ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను అవినీతి, అక్రమ మద్యం పాలసీల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగానే, నిజంగానే అందరి దృష్టీ ఒక్కసారి ఆయన గురువుగా భావించే అన్నా హజారే మీదకు మళ్లింది… 86 సంవత్సరాల వయస్సున్న ఆయన మొదటి నుంచీ అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నాడు…
ఇదే కేజ్రీవాల్ తనతో కలిసి పనిచేశాడు… తరువాత విడిపోయి, ఆప్ పార్టీ పెట్టుకుని, మొదట ఢిల్లీలో, తరువాత పంజాబ్‌లో కూడా అధికారాన్ని సాధించాడు… ఏ అవినీతిపై తను పోరాటం చేశాడో ఇప్పుడు తను అవే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి, చివరకు అరెస్టయ్యాడు… అంతేకాదు, తనతో కలిసి పనిచేస్తున్నప్పుడు లిక్కర్‌కు దూరంగా ఉండాలని పదే పదే చెప్పేవాడిననీ, కానీ తను అదే మద్యం పాలసీ కేసులో అరెస్టయ్యాడని అన్నా హజారే వ్యాఖ్యానించాడు… ఐరనీ అంటే ఇదే…
అదే మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేసీయార్ బిడ్డ కవితకు సంబంధించిన ఓ వీడియో బిట్ కూడా ఈమధ్య వైరలైంది… జర్నలిస్టు ప్రేమ ఏదో సందర్భంలో మీరు సీఎం అయితే తక్షణం చేసే పని ఏది అనడిగింది… మద్యాన్ని నిషేధిస్తానని చెప్పింది కవిత… అదే కవిత అదే మద్యం సంబంధిత కేసులో అరెస్టు కావడం మరో ఐరనీ…
Ads
బీజేపీ సోషల్ హ్యాండిల్స్ మరో ప్రచారానికి దిగాయి… 2022లో మద్యానికి సంబంధించి కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులకు లేఖ రాసిందనీ, ఆప్ ఇండి కూటమిలో చేరగానే అదే కాంగ్రెస్ ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అంటోందని ఆ తాజా ట్వీట్ల సారాంశం… మరి అన్నా హజారే ఏమంటున్నాడు..?
‘‘మద్యానికి వ్యతిరేకంగా నాతోపాటు ఎలుగెత్తినవాడు ఇప్పుడు అదే మద్యం సంబంధ కేసులో అరెస్టు కావడం దురదృష్టకరం… తన కర్మను బట్టి ఫలితం అనుభవిస్తున్నాడు… చట్టం తన పని తాను చేస్తోంది, కేజ్రీవాల్ మద్యం పాలసీ రూపొందించినప్పుడు నేను తొలిసారిగా తనకు 2022లోనే లేఖ రాశాను… కేజ్రీవాల్ తీసుకొస్తున్న మద్యం పాలసీ నాకు బాధ కలిగిస్తోందనీ చెప్పాను అందులో… మద్యంలాగే అధికారం కూడా మత్తు ఎక్కిస్తుంది… నువ్వు అధికారం అనే మత్తులో ఉన్నావనీ గుర్తుచేశాను…’’ ఇదీ హజారే రియాక్షన్…
అసలేమిటి ఈ మద్యం పాలసీ..? సంక్షిప్తంగా చెప్పాలంటే 12 శాతం హోల్ సేల్ డీలర్లకు, 185 శాతం రిటెయిలర్లకు లాభాల్ని ధారబోసే ఢిల్లీ ప్రభుత్వ పాలసీ… ఆ 12 శాతం హోల్ సేల్ డీలర్ల లాభంలో 6 శాతం ఆప్ లీడర్లకు ఇచ్చేలా ఒప్పందాలు కుదిరాయని, మొత్తం లంచాల విలువ 600 కోట్లు అనీ, సౌత్ గ్రూపు 100 కోట్లను ముందుగానే చెల్లించిందనీ ఈడీ, సీబీఐ ఆరోపణ… అవును, మద్యం, అధికారం రెండూ మత్తునిచ్చేవే… కర్మను ఫలితం ఉంటుందనేదీ నిజమే..!!
Share this Article