వైద్యో నారాయణ హరి.ఈయనో వైద్యుడు. ఆరెమ్పీ కాదండోయ్! కొల్కతాలో ఎంబీబీఎస్, మైసూరులో ఎమ్డీ చదివాడు. చర్మవ్యాధుల నిపుణుడు. ఈయనకు క్లినిక్ అంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. కర్నాటకలో ఇలా రోడ్డు పక్కనే కూర్చొని రోజూ వందలాది మందికి వైద్యం చేస్తుంటాడు. అన్నట్లు ఈ డాక్టరు ఫీజు ఎంతో తెలిస్తే మనం నిభిడాశ్చరంలో మునిగిపోతాం? కేవలం రెండు రూపాయలు మాత్రమే!
అప్పట్లో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా కనిపించేది… కొన్నాళ్లు చల్లబడి, ఈమధ్య మళ్లీ కనిపిస్తోంది… నిజమేనా..? అసలు ఆ డాక్టర్ పేరు కూడా లేకుండా కోలకత్తాలో ఎంబీబీఎస్ ఏమిటి..? మైసూరులో ఎమ్డీ చదవడం ఏమిటి..? రోడ్డు పక్కన కూర్చుని వందల మందికి రెండు రూపాయలకే వైద్యం చేయడం ఏమిటి..? సోషల్ మీడియా అబద్ధాల సంగతి తెలిసిందే కదా… నిజానికి ఆయన ఎవరు..?
ఈయన పేరు శంకర్ గౌడ… కర్నాటకలోని మాండ్యా దగ్గర శివాలీ ఆయన ఊరు… కోలకత్తాలో చదవలేదు, మైసూరులో చదవలేదు… రెండు రూపాయల వైద్యమూ కాదు… తను చదివింది మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాడు… తరువాత వెనీరియాలజీ, డెర్మటాలజీలో డిప్లొమా చేశాడు… వెనీరియాలిటీ అంటే సుఖవ్యాధుల శాస్త్రం, డెర్మటాలజీ అంటే తెలుసు కదా… చర్మ వ్యాధుల శాస్త్రం… ఊళ్లల్లో సుఖవ్యాధుల ఉనికి ఉన్నా, బయటికి చెప్పుకోరు… అలాంటివాళ్లకు ఈ డాక్టర్ దేవుడే…
Ads
తను ఎక్కడ బడితే అక్కడ కూర్చుని, ఇలా వందల మందికి చిట్టీలు రాసివ్వడు… తనకు మాండ్యాలోనే ఓ క్లినిక్ ఉంది… అప్పుడప్పుడూ ఊళ్లకు వెళ్లి ఉచితంగా వైద్యసాయం చేసి వస్తుంటాడు… వైద్యో నారాయణో హరి అన్న వాక్యానికి పర్‌ఫెక్ట్ సూచిక తను… ఎవరికైనా అయిదు రూపాయలు తీసుకుని ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు… థరోగా చెక్ చేస్తాడు… మొదట్లో 100, 150 మంది వచ్చేవాళ్లు… తరువాత ఆ సంఖ్య ఒక దశలో 400 దాకా పెరిగింది… పై ఫోటో ఏదో ఊరికి వెళ్లినప్పుడు అక్కడికక్కడ పేషంట్లకు ఫ్రీగా ప్రిస్క్రిప్షన్లు రాసిస్తున్న దృశ్యం…
మందుల అమ్మకాల్లో కమీషన్లు… నో… ఖరీదైన చెత్తా డయాగ్నయిజ్ పరీక్షలకు, అందులో కమీషన్లకు నో… తను మనిషి… తను ఓ రియల్ డాక్టర్… కొందరు ఆ 5 రూపాయలూ ఇవ్వరు… ఐనాసరే, నవ్వుతూ సరేపో అంటాడు… ఆ 5 రూపాయల్లోనే ఓ సూది, కన్సల్టేషన్, ప్రిస్క్రిప్షన్ కలిసి ఉంటాయి… 2010లో పంచాయతీ ఎన్నికల్లో నిలబడ్డాడు… గెలిచాడు… రాజకీయం, వైద్యం సమాంతరం… తను వ్యవసాయం కూడా చేస్తాడు…
అందరికీ వైద్యం చేసీ చేసీ, తనను తాను విస్మరించాడు… గుండె పంపిన హెచ్చరికల్ని ఇగ్నోర్ చేశాడు, ఫలితంగా గుండెపోటుకు గురయ్యాడు ఈ ఏడాది మొదట్లో… జూన్ నాటికి వేగంగానే కోలుకున్నాడు… కానీ ఊరుకోడు కదా… విశ్రాంతి లేదు… మళ్లీ పనిలో దిగిపోయాడు… అదే అయిదు రూపాయలు, అదే శంకర్ గౌడ్… దిల్ సే… హార్టీ కాంప్లిమెంట్స్ డాక్టర్ సాబ్… ఎందరు డాక్టర్లు నిన్ను చూసి సిగ్గుపడాలి…!!
Share this Article