పార్ధసారధి పోట్లూరి….. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషి మఠం భూమిలోకి కుంగుతున్నది ! ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బద్రీనాథ్ కి వెళ్ళే దారిలో ఉంటుంది జోషీ మఠం [జ్యోతిర్మఠం] పట్టణం! జోషిమఠంలోని 560 ఇళ్ళు పగుళ్లు ఇచ్చాయి. కొన్ని చోట్ల మట్టి చరియలు విరిగి పడ్డాయి. రోడ్లు కూడా రెండుగా చీలిపోయాయి కొన్ని చోట్ల! ఎందుకిలా..?
భూమిలోని పొరలలో సర్దుబాటు కారణంగా ఇలా జరిగి ఉండవచ్చు ! సముద్ర మట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఉండే జోషీమఠం ఉత్తరాఖండ్ లోని చమొలీ జిల్లాలో ఉంది. బద్రీనాథ్, హేమాకుండ్ సాహిబ్ వెళ్ళే భక్తులు జోషీ మఠంలో ఆగి, ముందుకు వెళ్ళడానికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని వెళతారు. కొంతమంది యాత్రికులు మాత్రం జోషీమఠంలో ఒక రోజు విశ్రాంతి తీసుకొని బద్రీనాథ్ యాత్ర కొనసాగిస్తూ ఉంటారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం భూకంపాలు వచ్చే అత్యంత ప్రమాదకర జోన్ 5 [high-risk seismic ‘Zone-V’]లో ఉంది. జోషీ మఠంలో చాలా హోటళ్లు ఉన్నాయి… బద్రీనాథ్ యాత్రికులు బస చేయడానికి కొంతమంది తమ ఇళ్ళనే యాత్రికులకి బస చేయడానికి ఇస్తారు. నిన్న జోషీ మఠంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు స్థానిక మునిసిపాలిటీ నిర్లక్ష్యం కారణం అంటూ !
Ads
జోషీ మఠంలోని ఇళ్ళు బీటలు వారి, కొద్ది కొద్దిగా భూమిలోకి కుంగడానికి కారణం అక్కడికి దగ్గరలోనే నిర్మాణంలో ఉన్న NTPC టన్నెల్, బై పాస్ రోడ్… అలాగే అక్కడికి దగ్గరలోనే NTPC తపోవన్ –విష్ణుగడ్ హైడల్ ప్రాజెక్ట్ [NTPC’s Tapovan-Vishnugad hydel project] కూడా నిర్మాణంలో ఉంది. చాలా కాలంగా ఎన్టిపిసి తపోవన్ విష్ణుగడ్ హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల జోషీ మఠం పట్టణం క్రమంగా భూమిలోకి కుంగి పోతున్నది అని జోషీ మఠం పట్టణ వాసుల నమ్మకం.
నిజానికి భారత దేశపు టెక్టానిక్ ప్లేట్ [భూమి అంతరాలలో ఉండే ఫలకం ] ఆసియా టెక్టానిక్ ప్లేట్ వైపు సంవత్సరానికి ఒక సెంటీమీటర్ ముందుకు నెట్టుకుంటున్నది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే హిమాలయాలు మన దేశపు టెక్టానిక్ ప్లేట్ ఆసియా ఖండపు టెక్టానిక్ ప్లేట్ ని బలంగా గుద్దుకోవడం వలన ఏర్పడ్డాయి. సముద్రపు అడుగు భాగం పైకి లేచి బలంగా గుద్దుకోవడం వలన హిమాలయాలు ఏర్పడ్డాయి. అందుకే హిమాలయాల వద్ద చాలా ప్రదేశాలలో ఎలాంటి మొక్కలు మొలవవు ఎందుకంటే అక్కడ మట్టి ఉప్పగా ఉంటుంది కనుక !
అసలు హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర ఉండే ప్రాంతం అంతా తీవ్ర భూకంపాలు వచ్చే ప్రమాదకర జోన్ 5 లో ఉంది, కాబట్టి హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినా జరగకపోయినా అక్కడ ప్రతి రోజూ ఏదో ఒక చోట స్వల్ప భూకంపాలు వచ్చి పోతూ ఉంటాయి. చాలా వరకు 2 లేదా అంతకు తక్కువ తీవ్రత కల భూకంపాలు రిక్టర్ స్కేల్ మీద నమోదు అవుతూ ఉంటాయి కానీ మనుషులకి ఇలాంటి భూకంపాలు వచ్చినట్లు తెలియదు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 3 దాటితే మనుషులకి తెలుస్తుంది. కానీ స్వల్ప భూకంపాలు తరుచూ వస్తుంటాయి మనుషులు గుర్తుపట్టలేరు కానీ భూమి లోపలి పొరలు కొద్ది కొద్దిగా సర్దుకుంటూ ఉంటాయి. ఒక పొర ఇంకొక పొరని బలంగా ఢీకొట్టడం వలన 5 నుండి 7 సీస్మిక్ స్కేల్ మీద నమోదు అవుతాయి మరియు ఇళ్ళు కూలిపోవడం లేదా భూమిలోకి కుంగి పోవడం జరుగుతుంది.
బద్రీనాథ్ వెళ్ళే యాత్రికులు ముందు ముందు బై పాస్ రోడ్ కనుక పూర్తి అయితే జోషీ మఠంలోకి రాకుండా నేరుగా వెళ్లిపోతారు కాబట్టి అక్కడి స్థానికులకి ఆదాయం ఉండదు. ఇప్పటికే స్థానిక మునిసిపాలిటీ విద్యుత్ కేంద్రం మరియు బై పాస్ రోడ్ నిర్మాణ పనులని ఆపివేయమని ఆదేశాలు ఇచ్చింది! ఇళ్ళు ముందు ముందు కూలిపోతాయని భావించిన వాళ్ళకి వేరే చోట నివాసం ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. బాగా నెర్రెలు వచ్చిన ఇళ్ళని ఖాళీ చేయించారు, కానీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఇదే అదనుగా కాంగ్రెస్ ఆందోళన చేస్తున్న ప్రజలతో కలిసి బిజేపి మీద ఆరోపణల పర్వానికి తెరతీసింది ! బిజేపి నిర్లక్ష్యం వల్లనే ఇంతటి నాశనం జరుగుతున్నది అంటూ ప్రజలని రెచ్చగొడుతున్నది ! కానీ NTPC జల విద్యుత్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది 2006 లో అప్పటి UPA ప్రభుత్వం… UPA-1 ప్రభుత్వం మొదలు పెట్టిన దానినే ప్రస్తుతం బిజేపి ప్రభుత్వం కొనసాగిస్తున్నది !
హిమాలయాలు ఆసియా ఖండపు టెక్టానిక్ ప్లేట్ ని నెట్టుకుంటూ సంవత్సరానికి సెంటీమీటర్ చొప్పున ముందుకు వెళ్లడాన్ని ఎవరు ఆపగలరు ?తద్వారా వచ్చే భూకంపాలని ఎవరు ఆపగలరు ? 1969 లో అమెరికా ప్రయోగించిన అపోలో వ్యోమ నౌక రెండు రిప్లక్టర్ పానెల్స్ ని అమర్చింది చంద్రుడి మీద. అప్పటి నుండి ఆ రీఫ్లక్టర్ పానెల్స్ నుండి భూమికి మధ్య దూరాన్ని కొలుస్తూ వస్తున్నది. దీనివల్ల తెలిసింది ఏమిటంటే చంద్రుడు భూమి నుండి ప్రతి సంవత్సరం 3.8 సెంటీమీటర్స్ దూరం జరుగుతున్నాడు అని. ఎవరన్నా ఇలా జరగకుండా ఆపగలరా ? జోషి మఠం కూలిపోకుండా ఎవరైనా ఆపగలరా..? అదీ ఇలాంటి ప్రకృతి నిర్దేశిత పరిణామమే…!!
Share this Article