రామాయణం అనగానే… రామాయణంలోని పాత్రలు గుర్తొస్తయ్ కదా… అందులో నరులు, వానరులు, రాక్షసులే కాదు… జటాయువు వంటి పక్షులు, జాంబవంతుడు వంటి ఎలుగుబంట్లు, చివరకు వంతెన కోసం రాళ్లెత్తిన కుందేలు… ఇలా చాలా జీవ జంతు పాత్రలు కూడా ఉన్నయ్… మళ్లీ ఆ నరుల్లోనూ కైకలు, మంథరలు… వానరుల్లో వాలి… రాక్షసుల్లో రావణాసురుడు, కుంభకర్ణుడు… హీరోలు, సైడ్ హీరోలు, హీరోయిన్లు, సైడ్ హీరోయిన్లు, విలన్లు, ఇతరత్రా పాత్రలు, అనేక తత్వాలు కూడా… చాలా కీలకపాత్రే అయినా పెద్దగా చెప్పుకోబడని పాత్ర ఒకటి ఉంది… ఆ పాత్ర పేరు త్రిజట..! ఓ ‘అన్‌సంగ్’ రాక్షసపాత్ర… ఓసారి చెప్పుకోవాలి… చెప్పుకుంటేనే హిందూ ఆధ్యాత్మికత, మత ఫ్లెక్సిబులిటీ సరిగ్గా అర్థం అవుతాయి…
త్రిజట… రావణుడి పరిచారిక గణంలో ఓ ముఖ్యురాలు… లీడర్… సీతను ఎత్తుకొచ్చిన రావణుడు అశోకవాటికలో ఉంచుతాడు… ఆమెకు కాపలాగా బోలెడు మంది పరిచారికలు, వాళ్లకు లీడర్ త్రిజట… ఆమెకు అప్పగించిన విధి సీత క్షేమంగా ఉండాలి… అంటే ఎటూ పోవద్దు, ఆత్మహత్య వంటి అఘాయిత్యాలు చేసుకోకూడదు… గుండె పగిలి మరణించకూడదు… అందుకే కావచ్చు లేదా సహజసిద్ధంగా తనలో ఉన్న మంచితనం కావచ్చు… సీతతో మంచిగా మాట్లాడుతుంది, సీతలో ధైర్యాన్ని నింపడానికి ‘‘రావణాదుల ఓటమి, రాముడి గెలుపు’’ కల వచ్చిందని చెబుతుంది… ఎటొచ్చీ, సీతను సీతలాగా పదిలంగా కాపాడే బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తుంది ఆమె… మరి రామరావణ సంగ్రామం తరువాత త్రిజట ఏమైంది..?
Ads
అనేక రామాయణాలు, త్రిజట మీద అనేక భిన్నమైన ప్రస్తావనలు… ఒకరు త్రిజట రావణుడి చెల్లె అని రాస్తారు… మరొకరు విభీషణుడి బిడ్డ అని రాస్తారు… రావణసంహారం తరువాత ఆమెను పుష్పకంలో అయోధ్యకు తీసుకెళ్లి, అపారమైన కానుకల్ని ఇచ్చి పంపించారని ఇంకొకరు రాస్తారు… మరీ థాయ్‌లాండ్, మలేసియా తదితర తూర్పు ప్రాంతాల రామాయణాలైతే హనుమంతుడు ఆమెను పెళ్లిచేసుకున్నాడనీ, అసురపాదుడు అనే కొడుకు పుట్టాడని కూడా చెబుతయ్… సరే, ఇవన్నీ వదిలేస్తే… ఆ త్రిజటకు కూడా మనం గుళ్లు కట్టాం… ఉజ్జయినిలో ఒకటి… వారణాసిలో మరొకటి… ఓచోట దీపావళ్లి మరుసటి రోజు, మరోచోట కార్తీకపౌర్ణమి రోజుల్లో ప్రత్యేక ఉత్సవాలు… ముల్లంగిని, వంకాయల్ని సమర్పిస్తారు భక్తులు… ఏకంగా ఆమెను లక్ష్మీమాత అవతారమేననీ, అందుకే సీతను పదిలంగా చూసుకున్నదనీ నమ్ముతారు… పూజిస్తారు…
హిందువులు మొక్కే ప్రతి విగ్రహమూ ఏదో కోరికలను తీర్చేస్తుందని కాదు… కొన్ని విగ్రహాలకు పూజ అంటే అది స్మరణం… అది గౌరవం… తాము నమ్మే పురాణాల్లోని ‘‘ప్రతినాయక పాత్ర’’లకూ గుళ్లు కట్టిన అత్యంత ఉదార సమాజం మనది… త్రిజట రావణశిబిరమే ఐనా రామభక్తులకు ఇష్టమైన పాత్ర, సీతకు తోడుగా ఉంది గనుక అభిమానించారు అనుకుందాం..! కానీ అసలు భారతీయ ఆధ్యాత్మిక పరంపర, హిందూ మతవ్యాప్తి ఓ ప్రవాహం… అందరినీ కలిపేసుకుంటూ… దాటేసుకుంటూ… సాగుతూనే ఉంది… ఓ గిరిజన దేవుడు ఉంటే కృష్ణుడి అంశ అన్నాం కలిపేసుకున్నాం… ఓ శక్తి మాతను పూజించే జాతి కనిపిస్తే, ఆమెను అమ్మవారి అంశ అన్నాం కలిపేసుకున్నాం… మనం నమ్మే పురాణాల్లోని విలన్ పాత్రల్నీ పూజించేస్తాం… ఎక్కడో హస్తిన, ఎక్కడివాడో దుర్యోధనుడు… తనకు కేరళలో ఓ గుడి ఉంటుంది… కర్ణుడికీ గుడి… కురుముఖ్యులను ప్రజలు పూజిస్తారు…
రావణుడంటే మనవాడు, ఎక్కడి నుంచో వచ్చినవాడు రాముడు ఆర్యుడు, మనవాళ్లను అన్యాయంగా వధించాడనేది మన దక్షిణాది వేదన, వాదన… రావణుడిని ఈరోజుకూ పూజిస్తాం, గుళ్లు కట్టుకున్నాం, జాతరలు చేస్తాం… అవే గ్రామాల్లో రాముడినీ పూజిస్తాం… వైరుధ్యం… అంతెందుకు భారతంలోని రాక్షసపాత్ర హిడింబికి కూడా హిమాచల్‌ప్రదేశ్‌లో గుడి ఉంది… ఉత్తరాఖండ్‌లో ఆమె కొడుకు ఘటోత్కచుడికే కాదు, తన మనమడు బర్బరీకుడికి కూడా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో గుళ్లున్నయ్… రాక్షస పాత్రలే కదా, ఐనా కలిపేసుకున్నాం…
అంతెందుకు, దేవుడు లేడు, ఊర్ధ్వలోకాల్లేవు, పునర్జన్మలు లేవు అంటూ హిందూ మత పునాదుల్ని పెకిలించిన బుద్ధుడినే దేవుడిని చేసి, విష్ణు అవతారంగా చేసేశాం… అందరినీ కలిపేసుకోవడమే మన విశిష్టత… వృత్తులను బట్టి వర్ణాలుగా విభజించడమే మన సమాజాన్ని ఘోరంగా దెబ్బతీసింది… వివక్ష, ఆధిపత్యం, అంటరానితనం వంటి రోగాల్ని పుట్టించింది… ఈరోజుకూ సరైన సంస్కరణ లేదు… అందుకే పరాయి మతాలు కమ్మేస్తున్నయ్… ఐనా సరే, ఇన్నిరకాల ఇన్‌ఫెక్షన్లు ఉన్నా సరే… భారతీయ ఆధ్యాత్మిక, హిందూ మతప్రవాహం అలా సాగుతూనే ఉంటుంది… నాస్తికత్వాలు, ద్వేషాలు, మతమార్పిళ్లు, మతయుద్ధాలు గట్రా ఏమొచ్చినా సరే… దాటుకుంటూ, క్షమించేస్తూ, విలీనం చేసుకుంటూ, ఛేదిస్తూ… అది అలా పారుతూనే ఉంటుంది…!!
Share this Article