కరోనా పుణ్యమాని అందరమూ డాక్టర్లం అయిపోయాం… సోషల్ మీడియా మాత్రమే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అసత్యాలు, అభూత కల్పనలతో కూడిన సమాచారంతో తన అజ్ఞానాన్ని నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది… ఈ విపత్తు కాలంలోనూ క్షుద్ర రాజకీయాలతో తన్నుకుంటున్న మన పార్టీలకు దీటైన ధోరణి ఇది… ఉదాహరణలు బోలెడు… ఓ క్లాసిక్ ఉదాహరణ చూడాలి మనం… హైదరాబాద్ జంతుప్రదర్శనశాలలోని సింహాలకు కరోనా సోకిందని దాదాపు అన్ని టీవీలూ తెగ వాగాయి… దాదాపు అన్ని పత్రికలు మస్తు ప్రాధాన్యం ఇచ్చి అచ్చేశాయి… వోకే, అక్కడి వరకూ వార్తను వార్తలాగా చూశాయి సరే… అది తప్పదు, తప్పులేదు… కానీ గబ్బిలాల నుంచి ఈ కరోనా మనుషులకు సంక్రమించిందా లేక ఇంకేదైనా జీవిని ఆహారంగా తీసుకునే సందర్భంలో సంక్రమించిందా అనేదే తేలలేదు ఇప్పటివరకూ… ఇటు చైనా, అటు అమెరికా పరస్పరం తన్నుకుంటూనే పరిశోధనలు చేశాయి, చివరకు వదిలేశాయి…
సాంక్రామిక వ్యాధులకు సంబంధించి సోర్స్ అనేది తెలియాలి… వ్యాప్తి నియంత్రణ, చికిత్స, నిరోధానికి అవసరం… కరోనా కేవలం మనుషులకు మాత్రమే సంక్రమించిన వైరస్ అనుకుందాం, అది చైనా వదిలిన జీవాయుధమా, ప్రమాదవశాత్తూ లీకై విపత్తుగా మారిన నిర్లక్ష్యమా వంటి చర్చలోకి వద్దు కానీ… కరోనా రోజు వందల మ్యుటేషన్లతో తన బలాన్ని, తన రూపాన్ని, తన స్వభావాన్ని మార్చుకుంటోంది… అదీ సహజమే… అయితే అది మనుషుల నుంచి ఇతర జీవులకు సోకుతుందా..? మళ్లీ ఆ జీవుల నుంచి మనుషులకు అంటుతుందా..? ఇది చాలా చిక్కు ప్రశ్న, కీలకమైన ప్రశ్న… ఈ స్థితిలో నిజంగానే కరోనా వైరస్ గనుక సింహాలకు సోకి ఉంటే అది ప్రపంచ స్థాయి వార్త… పాండెమిక్ కంట్రోల్, రీసెర్చ్, స్టడీ చూసే ప్రతి సర్కిల్కూ ఇది చాలా ఇంట్రస్టింగు వార్త… కరోనా గనుక ఇతర జీవజాలాన్ని కూడా అంటుకుని వ్యాప్తి చెందే పరిస్థితే వస్తే… పొరపాటున ఆ జీవజాలంలో ఈగలు, దోమలు గనుక ఉంటే… ఇక కరోనా విలయాన్ని ఎవరూ ఆపలేని దుస్థితి….
మరి ఇంతటి కీలకమైన వార్త ఫాలో అప్ ఏది..? ఆ సింహాలు ఏమయ్యాయి..? క్వారంటైన్ చేశారా..? ఏం చికిత్స చేస్తున్నారు..? తదుపరి పరిశోధనలు ఏమైనా సాగాయా..? ఇదంతా ప్రపంచానికి అవసరమైన సమాచారం కదా… కానీ టీవీలు, సైట్లు, పత్రికలు, సోషల్ మీడియా ఒక్కసారిగా సైలెంట్… ఎందుకు..? ఒక్కసారి ఇది చదవండి…
Ads
‘‘అబ్బే, ఆ సింహాలకు సోకింది కరోనా కాదు, సార్స్-2 వైరసుల్లో కోవిడ్ అనేది మనుషులకు సోకేది, అంతే తప్ప సింహాలకు సోకిన వైరస్ అది కాదు… కుక్కలకూ సార్స్ వైరస్ సోకుతుంది… కానీ అది వేరు… మనుషుల్లోకి వ్యాపించదు… వాటికి టీకాలు కూడా ఉన్నయ్… సింహాలకు సోకిన వైరస్, మనుషులకే సోకే కోవిడ్ వేర్వేరని కేంద్రం కూడా నిర్ధారించింది’’ అని ఓ ప్రభుత్వ పశువుల డాక్టరే చెబుతున్నాడు… ఇదీ ఈనాడులో సిటీ పేజీలో కనిపించిన వార్త… సింహాలకూ వైరస్ తగిలిందిరోయ్ అనేదేమో మెయిన్ పేజీ వార్త… అబ్బే, అది కోవిడ్ కాదట అనే వార్తేమో సిటీ పేజీ వార్త… పోనీ, వేరే పత్రికలయినా అసలు నిజాన్ని చెప్పాలి కదా… వదిలేశాయి… ఒక భయాన్ని రేకెత్తించే వార్తను ప్రచారంలోకి తెచ్చాక, దాని ఫాలో అప్ వదిలేయడం నాసిరకం జర్నలిజం కాదా… ఐనా ఇవ్వాళ్రేపు జర్నలిజమే ఇలా తగలడింది కదా, ఎవర్నేం అనగలం అంటారా..? అసలు ఆ సింహాలకు కోవిడ్ అని నిర్ధారించింది ఎవరు..? ఎలా పరీక్ష చేశారు..? పోనీ, అదైనా రాశారా..? లేదు… సింహాల నుంచి శాంపిల్స్ ఎవరు తీశారు..? స్వాబ్ టెస్టేనా..? లేక సింహాలు వదిలేసిన సలైవాను పరీక్షించారా..? ఎవరూ కిక్కుమనడం లేదు… జరిగిన తప్పేమిటో అధికారులకూ తెలుసు… సో, అందరూ గప్చుప్ సాంబార్ బుడ్డీ…!!
ఇది కొసమెరుపు అన్నమాట….. ఈ సింహాలకు సోకింది మనుషులకు సోకే కోవిడ్ వైరస్ కాదని ఇదే ఈనాడు రాసింది కదా… మళ్లీ అదే ఈనాడు కరోనా నుంచి కోలుకుంటున్న సింహాలు అంటూ ఓ కార్టూన్ గీసింది… అంటే, ఇప్పటికీ సింహాల వైరసూ, మనుషుల వైరసూ ఒక్కటే అని మిస్ లీడింగ్… ఏ పేజీలో ఏం రాస్తున్నామో, వేస్తున్నామో, గీస్తున్నామో కూడా సరిచూసుకోరా ఈనాడు పేద్ధలు..!!
Share this Article