ఒక డిస్టర్బింగ్ ఫోటో ఇది… ఆ అడవిలో ఎవరామె చంటి బిడ్డను ఎత్తుకుని వెళ్తోంది..? ఎవరి కోసం..? ఏ అన్వేషణ కోసం..? ఇదే కదా మీ ప్రశ్న… ఆమె పేరు అర్పిత… చత్తీస్‌గఢ్, బీజాపూర్ అడవుల్లో తన భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తోంది… ఆమె భర్త అజయ్ రోషన్ ఓ ప్రభుత్వ శాఖలో సబ్ ఇంజనీర్… బీజాపూర్ జిల్లా, మాంకెలి ఏరియాలో ఘడ్ గోర్నా రోడ్ సర్వే కోసం తన అటెండర్‌తో కలిసి వెళ్లినప్పుడు నక్సలైట్లు కిడ్నాప్ చేశారు నాలుగు రోజుల క్రితం… అది పూర్తిగా నక్సల్స్ ప్రాబల్యప్రాంతం… తనతోపాటు కిడ్నాప్ చేసిన అటెండర్ లక్ష్మణ్‌ను వదిలేసిన నక్సలైట్లు ఆ సబ్ ఇంజనీర్‌ను మాత్రం తమతోనే ఉంచుకున్నారు… డిమాండ్లు తెలియవు, ఏం చేశారో తెలియదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు… ఆయన భార్య అర్పితకు దడ…
‘‘నా భర్త అమాయకుడు, తనకేమీ తెలియదు, దయచేసి వదిలేయండి’’ అని నక్సలైట్లకు మొరపెట్టుకుంది పత్రికాముఖంగా… పోలీసుల గాలింపు అనేది ఓ అర్థరహితమైన ప్రయాస అని అందరికీ తెలుసు… నక్సలైట్ల నుంచి ఏ స్పందనా లేదు… దాంతో మొన్న రెండేళ్ల కొడుకును భుజాన వేసుకుని తనే అడవుల్లోకి వెళ్లింది… కానీ ఎటు పోవాలి..? ఎవరు దొరుకుతారు..? ఎవరు సాయపడతారు..? అదసలే పోలీసులు, నక్సలైట్ల యుద్ధక్షేత్రం… భయమే ఆ ఏరియాను పాలించేది… రాజ్యం హింస, నక్సలైట్ల ప్రతిహింస… ఆ హింసల నడుమ చిక్కిన ఆ ప్రాంతజనం… ఆ సబ్ ఇంజనీరే కాదు, ఆమె ఏమైపోయిందో కూడా తెలియదు ప్రస్తుతానికి…
Ads
నక్సలైట్ల త్యాగాలు, పోరాటాల పట్ల సానుభూతి ఉన్నవారికి సైతం చీదర పుట్టించే సంఘటనలు ఇవి… అర్థంపర్థం లేని హింస, గమ్యం లేని పోరాటం, అడవుల పాలవుతున్న వేల మంది ప్రాణాలు, దానికితోడు ఇదుగో ఈ కిడ్నాప్ ఉదంతాలు… కుటుంబ సభ్యుల్లో టెన్షన్, భయం, అలజడి… బీహార్ మావోయిస్ట్ పార్టీతో కలవకముందు పీపుల్స్‌వార్ గ్రూపులో కొంత సైద్ధాంతిక నిబద్థత కనిపించేది… అప్పట్లో కూడా కొంతకాలం కిడ్నాపులు జోరుగా సాగించేవాళ్లు… కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో కిడ్నాపులకు పూర్తిగా స్వస్తి పలికారు… మరేమైంది ఇప్పుడు ఆ నిర్ణయం..? అడవి తుప్పల్లో పాతేసినట్టేనా..?
మరో రెండుమూడు పాయింట్లు… 1) యుద్ధం ఎవరితో..? ఇరుపక్షాల సైనికుల నడుమ పోరు వేరు, పౌరులను ఎందుకు లాగుతున్నారు..? క్రూరహింసకు సంబంధించి పోలీసులకు, నక్సలైట్లకూ నడుమ తేడా ఏమున్నట్టు ఇక..? 2) కిడ్నాప్ చేస్తే ఇన్నిరోజులపాటు ఈ గోప్యత ఏమిటి..? ఎందుకు చేశారు..? అసలు ఆమె ఏమైపోయింది..? 3) అతన్ని పోలీస్ ఇన్‌ఫార్మర్ అనుకున్నారా..? అటెండర్‌తో అదే చెప్పి పంపించారా..? మరి పోలీసులు ఎందుకు మాట్లాడటం లేదు..? 4) యుద్ధం జరుగుతున్నప్పుడు మానవీయ కోణం మన్నూమశానం ఏమీ ఉండవు అంటారా..? అలాంటప్పుడు మీపట్ల సాగే క్రూరమైన అణిచివేతకు ప్రజలు కూడా సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని అంగీకరిస్తున్నట్టేనా కామ్రేడ్స్..?!
అప్ డేట్ :: అర్పితకు స్థానిక జర్నలిస్టులు సాయం చేశారు… కిడ్నాప్ చేసిన మావోయిస్టుల దగ్గరకు తీసుకుపోయారు… చివరకు ప్రజాకోర్టు నిర్వహించి ఆ సబ్‌ఇంజినీర్‌ను విడుదల చేశారు, కథ సుఖాంతం… కానీ చాలా ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి… ఇన్నిరోజులపాటు తమతో ఎందుకు ఉంచుకున్నట్టు..? ఎందుకు కిడ్నాప్ చేసినట్టు..? విడుదలకు ముందు ప్రజాకోర్టులో ఏం విచారించినట్టు..? చివరకు ఏం తేల్చినట్టు..?
Share this Article