మద్రాస్ హైకోర్టు సరైన ప్రశ్న సంధించింది..! ఇళయరాజా డబ్బుల కోసం చాలామందితో కాపీ రైట్స్, రాయల్టీ వివాదాలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా… ఆయన తత్వం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం… తాజాగా నడుస్తున్న కేసు ఏమిటంటే..?
అప్పుడెప్పుడో రికార్డింగ్ కంపెనీలతో కుదుర్చుకున్న పాటల ఒప్పందాల గడువు ముగిసిందనీ, సో, ఆ కంపెనీలు తన పాటలు వాడుకోవద్దని అంటాడు ఇళయరాజా… ఒకసారి హక్కులు తీసుకున్నాక వాటికి గడువు ముగిసేది ఏమీ ఉండదని రికార్డింగ్ కంపెనీల వాదన… ప్రస్తుతం ఈ కేసు బెంచ్ దగ్గర అప్పీళ్ల దశలో ఉంది… ఎకో రికార్డింగ్ సంస్థ కోర్టులో కొట్లాడుతోంది…
దేవుడి కన్నా తక్కువే కానీ, మిగతా అందరికన్నా మా క్లయింట్ (ఇళయరాజా) ఎక్కువ అని కోర్టులో శుష్క, తిక్క వాదనల్ని ఆయన లీగల్ కౌన్సిల్ కోర్టులో వాదించిన తీరు తెలుసు కదా… సినిమా పాటల హక్కులు నిర్మాతవి, ఆ నిర్మాత దగ్గర మేం రైట్స్ తీసుకున్నాం, ఇక డబ్బు తీసుకుని వర్క్ చేసిపెట్టిన సంగీత దర్శకుడి ప్రస్తావన ఏమిటని రికార్డింగ్ కంపెనీ వాదన… నో, తనది క్రియేటివ్ వర్క్ కాబట్టి, కాపీ రైట్స్ వర్తించవని అంటాడు ఇళయరాజా…
Ads
మనం చెప్పుకున్నాం కదా… ఒక్క సంగీత దర్శకుడికే ఈ అదనపు డబ్బు సంపాదన దేనికని… గాయకులు, గీత రచయితలు, వాద్య బృందం సమిష్టి కృష్టి లేకుండా పాట ఎలా పుడుతుందని… అలాగే అందరికీ డబ్బు ఇచ్చి పనిచేయించుకున్న నిర్మాతే అసలైన హక్కుదారు కదా… ఎస్, కోర్టు కూడా అదే అడిగింది… గీత రచయిత రాయకుండా పాట ఎక్కడిది? వాళ్లు కూడా డబ్బు కోరితే, హక్కు కోరితే ఏమిటని ప్రశ్నించింది…
మొన్నామధ్య గాయకుడు శ్రీరామచంద్రతో యాంకర్ రీతూ చౌదరి ఏదో చానెల్ కోసం దావత్ అనే చిట్‌చాట్ ప్రోగ్రాం చేసింది… అందులో శ్రీరామచంద్ర కూడా అదే అంటున్నాడు… గాయకులకు ఇచ్చే రెమ్యునరేషనే చాలా తక్కువ, కాకపోతే ఆ పేరు వచ్చాక బయట ప్రోగ్రాములతో వచ్చే డబ్బుతోనే కాలం గడుస్తోంది అని… పాటల రాయల్టీల్లో కూడా గాయకులకు ఏమీ రాదని చెప్పుకొచ్చాడు… నిజమే… గీత రచయిత రాయనిదే పాట లేదు, గాయకులు పాడనిదే పాట లేదు కదా…
మరి ఇళయరాజా కోరుకుంటున్న అదనపు డబ్బు లేదా రాయల్టీ, పేరు ఏదైనా కానివ్వండి, మరి గాయకులు, గీత రచయితలు కూడా హక్కులు కోరితే అప్పుడేమిటి..? ఈ రాయల్టీల విషయంలోనే కదా ఇళయరాజాకూ దివంగత ఎస్పీ బాలుకు నడుమ రచ్చ రేగింది… అసలు తన పాటలు ఏ కాన్సర్ట్‌లోనూ తనకు డబ్బు ఇవ్వకుండా పాడొద్దు అంటాడు ఇళయరాజా… నిజంగానే గీత రచయితలు, గాయకులు కూడా హక్కులు, డబ్బులు కోరుతూ ఇదే కేసులో ఇంప్లీడ్ అయితే ఈ కేసు మరింత శృతిలో పడుతుంది…!! అవునూ, ఇళయరాజా మీద తీసే బయోపిక్‌లో ఈ కంట్రవర్సీలు కూడా ప్రస్తావిస్తారా..?!
Share this Article