.
ఆంధ్రజ్యోతిలో ఓ వార్త కనిపించింది… కేసీయార్ బిడ్డ కవిత మండలిలో మాట్లాడుతూ ‘తెలంగాణలో సంగీత దర్శకులే లేరా..? జయజయహే తెలంగాణ పాటకు ఆంధ్రా వ్యక్తితో సంగీత దర్శకత్వమా..? సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు… ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు…’ అని విమర్శించింది…
నవ్వొచ్చింది… వోకే, కీరవాణి స్వరకల్పన ఏమాత్రం బాగాలేదు, తెలంగాణ జనానికి అస్సలు నచ్చలేదు… ఫాఫం కీరవాణికి ఏమైంది అనిపించింది… ఆయన రాజమౌళి సినిమాలకు తప్ప ఇక తన క్రియేటివిటీ చూపించే స్థితిలో లేడు, బహుశా తన అసిస్టెంట్లకు అప్పగించేస్తున్నాడేమో అనీ అనిపించింది…
Ads
కానీ తను ఆంధ్రా కాబట్టి తెలంగాణ జాతిగీతాన్ని స్వరపరచకూడదు అనడమే నవ్వొచ్చింది… అదీ వేరేవాళ్లు విమర్శిస్తే ఏమైనా కాస్త అర్థముందేమో అనుకుందాం… కవిత ఆ మాట అనడం విస్మయపరిచింది కూడా… జనానిదేముంది..? మన గత వైఖరులను, పోకడల్ని ఇట్టే మరిచిపోతారు, మనం ఏది కొత్తగా మాట్లాడినా చెల్లుతుంది అనే వింత ధోరణి ఇది…
బీఆర్ఎస్ ఏడాదికాలంగా అదే ఫ్రస్ట్రేషన్ చూపిస్తోంది… తమ గతాన్ని దాచేస్తూ అనేక విషయాల్లో… ఇదీ అంతే…
అసలు జయజయమే తెలంగాణ అనే గీతాన్ని గుర్తించడానికే కవిత తండ్రి కేసీయార్ నిరాకరించాడు… అసలు ఆంధ్రా వ్యక్తి స్వరాలు కూరిస్తేనేం..? ఎవరు చేస్తేనేం..? వాళ్లు అనర్హులు అవుతారా..? ఔట్‌పుట్ ఎలా వచ్చిందో చూసుకోవాలే తప్ప, సదరు ఆంధ్రా వ్యక్తి ప్రాంతీయత అనర్హత ఎలా అవుతుంది..? ఎస్, డబ్బులిచ్చి, ఎవరితోనైనా పని చేయించుకుంటాం… కాకపోతే ఆ పనిలో నాణ్యత ఉందా లేదా చూసుకోావలి, అంతే…
అసలు విషయానికి వద్దాం… 2021… కవితకు సంబంధించిన తెలంగాణ జాగృతి ఓ బతుకమ్మ పాట వీడియో క్రియేట్ చేయించింది… దాని పేరు అల్లిపూల వెన్నెల… రాసింది వరంగల్ మిట్టపల్లి సురేందర్… వోకే… అదేమైనా తెలంగాణ భాషలో ఉందా..? అందులో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించిందా అనే ప్రశ్నల జోలికి పోవడం లేదు ఇక్కడ…
కానీ… దానికి సంగీత దర్శకత్వం ఏఆర్ రెహమాన్… దర్వకత్వం గౌతమ్ మీనన్… ఎవరమ్మా వాళ్లు..? తెలంగాణ వ్యక్తులే దొరకలేదా..? వాళ్లు మాత్రమే కాదు… కొరియోగ్రాఫర్ బృందా ఎవరు..? గాయని ఉత్తర ఉన్నికృష్ణన్ ఎవరు..? సహనిర్మాత ప్రీతి శ్రీవిజయన్ ఎవరు..? చివరకు వీడియోలో నటించినవాళ్లలో అనఘ, మేకా రాజన్, యాంజెలినా ఎవరు..?
చివరకు ఎడిటర్ ఆంటోనీ, కాస్ట్యూమ్స్ ఉత్తర మీనన్… వీళ్లలో ఎవరు తెలంగాణ వాళ్లు..? సో, ఇప్పటి కవిత భాషను బట్టి… కవితకు తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసింది అనుకోవచ్చు కదా… తనే చెబుతోంది కదా… ఇదుగో ఆ పాట యూట్యూబ్ లింక్… అసలు ఈ పాటలో ఏమైనా లైఫ్ ఉందా..? తెలంగాణ తాలూకు ఎమోషన్ ఉందా…? ఇదెలా గొప్పది మరి..?
Share this Article