నిజమే… ఏపీలో రిజల్ట్ ఎలా ఉండబోతున్నదో ఎవరికీ అంతుపట్టడం లేదు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నట్టు క్రెడిబులిటీ లేని సోషల్, డిజిటల్ మీడియా ప్లేయర్లు ఏదేదో రాస్తున్నారుట… గందరగోళం క్రియేట్ చేస్తున్నారుట… ఉద్యోగాలు పోయిన సీనియర్ జర్నలిస్టులు ఈ వికారాలకు పాల్పడుతున్నారట… వోటర్ల నాడి అంతుపట్టని సిట్యుయేషన్‌లో రకరకాల ఊహాగానాలు, ఆశలు, అంచనాలు సహజమే కదా… ఇందులో తప్పుపట్టడానికి ఏముంది..? అందరికీ సగటు మనిషే కదా అలుసు…
మరి రాధాకృష్ణ చేస్తున్నది మాత్రం భిన్నంగా ఉందా..? జగన్ మీద వ్యతిరేకత ఉంది, చంద్రబాబు సింపుల్‌గా రాబోయే తన టీంలోకి సీనియర్ అధికారులుగా ఎవరిని తీసుకోవాలో కసరత్తు చేసుకుంటున్నాడట… అంటే చంద్రబాబు కూటమి గెలవబోతున్నదనేగా… మరి దీన్నేమనాలి..? యూట్యూబ్ చానెళ్లు, పలు సర్వే సంస్థల పేరిట వెలువడే ఎగ్జిట్ పోల్ ఊహాగానాలకు ఆంధ్రజ్యోతి రాతలకూ నడుమ తేడా ఏమున్నట్టు..?
2018 జూలై అవిశ్వాస తీర్మానం ముందు వారం రోజులపాటు తమ మీడియాలో ఏమీ రాశాడో ఓసారి గుర్తుచేసుకోవాలి… అద్వానీ, జోషి కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వోటేస్తారు, నితిన్ గడ్కరీ తదుపరి ప్రధాని అని ప్రచారం చేసింది ఎవరు..? ఏకంగా ఆర్ఎస్ఎస్ తీర్మానం చేసిందనీ రాసిపడేశారుగా…
Ads
ప్రతి మీడియా, ప్రతి జర్నలిస్టు తమ అనుకూల పార్టీలకు, నాయకులకు మద్దతుగా ఏదేదో రాయడం ఏమైనా కొత్త విషయమా..? సాక్షిలో ఈరోజు బీజేపీకి 250 లోపే వస్తాయని లెక్కకట్టారు… నిజమే, నితిశ్ మీద వ్యతిరేకత ఉంది, తేజస్వి పికప్ అయ్యాడు, మహారాష్ట్ర ప్రయోగాలు వికటించే ప్రమాదం ఉంది, కర్నాటకలో తగ్గొచ్చు, నార్త్ బెల్టులో ఎంపీల మీద వ్యతిరేకత కొంత నెగెటివ్ కావచ్చు, యాంటీ బీజేపీ వోట్ల చీలిక ఉండబోవడం లేదు… ఇవన్నీ కరెక్టే… కానీ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో పెరిగే సీట్లతో కొంత బ్యాలెన్స్ అవుతుందనే అంచనా… బీజేడీ, వైసీపీ, టీడీపీ etc ఎటూ ఇండి కూటమి వైపు కాదు…
ఏమో, బీజేపీకి అత్తెసరు మెజారిటీకి లోపు సీట్లు వస్తే, జగన్ మీద ఆధారపడే సిట్యుయేషన్ వస్తే, ఇక కేసులు ఖతం అనే ఆశ ఉంటేఉండవచ్చు సాక్షికి…! తప్పేముంది..? ఏమో, నిజంగానే అప్పుడు నోరువిప్పి ప్రత్యేక హోదా అడుగుతాడేమో… మొన్నమొన్నటిదాకా ఓ గల్లీ యెల్లో కార్యకర్తకన్నా దిగజారి ఈనాడు రాసిన కథలు, చిమ్మిన విషాన్ని ఏమనాలి మరి..?
ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సీపీఎంను నిందిస్తున్నాడు… జగన్‌కు అనుకూలంగా ఉపయోగపడుతున్నారట, దాంతో క్రెడిబులిటీ పోతోందట, జగన్‌కు అనుకూలంగా విశ్లేషణలు వదులుతున్నారట… జనం నమ్ముతారని అనుకోవడం అవివేకమట… మరి టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, మహా న్యూస్, ఏబీఎన్ వార్తలను నమ్ముతారా..? పైగా నాగేశ్వర్‌నో, తెలకపల్లి రవినో నేరుగా పేరుపెట్టి నిందించొచ్చు కదా…
చివరగా ఏదో రాసుకొచ్చాడు… ‘‘బుద్ధుని కాలంలో అంగుళీమాలుడు అనే దుర్మార్గుడు ప్రజల వేళ్లు నరికి మెడలో దండగా వేసుకొని తిరిగేవాడు. ఒకరోజు బుద్ధుడు ఎదురుకాగా, ‘నిన్ను ఈ కత్తితో నరకబోతున్నాను. నీ చివరి కోరిక ఏమిటో కోరుకో’ అని అన్నాడు. నీ కత్తితో ఆ చెట్టు కొమ్మను నరుకు అని బుద్ధుడు ఆ దొంగకు చెబుతాడు. వెంటనే అంగుళీమాలుడు తన కత్తితో చెట్టు కొమ్మను నరికాడు. ఇప్పుడు ఆ కొమ్మను తిరిగి చెట్టుకు అతికించు అని బుద్ధుడు అడిగాడు. దీనికి ఆ దొంగ నవ్వి ‘అదెలా సాధ్యం? ఎవరూ ఆ పని చేయలేరు’ అని అన్నాడు. ‘దీంతో నువ్వు బలవంతుడివి కాబట్టి దేన్నయినా నరకగలవు, నాశనం చేయగలవు. నిజానికి అది అల్పులు చేసే పని. శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి దేన్నయినా సృష్టించగలగాలి. బాధపెట్టడం కాదు–ఉపశమనం కలిగించేవాడే గొప్పవాడు. నిర్మూలన కంటే సృజనే గొప్పది’ అని ఆ దొంగకు బుద్ధుడు బోధించాడు…’’
ఎవరో ఫేస్‌బుక్‌లో పెట్టారట, జగన్ కూల్చివేతల గురించి ఏదో చెప్పబోయి, చివరకు ఏం చెబుతున్నాడో తనకే అర్థం కాలేదు రాధాకృష్ణకు… ఈ కథ ఈ వ్యాసానికి అస్సలు నప్పలేదు… సర్లె సర్లె, నప్పే వాక్యాలు, నచ్చే వాక్యాలు ఎప్పుడూ రాయాలని ఏముంది..? ఆయన కూడా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా బాటలోకి వచ్చేశాడు కదా…!! అవునూ, జగన్ కోసం ఊదరగొడుతున్నవాళ్లు జూన్ 4న జగన్ ఓడిపోతే ఏమవుతారో అని ఆందోళనపడుతున్నాడు కదా ఆర్కే, మరి జగన్ మళ్లీ గెలిస్తే ఇన్నాళ్లుగా కాలకూటాన్ని వర్షించిన పచ్చకూటమి ప్రముఖులు ఏమైపోతారు..?!
Share this Article