రీకొడుకుల నడుమ యుద్ధం అనివార్యం అవుతుంది… అర్జునుడు అన్యమనస్కంగా యుద్ధం చేస్తుంటాడు… ఓ బాణం తగిలి మరణిస్తాడు… బభృవాహనుడి వేగానికి తట్టుకోలేక ఈ వృషకేతు కూడా నేలకూలతాడు…
చిత్రాంగద విషయం తెలిసి లబోదిబోమంటూ అక్కడికి వచ్చి బభృవాహనుడికి అసలు విషయం చెబుతుంది… ఈలోపు అర్జునుడి మరో భార్య ఉలూపి వచ్చి, మృతసంజీవని రత్నం ద్వారా అర్జునుడిని, వృషకేతును బతికిస్తుంది… అర్జునుడు కొడుకు చేతిలో మరణించడానికి వసువుల శాపం అనేది మరో కథ… తరువాత అర్జునుడు వృషకేతుకు అన్ని యుద్ధవిద్యలు దగ్గరుండి నేర్పిస్తాడు… అన్నిరకాల దివ్యాస్త్రాల జ్ఞానాన్ని బోధిస్తాడు… కానీ అరాచకానికి మారుపేరైన కలియుగంలో ఈ పరిజ్ఞానం దుర్వినియోగం అవుతుందనీ, కల్లోలానికి కారణం అవుతుందని కృష్ణుడు కలవరపడతాడు… ఓరోజు అర్జునుడు లేని సమయంలో వృషకేతు దగ్గరకు వెళ్లి ఓ వాగ్దానం అడుగుతాడు… సాక్షాత్తూ కృష్ణుడే అడిగేసరికి వృషకేతు అంగీకరిస్తాడు… ‘‘ఈ దివ్యాస్త్రాలు కేవలం నీ ఆత్మరక్షణ కోసం తప్ప ఇంకెందుకూ వినియోగించొద్దు… ఏ రాజూ సాహసించి మీపైకి దాడికి దిగే పరిస్థితి ఇప్పట్లో రాదు కనుక ఆ అస్త్రవినియోగమూ అవసరపడదు… కానీ నువ్వు నీ కొడుకులకు గానీ, ఇంకెవరికి గానీ ఈ దివ్యాస్త్ర జ్ఞానాన్ని బోధించొద్దు…’’ అనడుగుతాడు… మాట ఇచ్చిన వృషకేతు దానికి కట్టుబడతాడు… తనతోపాటు ఆ దివ్యాస్త్రాల పరిజ్ఞానం కాలగతిలో అంతరించిపోయింది..!!
Share this Article