నిజం కావచ్చు, కాకపోవచ్చు… కానీ అనుకోవడానికి ఆస్కారమైతే ఇస్తుంది జగన్ ప్రభుత్వం… ఏమిటీ విమర్శ అంటే..? భీమ్లానాయక్ సినిమాకు, తద్వారా పవన్ కల్యాణ్‌కు ప్రయోజనం దక్కకూడదు అనే భావనతోనే సినిమా టికెట్ల రేట్ల పెంపు జీవో ఇంకా విడుదల చేయడం లేదు అని..! ఎందుకు..? పవన్ కల్యాణ్ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి..! ఎందుకు..? పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి..! ఎందుకు..? టికెట్ రేట్ల మీద కూడా పవన్ కల్యాణ్ ఒక్కడే నిటారుగా నిలబడి ప్రభుత్వాన్ని విమర్శించాడు కాబట్టి..!
అంతకుముందు చిరంజీవి, నాగార్జున కలిసి జగన్ వద్దకు కలిసి వెళ్లొచ్చారు… తరువాత చిరంజీవి నేతృత్వంలో రాజమౌళి, మహేశ్ బాబు తదితరులు వెళ్లొచ్చారు… జగన్ తమ కోరికల పట్ల సానుకూలత వ్యక్తపరిచాడనీ, అయిదో షోకు అనుమతితోపాటు మిగతా సానుకూలాంశాలతో కొద్దిరోజుల్లో కొత్త జీవో విడుదల అవుతుందని సదరు ఇండస్ట్రీ ప్రతినిధులు మీడియాకు చెప్పారు…
అయిపోయింది, చాలారోజులు గడిచిపోయాయి… మధ్యలో మరో మెగా మీటింగ్ పెట్టారు కానీ చాలామంది ప్రముఖులు ఆ భేటీకి ఎగ్గొట్టారు… తరువాత ఎవరో మంత్రి మోహన్‌బాబు ఇంటికి వెళ్లొచ్చాడు… ‘మా’ అధ్యక్షుడు విష్ణు జగన్ ఇంట్లో మధ్యాహ్నభోజనానికి వెళ్లాడు… అసలు ఇండస్ట్రీ పెద్దలు జగన్ ఎదుట వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నారంటూ మళ్లీ పవన్ కల్యాణ్ వెక్కిరించాడు… అఫ్‌కోర్స్, అది నేరుగా తన అన్నకే తగులుతుందని తెలిసీ అన్నాడు ఆ మాట…
Ads
సరే, ఇవన్నీ జరిగాయి… ఒకవైపు హైదరాబాద్ నుంచి ఇండస్ట్రీ కదలకుండా ఉండేందుకు ఇండస్ట్రీ ఏదడిగితే అది ఇచ్చేస్తున్నాడు కేసీయార్… ఇదే బీమ్లానాయక్ సినిమా మీద కూడా వరాలు కురిపించాడు… కేటీయార్ స్వయంగా ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లాడు… బారాఖూన్ మాఫ్… తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేసినందుకు 11 రోజులు నిద్రాహారాలు మాని బాధపడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆత్మీయుడే… ఇంకోవైపు ఏపీకి తరలిరావాలని, భూములిస్తాననీ చెబుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ టికెట్ రేట్ల జీవో కూడా ఇవ్వడం లేదు… పైగా పాత రేట్లే వసూలు చేయాలనీ, లేకపోతే చర్యలు తప్పవనీ హెచ్చరిస్తోంది…
ప్రస్తుతం ఏ విధానం అమలులో ఉంటే, దాన్నే పాటిస్తే సరిపోతుంది కదా… మరి ఒక సినిమా పేరుతో ప్రత్యేకంగా హెచ్చరికలు చేయడం, భేటీలు వేసి థియేటర్లకు తర్జని చూపించడం అంటే… ప్రత్యేకంగా పవన్ కల్యాణ్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టుగా లేదా..? పోనీ, పవన్ సినిమా నిర్మాతలే ఓవరాక్షన్ చేస్తారనే డౌట్ ఉంటే… జస్ట్, ఎగ్జిబిటర్లకు కాల్స్ చేసి, రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలుంటాయని చెబితే సరిపోదా..? ఇలా సర్క్యులర్లు జారీ చేయాలా..?!
ఇదంతా నాణేనికి ఒకవైపు… మరోవైపు వాదనలు చూస్తే… ఆఫ్టరాల్ బీమ్లానాయక్ దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం త్వరగా జీవో ఇవ్వడం లేదంటున్నారు కదా… తరువాతకాలంలో విడుదల కాబోయే పవన్ సినిమాలకైతే కొత్త జీవో వర్తిస్తుంది కదా, మరి ఇప్పుడు జీవో ఆపడం వల్ల, ఒక్క సినిమాకు నష్టం కలిగించడం వల్ల సాధించేది ఏమిటి..? నిజానికి ఇప్పుడున్న రేట్లతో కూడా ఎంచక్కా సినిమా రిలీజ్ చేసుకోవచ్చునని బంగర్రాజు, అఖండ ప్రూవ్ చేశారు…
చాన్నాళ్ల తరువాత మళ్లీ ఓ తెలుగు సినిమా… అదీ అఖండ నాలుగైదు థియేటర్లలో వంద రోజుల పండుగ చేసుకోబోతోంది… ఇది అనూహ్యం… టికెట్ రేట్ల తగ్గింపును బాలకృష్ణ అలవోకగా అధిగమించేశాడు… అంతేతప్ప బాబ్బాబు అంటూ ఎవరి కాళ్ల మీదా పడిపోలేదు… అయితే… ఆల్‌రెడీ బీమ్లానాయక్ ట్రెయిలర్ చూస్తుంటే… ఒరిజినల్ సినిమాను పవన్ ఇమేజీకి అనుగుణంగా సమూలంగా మార్పులు చేశారని అనిపిస్తోంది… పెద్దగా హైప్ క్రియేట్ చేసేట్టుగా కూడా లేదు ట్రెయిలర్… సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి… ఈలెక్కన చూస్తే బీమ్లానాయక్ వచ్చాక మొదటివారం ముగిసేవరకూ కొత్త రేట్ల జీవో వచ్చేట్టు కనిపించడం లేదు మరి…!!
Share this Article