Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ డీఎస్పీ నళినికి ఏమైంది..? ఏమిటీ మరణవాంగ్మూల, వీలునామా ప్రకటన..?!

September 21, 2025 by M S R

.

దోమకొండ నళిని… ఈ పేరు తెలుసు కదా… మాజీ డీఎస్పీ… తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినందుకు అప్పటి ప్రభుత్వాలు ఆమెను శిక్షించాయి… ఖాకీ కొలువుకు దూరం చేశాయి… ఉద్యమ పార్టీగా చెప్పుకునే కేసీయార్ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదు తన పదేళ్ల పాలనలో…

చాన్నాళ్లు సనాతన ధర్మ పద్ధతిలో హోమాలు చేయిస్తూ, యోగసాధన, యాగాల్లో, ధర్మప్రచారాల్లో కాలం గడిపింది… రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆమె తనను కలిసింది… అన్నిరకాలుగా బాసటగా నిలబడతానని సీఎం హామీ ఇచ్చాడు…

Ads

ఇప్పుడు హఠాత్తుగా ఆమె తెర మీదకు వచ్చింది… తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ ( వీలునామా/ మరణ వాంగ్మూలం) పేరిట ఫేస్‌బుక్‌లో తన వాల్‌పై ఓ పోస్టు పెట్టింది… అసలు ఏమైంది ఆమెకు… ఆమె మాటల్లోనే ఓసారి చదవండి…



ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను.

8 ఏండ్ల క్రితం సోకిన Ruematoid arthritis అనే విలక్షణ కీళ్ల జబ్బు (= Blood cancer+ Bone Cancer) గత రెండు నెలలుగా టైపాయిడ్ , డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కణకణం పేలిపోతున్నట్లు , ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి. తట్టుకోలేక పోతున్నాను.

2018 లో ఈ జబ్బు ప్రారంభం అయినప్పుడు ఇలాంటి స్థితే ఏర్పడ్డపుడు, మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్ లో నెలల తరబడి ఉంటూ, నన్ను నేను బాగుచేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బు లేదు.

25 ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది. నేను ఫార్మసిస్టును కూడా కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సిన RA ఫ్యాక్టర్ అత్యధికంగా 900 కు చేరినా స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ, యోగ, ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను.

కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది . దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి…

నా గతమంతా వ్యధాభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నాకు నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసి తీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక, నొప్పిని భరిస్తూనే , 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను.

మహర్షి దయానందుని దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని, అందులో విశేషమైన కృషి చేస్తూ , యజ్ఞ బ్రహ్మగా VYPS (వేద యజ్ఞ పరిరక్షణ సమితి) సంస్థాపకురాలుగా ఎదిగి, హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని, నా దారిని రహదారిగా పూల బాటగా మలచుకున్నాను.

నళిని మళ్ళీ వికసించింది. ఇలాంటి తరుణంలో నేటి CM అధికారంలోకి రాగానే నా ఫైల్ ను ఎందుకో తెరిచారు. నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్ పై విచారణ చేయించి, ఇన్నేండ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అల్లోవెన్స్ లెక్కకట్టి ( సుమారు 2 కోట్లు) ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ ఇచ్చాను.

వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగాను. ( రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది). 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైంది అని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదు.

మీడియా మిత్రులకు విజ్ఞప్తి. నేను చస్తే ఎవరూ సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి , యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంభోదించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి . బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్టుమస్ అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి. బ్రతుకుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు.

ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే , నాకు సరైన , ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయట పడతాను. లేదంటే … ఇంకా 3, 4 పుస్తకాలు రచించాలని , 100 వీఐపీ యజ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి, సనాతన ధర్మాన్ని బోధించి, వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని … ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు…

నా పేరుపై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం vyps కు చెందుతుంది. బ్రతుకుండగా దేశ ప్రధానిని
కలవలేక పోయాను. వారు కరుణామయులు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్ కు ఇవ్వవలసిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తాను. సెలవిక మిత్రులారా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ పెద్ద పండుగ దసరా… ఈ సోయి సర్కారుకు లేకుండా పోయింది…
  • ఆ డీఎస్పీ నళినికి ఏమైంది..? ఏమిటీ మరణవాంగ్మూల, వీలునామా ప్రకటన..?!
  • ప్రత్యేకించి ఇండియాపైనే అమెరికా ట్రంపుకు ఎందుకీ అక్కసు..?
  • కెప్టెన్సీ ఊడబీకేశారు… సంచాలక్స్ తలదించేశారు…గాడితప్పిన షో…
  • కేదారనాథ్‌కే కాదు… హేమకుండ్‌కూ రోప్ వే… ఈ రెండూ ఎందుకంటే..?
  • ఎవెరీబడీ లవ్స్ ఎ వైట్ రేషన్ కార్డ్..! అందరూ పేదవాళ్లే..!!
  • అప్పటి హీరోలు ఎక్కువ సినిమాలు చేసేవాళ్లు, ఇండస్ట్రీ పచ్చగా ఉండేది…
  • మేడారానికే వెళ్దాం… అపోహల్ని తొలగిద్దాం… అక్కడే ఫైనల్ నిర్ణయాలు…
  • ఇనుప కచ్చడాలు వంటి రచన ఆ రోజుల్లో ఏ రచయితైనా ఊహించి ఉండేవారా?
  • ఈ దేశంలో ఇంతే… పెద్దోడికో న్యాయం-పేదోడికో న్యాయం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions