జనసేనాని మార్మికంగా ఏమీ చెప్పలేదు… పరోక్షంగా చెప్పినట్టు అనిపించినా సరే, అందరికీ అర్థమయ్యేట్టుగానే చెప్పాడు… ‘‘రాబోయే ఎన్నికల్లో వైసీపీ వోట్లు చీలనివ్వను’’ అని పార్టీ తొమ్మిదో వార్షికోత్సవ సభలో గట్టిగానే చెప్పాడు… అంటే ఏమిటి..? వైసీపీకి ప్రధాన వ్యతిరేక వోటు తెలుగుదేశం వోటు… ప్లస్ బీజేపీ, జనసేన కూటమి… వీళ్లు చీల్చుకోవద్దు అంటే… ఈ రెండూ ఆ టీడీపీతో కలవాలి… ఆ సంకేతాలు ఇస్తున్నాడు పవన్ కల్యాణ్…
బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కావాలంటాడు, టీడీపీ వైపు కన్నుకొడుతున్నాడు… ఇక్కడే అసలు తిరకాసు ఉంది… ఇప్పటికి ఉన్న వాతావరణాన్ని బట్టి చంద్రబాబును మోడీ నమ్మడు… అఫ్‌కోర్స్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరు… కాకపోతే నాయకుల విశ్వసనీయత చాలాసార్లు ప్రభావితం చూపిస్తూ ఉంటుంది…
గుజరాత్ అల్లర్ల సమయంలో చంద్రబాబు చేసిన రచ్చను మోడీ మరిచిపోలేదు… కానీ తప్పనిసరి అవసరంతో టీడీపీతో పొత్తుకు సై అన్నాడు… అప్పుడు ఇదే పవన్ వాళ్లతో కలిసి పనిచేశాడు… తరువాత ఏం జరిగింది…? చంద్రబాబు తన సహజమైన ధోరణితో మళ్లీ మోడీకి వెన్నుపోటు పొడిచాడు… ఇంకా తనను బీజేపీ ఎందుకు నమ్మాలి..? అసలు ఏపీలో వాళ్లకున్న ఆశలేమిటి..,? మళ్లీ చంద్రబాబుకు కిరీటం పెట్టాల్సిన ఖర్మ వాళ్లకేం పట్టింది..? పైగా జగన్ బాగానే ఉంటున్నాడుగా వాళ్లతో… తనను వదులుకునే అగత్యం ఏముంది ఇప్పుడు..?
Ads
ఇక పవన్ కల్యాణ్ సంగతికొస్తే… తన రాజకీయ స్థిరత్వం గురించో, తన మాటల్లోని లోతు గురించో, తన పార్టీ భావజాలం గురించో ఇక్కడ చర్చించడం లేదు… అవసరం లేదు… అవే సరిగ్గా ఉంటే తనెందుకు ఓడిపోయేవాడు..? మొదట్లో టీడీపీ, బీజేపీలతో దోస్తీ… అది ముగిశాక లెఫ్ట్… వాళ్లు ఎప్పుడెవరు దొరుకుతారా, ఎలా అంటకాగుదామా అని చూస్తుంటారు… అదీ అయిపోయింది… బీఎస్పీ అన్నాడు… ఆ పార్టీకేమో ఏపీలో బేస్ లేదు… అసలు యూపీలోనే కొట్టుకుపోతోంది…
అవీ తెగదెంపులు… కొన్నాళ్లుగా మళ్లీ బీజేపీ… ఇప్పుడు టీడీపీ వైపు చూపు… ఒక్క కాంగ్రెస్ మాత్రమే మిగిలినట్టుంది ఇక… పైగా ఈరోజుకూ పవన్ అన్న చిరంజీవి మా నాయకుడే అంటున్నారు కూడా కాంగ్రెసోళ్లు…!! సరే, తన రాజకీయాలు తనిష్టం… కాకపోతే ఎప్పుడూ తమతో ఉండే నాయకులు కావాలి ప్రజలకు… ఎప్పుడో ఓసారి దర్శనభాగ్యం కలిగించేవాళ్లు కాదు… రాజకీయ ధోరణుల్లో, వేసే అడుగుల్లో స్థిరత్వం ఉండాలి, తన ఆలోచనల పట్ల స్పష్టత కావాలి…
మంత్రులు అవంతి, వెల్లంపల్లిల మీద ఏవో వెటకారం విసుర్లు వేసినట్టున్నాడు… మళ్లీ వ్యక్తిగత విమర్శలు చేయను అంటాడు… బీజేపీ రోడ్ మ్యాప్ అంటాడు, వెంటనే వ్యతిరేక వోటు చీలనివ్వను అంటాడు… టీడీపీ- బీజేపీ నడుమ సత్ సంబంధాలు కుదిరే పనేనా..? (ఎందుకైనా మంచిదని, తన వ్యతిరేక వోటు చీల్చడానికి సొంత బావతో ఓ పార్టీని పెట్టించే పనిలో ఉన్నాడట జగన్… ఎంతైనా తను ఫుల్ టైమ్ పొలిటిషియన్ కదా…) సరే, పవన్ మాటల ధోరణి ఇప్పుడు కొత్తేమీ కాదు, అదేమీ మారదు, కాకపోతే నిజంగా సీరియస్ పాలిటిక్స్ మీద దృష్టి ఉంటే తనకంటూ ఓ సొంత రోడ్ మ్యాప్ ఉండాలి… అది ఉందానేదే పెద్ద ప్రశ్న… జవాబు కష్టమే…!!
Share this Article