- వోటుకు అడ్డగోలుగా ధర పెంచేసి, జనాన్ని ‘ఆరు వేల’తో కొనుక్కోవచ్చునన్న ‘ధనఅహం’ ప్రతిసారీ గెలిపించదు
- అడిగిన ఫైళ్లన్నీ ఆగమేఘాల మీద శాంక్షన్ చేసేసి, పనులు చేసి, చిన్న నాయకుల్ని కొనే పథకాలూ ఫలించవు
- తాత్కాలిక భ్రమాత్మక పథకాలతో, పదిలక్షల చొప్పున సర్కారు ఖజానా నుంచే పంచినా కొన్నిసార్లు పనిచేయదు
- ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దాసోహమైపోయినా, ప్రభుత్వం చెప్పినట్టు నడిచినా కొన్నిసార్లు ఫలితం లేదు
- అనేకానేక సోషల్ ఫేక్ పోస్టులతో దుష్ప్రచారాలు సాగిస్తే, అవి రిజల్ట్ ఇవ్వకపోగా ఎదురుతన్నే ప్రమాదం ఉంది
- ప్రజలకు తెలియని ఏవో కారణాలతో ఒకరిని టార్గెట్ చేసి, రాజీనామా చేయించి, ఎన్నిక రుద్దితే జనం మెచ్చరు
- కులాల నడుమ చీలిక తెచ్చి, వోట్ల కోసం కొందరికే ‘ప్రభుత్వ నిధులు’ అందేలా చేస్తే మిగతా సమాజం హర్షించదు
- చిన్నాచితకా నాయకులను ప్రలోభపెట్టి, బెదిరించి, లోబరుచుకున్నా సరే, వాళ్లు చెబితే సగటు వోటరు వినడు
- ప్రజలు ఒక్కసారి ఫిక్సయిపోతే, ఇక పాలకుడు భూమ్యాకాశాల్ని ఏకం చేసినా సరే, ఇక వ్యతిరేక ఫలితం మారదు
- టీఆర్ఎస్ వోడిపోలేదు, బీజేపీ గెలవలేదు. ఈటల పట్ల కేసీయార్ వ్యవహారధోరణి ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు
నిజానికి ఈ స్థాయి పోల్ మేనేజిమెంట్ ఇక ఎవరితోనూ కాదు అన్నట్టుగా చేసింది TRS… ఏదీ విడిచిపెట్టలేదు… కొత్తగా అక్కడి నేతలకు కార్పొరేషన్ పదవులు, MLC ఇచ్చారు… 84 ఊళ్ళల్లో ఇప్పటికిప్పుడు రోడ్లు వేశారు… రమణ, పెద్దిరెడ్డి, కౌశిక్, మొత్కుపల్లి తదితరులను పిలిచి కండువాలు కప్పారు… కృష్ణయ్యను పిలిచి నూటాపన్నెండును మించిన బీసీ సంఘాలన్నీ కారుకే మద్దతు అనిపించారు… ఇవేకాదు… అసలు ఈ రేంజ్‌లో ఒక ఎన్నిక మీద సంపూర్ణ సాధనసంపత్తిని వినియోగించడం బహుశా దేశంలోనే మొదటిసారి కావచ్చు… అయితేనేం జనం తూచ్ అనేశారు… తెలంగాణలోనే ఓ మాట ఉంది… కుతికల దాకా కుక్కితే ఇసం అయితది, కక్కేస్తరు… అదే జరిగింది… పైపైన చూస్తే ఈ కారణాలే ప్రధానంగా అనిపించవచ్చుగాక… ఇంకా చాలా కారణాలు ఉండవచ్చు… కానీ హుజూరాబాద్ తేల్చిచెప్పింది ఏమిటంటే…
కేసీయార్ ఎవరూ ఓడించలేనంత బలవంతుడేమీ కాదు అని..! స్థూలంగా చూస్తూ, సాంకేతికంగా రాసుకోవాలంటే ఇది బీజేపీ గెలుపు… కానీ ఇది అక్షరాలా ఈటల వ్యక్తిగత గెలుపు… తనకు బీజేపీ శ్రేణులే కాదు… బయటపడకుండా ఇతర పార్టీలు బోలెడు సహకరించాయి, అనేక సెక్షన్లు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేశాయి… అంతెందుకు, టీఆర్ఎస్ శ్రేణుల్లోనే ఎందరు మనస్పూర్తిగా పనిచేశారనేదే పెద్ద సందేహం… పోలింగ్ అయిపోయిక ఒక్కసారిగా టీఆర్ఎస్ క్యాంపు నిశ్శబ్దంలో మునిగిపోయినప్పుడే అర్థమైంది ఫలితం… విజయగర్జన సభను వాయిదా వేస్తున్నప్పుడే అర్థమైంది ఫలితం… ఎగ్జిట్ పోల్స్‌తో అర్థమైంది ఫలితం… టీఆర్ఎస్ మండల స్థాయి నేతలంతా మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తున్నప్పుడే అర్థమైంది ఫలితం… ఇప్పుడు వెల్లడైంది ఫలితం… (15వ రౌండ్‌కే పదకొండు వేల మెజారీటీ దాటింది… ఇక ఒడిశింది కథ…) మరి ఈ ఫలితం యొక్క ఫలితం ఏమిటి..? తెలంగాణ రాజకీయాలపై ఎలా ఉండబోతోంది..? కాలం చెబుతుంది..!!
Ads
Share this Article