ఏపీలో నవ్వు పుట్టించగల నాయకులు బోలెడు మంది… అందుకే ఏపీ ప్రజల్లో బీపీ, స్ట్రెస్ తక్కువ… తెలంగాణలోనే మరీ లోటు కనిపిస్తూ ఉండేది… ఏదో అప్పుడప్పుడూ బండ్ల గణేష్ ఆ లోటు కొంత పూరిస్తున్నా సరే, తను సరిపోవడం లేదు… ఏదో అప్పుడప్పుడూ తలసాని కూడా కాస్త చేయి వేస్తున్నాడు… హమ్మయ్య, ఇప్పుడు ఆ చింత తీరినట్టే…
కేఏ పాల్ తన క్రీడావేదిక ఏపీ కాదని, తెలంగాణ మాత్రమే తన కార్యస్థలమని గుర్తించాడు… వచ్చేశాడు… ఇక గాయిగత్తరే… తెలంగాణ పాలిటిక్సుకు అగ్గిపెట్టుడే… భూకంపమే… అయ్యో, కేసీయార్‌కు ఇక పాలన చేతకావడం లేదు… వయస్సు మీదపడుతోంది అని చింతించే వాళ్లు బేపర్వాగా ఉండొచ్చు… పాల్ వచ్చాడు కదా… వచ్చీ రావడంతోనే గవర్నర్‌తో భేటీ వేశాడు…
చెప్పేశాడు, గవర్నర్ మదిలో ఉన్నదేదో ఇట్టే కనిపెట్టేశాడు… కేసీయార్ అతి త్వరలో జైలుకేనట… రేవంత్ చెవుల్లో అమృతం పోశాడు… సంజయుడికి ఆనందకరమైన ముచ్చట చెప్పాడు… ఆర్ఎస్పీ, షర్మిల, కోదండరాం తదితరుల సంగతేమిటో గానీ… మళ్లీ కొత్తగా ఈ పాల్ దుకాణం హేమిటి అని చికాకుపడతారేమో గానీ… రాజకీయాల్లో సీరియస్‌నెస్సే కాదు, వినోదం కూడా అవసరమనీ, లేకపోతే మజా, థ్రిల్ ఉండటం లేదనీ వాళ్లు కూడా గ్రహించాలి…
Ads
సరే, సరే… ఈడీ గానీ, సీబీఐ గానీ కేసీయార్‌ను జైలుకు నిజంగానే పంపిస్తాయా..? మోడీ అంత సీరియస్‌గా ఉంటే ఇన్నాళ్లూ ఆగేదా..? ఈ కేసులు, ఈ జైళ్ల హూంకరింపులు ఏదో నాలుగు రోజులు బండి సంజయ్ ఉడుత ఊపులకు పనికొస్తాయి… ప్రథమ పౌరురాలు, లేడీ గవర్నర్‌ను మునుపెన్నడూ తెలంగాణ సమాజం చూడని తీరులో టీఆర్ఎస్ పరాభవిస్తుంటేనే మోడికి చీమకుట్టినట్టు కూడా లేదు…
ఐనా కేసీయారే చెబుతున్నాడు కదా… దమ్ముంటే అరెస్టు చేసి, జైలుకు పంపించండీ అని… ఏపీలో చంద్రబాబు కూడా జగన్‌ను బోలెడుసార్లు అడిగాడు… కమాన్, నా తప్పులేమిటో నిరూపించు అని… అక్కడిదాకా దేనికి..? రాధాకృష్ణ కూడా అదే సవాల్ విసురుతున్నాడు… ఏం జరిగింది..? ప్రజెంట్ సిట్యుయేషన్ చూస్తుంటే… గవర్నర్ బంగ్లాలోని సిబ్బందితో కూడా కేసీయార్ మూకుమ్మడి సెలవులు పెట్టిస్తాడేమో… మరి అప్పుడేం చేయాలి గవర్నరమ్మ అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి…
సెక్యూరిటీ కోసం అప్పటిప్పుడు సీఆర్పీఎఫ్ గట్రా దళాలను అమిత్ షా అడ్జస్ట్ చేస్తాడేమో గానీ… మిగతా స్టాఫ్ సంగతి..? పుదుచ్చేరిలో ఉంటూ, తెలంగాణ గవర్నర్ విధుల్ని నిర్వహించాల్సి వస్తుందా..? మిస్టర్ పాల్… ఇవన్నీ ఏమైనా డిస్కస్ చేశారా సార్..? లేక కేవలం కేసీయార్‌ను ఏ జైలులో పెట్టే అవకాశం ఉందో తెలుసుకుని మాత్రమే వచ్చారా..?
అసలే కేసీయార్ భయంతో ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు, విలేఖరులకు ఇన్‌సైడ్ స్టోరీలు కూడా దొరకడం లేదు… సో, ఇక ఇక్కడే ఉండిపొండి పాల్… ఇలా ఉప్పందిస్తూ ఉండండి… వోకేనా..?!
Share this Article