నిజమే… ఆల్‌రెడీ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంటోంది… సుడిగాలి సుధీర్ ఏమయ్యాడు..? ఈటీవీని వదిలేశాక… లేదా ఈటీవీ నుంచి బయటికి పంపించేయబడ్డాక… అటూఇటూ గాకుండా అయిపోయాడా..? ఒకప్పుడు జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీల్లో కమెడియన్‌గా, మెంటార్‌గా, హోస్ట్‌గా బిజీగా ఉండేవాడు… నడుమనడుమ సినిమాలు చూసుకునేవాడు… తరువాత ఈటీవీలో ఎవరికి కన్నుకుట్టిందో గానీ సుధీర్ మీద కక్ష స్టార్టయింది…
ఒక్కొక్క రెక్కనే కత్తిరిస్తూ… చివరకు తనంతటతానే ఈటీవీ నుంచి బయటికి వెళ్లేలా చేశారు… ఆ తలతిక్క అగ్రిమెంట్ల బందిఖానా నుంచి బయటపడి, బయటి చానెళ్లలో ఒకటీరెండు అవకాశాలు వెతుక్కుని వెళ్లిపోయాడు… తన నుంచి విడిపోయిన రష్మి పంట పండింది… అనసూయ వెళ్లిపోవడంతో ఇక తనే జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ యాంకర్‌గా చేస్తోంది… సుధీర్ వెళ్లిపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా తనే చేస్తోంది… ఇంకోవైపు ఆమెతో విడిపోవడమే కాదు, జాన్‌జిగ్రీదోస్తులుగా విపరీతంగా టాం టాం చేసుకున్న రాంప్రసాద్, గెటప్ సీనులకు కూడా సుధీర్ దూరమైపోయాడు… ఈటీవీ ప్రోగ్రాముల కోణంలో…
Ads
తీరా చూస్తే… అనసూయతో కలిసి హోస్టింగ్ చేసిన సూపర్ సింగర్ ప్రోగ్రామ్ అయిపోయింది… జీటీవీలో ఏదో స్పెషల్ ప్రోగ్రాం చేశాడు… ఇప్పుడు అక్షరాలా తన చేతుల్లో ఏ అవకాశాలూ లేవు… మధ్యలో ఓసారి ఈటీవీలో కనిపించాడు… సుధీర్ ఈజ్ బ్యాక్ అని మల్లెమాల గ్యాంగ్ ప్రచారం చేసింది…. కానీ అది ఒకే ఒక స్పెషల్ అకేషనల్ ప్రోగ్రాం… ఇలా వచ్చాడు, అలా వెళ్లిపోయాడు… అంతే… మరోవైపు జబర్దస్త్ నుంచి కొన్నాళ్లు లీవ్ తీసుకున్న హైపర్ ఆది మళ్లీ జబర్దస్త్‌కు వచ్చి చేరాడు… ఢీ, డ్రామా కంపెనీ నడుస్తూనే ఉన్నయ్… సో, అందరూ బాగానే ఉన్నారు, ఒక్క సుధీర్ తప్ప…
అబ్బే, సుధీర్ తన సినిమాల్లో బిజీ అయిపోయాడు, అందుకే కొత్తగా ఏ టీవీ ప్రోగ్రాములను ఒప్పుకోవడం లేదు అని సుధీర్ సన్నిహితులు బయట చెబుతున్నారు… కానీ అదీ కరెక్టు కాదు… వాంటెడ్ పండుగాడ్ సినిమా అట్టర్ ఫ్లాపయింది… నిజానికి అందులో సుధీర్ వైఫల్యం ఏమీలేదు… అదంతా బొడ్డు రాఘవేంద్రరావు పైత్యఫలితం… కానీ ఫెయిల్యూర్‌ను సుధీర్‌కు రుద్దారు… గాలోడు సినిమా ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు… పండుగాడ్ మీద ప్రచారంతో కొత్త ప్రాజెక్టులేమీ పట్టాలు ఎక్కే సీన్ లేదంటున్నారు… పైగా తను కేరక్టర్ ఆర్టిస్టుగా చేయడు కదా… చేస్తే హీరో… దాంతో మరింత దెబ్బ పడుతోంది తన మీద…
నిజానికి సుధీర్ మల్టీ టాలెంటెడ్… తనలోని మెరిట్‌ను నిజంగా ఎక్స్‌పోజ్ చేయగల ప్రోగ్రామ్స్ ఏమీ లేవు టీవీల్లో… తను పర్‌ఫామర్… పంచులతో లేదా కేకలు, అరుపుల హోస్టింగుతో సంతృప్తి పడే కేరక్టర్ కాదు… డాన్సులు, ఫీట్లు, మ్యాజిక్, కామెడీ, సింగింగ్, రొమాన్స్ అన్నీ చేయగలడు… మరి సరైన వేదిక ఏముంది..? ఏమీ లేదు… సో, నిలబడినచోట నీళ్లు తాగలేక, పాలు తాగడానికి పరుగెత్తి దెబ్బతిన్నాడా..? లేక ఉన్నచోట ఆ నీళ్లూ దక్కుకుండా చేసి, పరుగులు పెట్టించారా..? సుధీరే సమీక్షించుకోవాలి… కానీ సినిమాలు ఓ లాటరీ… కానీ టీవీ ప్రోగ్రాములు రెగ్యులర్‌గా పాలిచ్చే పాడిబర్రెలు… తేడా అర్థమైందనుకుంటా సుధీర్…
కొన్ని దిక్కుమాలిన సైట్లు తనకు ఏదో జబ్బు ఉందనీ, అందుకే తెరపైకి రావడం లేదనీ ప్రచారం చేస్తున్నాయి… కాస్త పేరున్న పెద్ద సైట్లు కూడా దానికి డప్పు కొడుతున్నయ్… మొన్నమొన్నటివరకూ మాటీవీలో సూపర్ సింగర్ జూనియర్స్ షో చేశాడు కదా… చాలా యాక్టివ్‌గా చేశాడు, షోకు తనే అట్రాక్షన్ అయ్యాడు… అలాంటిది హఠాత్తుగా జబ్బు ముంచుకొచ్చిందా..? ఉత్త నాన్సెన్స్ ప్రచారం…! కాస్త ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చయినా పలకరించి వెళ్లవయ్యా బాబూ…!!
Share this Article