మన సినిమాల నిర్మాణ వ్యయం, ప్రేక్షకుల నిలువు దోపిడీ మీద చర్చ జరుగుతోంది కదా… ఎవరో మిత్రుడు చెప్పినట్టు ప్రేక్షకుల డబ్బుతో డమ్మీ గాళ్లను డెమీ గాడ్లు చేస్తున్నారు సరే… అనగా ఉత్త పోషిగాళ్లను కూడా దైవాంశసంభూతుల్ని చేస్తున్నారు… పొద్దునే ఓ రివ్యూ కనిపించి ఆలోచలనల్లో పడేసింది… ఆ సినిమా పేరు 19(1)(ఏ)… అవును, సినిమా పేరే అది… అర్థమై పోయిందా మీకు..? ఎస్, మలయాళం సినిమాయే…
సినిమా కొందరికి జీర్ణం కాదు… నచ్చదు… కానీ చాలాచాలా కోణాల్లో తీయదగిన సినిమాయే… కన్నడనాట అప్పట్లో గౌరీలంకేష్ అనే రచయిత్రి హత్య జరిగింది కదా… దానికి ఇంకొన్ని సంఘటనలు కలిపి, ఓ కథ రాసుకుని ఓ కొత్త యువ దర్శకురాలు 100 నిమిషాల సినిమాను పకడ్బందీగా తెరకు ఎక్కించింది… కాకపోతే కన్నడం కాస్తా మలయాళం అయిపోయింది… ఫిమేల్ రచయిత్రి కాస్తా మేల్ రచయిత అయిపోయాడు…
పొట్టకూటి కోసం జిరాక్స్ సెంటర్ నడిపించుకునే నిత్యా మేనన్… ప్రభుత్వ విధానాల్ని, ఫాసిస్టు పోకడల్ని ఎండగట్టే విజయ్ సేతుపతి ఓ రాత్రి ఆమె దగ్గరకు వచ్చి ఓ రాతప్రతి ఇచ్చి, టైప్ చేసి పెట్టు, రేపు వచ్చి తీసుకుపోతాను అంటాడు… అదే రాత్రి హత్యకు గురవుతాడు… తెల్లారే వార్తలు చూసి షాక్ తింటుంది నిత్య… ఎవరెవరికి చేరవేయాలో వాళ్లకు చేరవేస్తుంది తన దగ్గర ఉండిపోయిన సదరు రచయిత అంతిమ రచనను… ఈక్రమంలో దర్శకురాలు తను చెప్పదలుచుకున్న పాయింట్లన్నీ కథలో భాగంగా చెప్పేస్తుంది… సినిమా టైటిల్ భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన సెక్షన్…
Ads
అదేదో ఓటీటీలో ఉంది… తెలుగు వాయిస్ లేదు… స్లో సినిమా… కాకపోతే నిత్య, సేతుపతి కాబట్టి సినిమాకు స్టార్ వాల్యూ వచ్చింది… వాళ్లు అలవోకగా చేశారు సినిమాను… ఇక విషయానికి వస్తే ఈ సినిమాకు మహా అయితే కోటి రూపాయల ఖర్చు అయిఉంటుంది… ఓటీటీ, శాటిలైట్ టీవీ ఎట్సెట్రా రైట్స్ అమ్ముకుంటే, ఎంచక్కా మరో రెండు సినిమాలు తీయగలరు… ఆర్ఆర్ఆర్ ఖర్చుతో చూస్తే ఇలాంటివి బొచ్చెడు తీయొచ్చు… వృత్తినిపుణులు బతుకుతారు, అందరికీ ఫుల్లు పని, రిస్క్ లేదు, ప్రయోగాలు చేయొచ్చు, కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది… ఎన్ని ప్రయోజనాలో…
సరే, మన తెలుగు ఇండస్ట్రీ దరిద్రానికి కథలు కూడా దొరకడం లేదట కదా… ఏ మలయాళమో, ఏ తమిళమో రీమేక్ రైట్స్ కొనుక్కోవడం, మన తెలుగు రొడ్డకొట్టుడు ఫార్ములాలో ఇరికించి, నిర్మాణ వ్యయాన్ని అనేకరెట్లు పెంచేసి, అనేకం అనగా 60, 70, 80 రెట్లు కూడా… తెలుగు ప్రేక్షకుడిని హింసించడం…!
ఇదే సినిమాలో ఎవరైనా స్టార్ హీరోతో రీమేక్ తీస్తే… సదరు గౌరీశంకర్ అనబడే రచయితకు ఫైట్లు, డాన్సులు పెట్టాలి… అదే జిరాక్స్ సెంటర్‌లో నిత్యను చూడగానే ఓ సాంగ్ వేసుకోవాలి… చాలా చాలా కథలు పడి, మొత్తానికి ఓ మూసలో ఆ కొత్త కథను ఇరికించి, హిహిహి అని ఇకిలించేవాళ్లు… తెలుగు ఇండస్ట్రీ షూటింగులు బందు పెట్టడం కాదు, కారు చౌకగా సినిమాల్ని తీయడం… స్టార్ హీరోలను వదిలించుకోవడం… అప్పుడు మొత్తం రోగం మాయమవుతుంది… అవన్నీ వినేవాడెవడు..? వినాలనుకున్నా హీరోలు విననివ్వరు కదా… అసలే వీపుకు బద్దలు కట్టుకుని కష్టంగా స్టెప్పులు వేసే ఎనర్జిటిక్ హీరోలాయె…
సరే, నిత్యా మేనన్ విషయానికి వస్తే… నటనలో మెరిట్ ఉంది, అందం ఉంది… నచ్చని పాత్రల్ని ఇట్టే తిరస్కరించే గట్స్ ఉన్నాయి… ఆ టెంపర్‌మెంట్ తక్కువ మందికి ఉంటుంది… పాడుతుంది, ఆడుతుంది, అవసరమైతే డబ్బు పెడుతుంది, తనే డబ్బింగ్ చెప్పుకుంటుంది… ప్లజెంటుగా అనిపిస్తుంది తెర మీద… మొత్తానికి ఓ డిఫరెంట్ కేరక్టర్… కానీ బరువు పెరిగి చాలామంది నిర్మాతలు దూరందూరం జరిగారు… సోవాట్, నా దేహం నా ఇష్టం అని తిక్క సమర్థనలు చేసుకుంది తప్ప, ఇప్పుడంతా జీరో సైజ్ ట్రెండ్… పైగా ఈమె పొట్టి… మిషన్ మంగళ్ సినిమాలో చూస్తే మరీ స్థూలకాయం అనిపించింది…
ఒకవైపు మగపురుషులే తినీతినక, జిమ్ముల్లో గంటలకొద్దీ చెమటలు కక్కి, సిక్స్, ఎయిట్ ప్యాకులతో చివరకు బరిబాతల ఫోటోషూట్లు కూడా చేస్తున్నారు… సో, సైజ్ ఆల్వేస్ మ్యాటర్స్… ఫాఫం, తెలుగువాళ్లకు అభిమాననటి అనుష్క శెట్టి కెరీర్ ఈరోజుకూ ప్రశ్నార్థకం అయిపోయింది ఈ బరువు విషయంలో తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయమే… బీమ్లానాయక్, 19(1), ఇండియన్ ఐడల్… ఆమె కాస్త తగ్గింది గానీ ఇప్పటికీ స్థూలమే… కాస్త స్లిమ్ అయిపోతే, ఇంకేమైనా చాలెంజింగ్ రోల్స్ వస్తే… ఆమె రెచ్చిపోగలదు… ఎటొచ్చీ…!?
Share this Article