అమ్మ… చిన్న వయస్సులోనే మా నాన్నతో లేచి వచ్చేసింది… తరువాత… ఆయనకు మా అమ్మ ఒక్కతే భార్య కాదనీ, అప్పటికే తనకు పెళ్లాలు, పిల్లలు ఉన్నారని తెలిసింది ఆమెకు… ఆ పెళ్లితో ఆమె సుఖంగా లేదు… నాన్న మోసం చేశాడనే బాధ ఆమెను పీడించేది…
పెళ్లయిన ఐదేళ్ల వరకూ ఆమెను పిల్లల్ని కూడా కననివ్వలేదు… చూసీ చూసీ, వెయిట్ చేసీ చేసీ చివరకు నేను నాలుగో తరగతి చదువుతుండగా అమ్మ నాన్నను వదిలేసింది… చాలాకాలంగా తనకు ప్రపోజ్ చేస్తున్న ఓ యువకుడితో ప్రేమలో పడింది… మనిషి మంచోడు, జీవితాంతం ఆసరాగా నిలబడతాడని ఆశించింది… మంచోడేనని మేమూ అనుకున్నాం మొదట్లో… కానీ..?
తన ధోరణి మొదట్లో నాకు అస్సలు అర్థం కాకపోయేది… అమ్మ ఎదుట నాతో బాగా మాట్లాడేవాడు… లేనప్పుడు మరోరకంగా ఉండేది… చిన్న పిల్లను, పైగా నేను కూతురి వరుస… కానీ నాపట్ల లైంగిక భావనలు తనకు… ఆ బాల్యంలో నాకేమీ అర్థమయ్యేది కాదు, తన చేష్టలు నా పట్ల తండ్రి ప్రేమ అనుకునేదాన్ని… మెల్లిమెల్లిగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తేడా తెలుస్తోంది నాకు… తను దగ్గరికి వస్తేనే చిరాకెత్తడం మొదలైంది…
Ads
ఓరోజు నేను పడుకుని ఉన్నాను… అప్పుడు నేను ఫిఫ్త్ క్లాసు… నాపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు… మెలకువ వచ్చింది, భయం… వణుకు… చటుక్కున లేచిపోయి, పక్క గదిలోకి దూరిపోయాను… గడియ వేసుకున్నాను… ఏం జరిగిందో అమ్మకు చెప్పాలి… కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు… కొన్నాళ్లకు నన్ను బోర్డింగ్ స్కూల్‌లో వేశారు… ఇక ఆనాటి సంఘటనను వదిలేశాను అక్కడే…
కానీ తరచూ నాకు కలలు వచ్చేవి… నాన్నలా ఉండాల్సిన ‘సవతి నాన్న’ నాపట్ల ప్రదర్శించిన వైఖరి నా మెదడులో అలాగే ఉండిపోయింది, నాలో భయాన్ని పెంచుతూ పోయింది… కలల్లో ఎవరో ఆగంతకులు నాపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు, నా బట్టలు మొత్తం విప్పేస్తున్నట్టు కనిపించేది… భయంతో దిగ్గున లేచేదాన్ని, తిరిగి నిద్ర పట్టేది కాదు…
ఇంటికి పోయినప్పుడు అమ్మతో ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నిస్తే నేను అబద్ధాలు చెబుతున్నానని నన్నే నిందించేది, వినేది కాదు… నేను చెప్పేవి వినడానికి, నమ్మడానికి ఒకరు కావాలి… నా భావాలు, భయాలకు ఓ ఔట్‌లెట్ కావాలి… కానీ ఎవరు..? ఎలా..? నాలో తిరస్కరణ, ధిక్కారం తదితర ధోరణులు పెరుగుతున్నాయి…
అందుకని రాతల్లో నన్ను ప్రదర్శించుకోవడం ప్రారంభించాను… నా కథే రాశాను ఓసారి… ప్రేక్షకుల ముందు ప్రదర్శించాం… మధ్యలోనే కన్నీళ్లు ఆపుకోలేకపోయాను… ఆ షో బాపతు వీడియో బాగా వైరల్ అయిపోయింది… న్యూస్ చానెళ్లు నన్ను కంటాక్ట్ కావడానికి ప్రయత్నించాయి… ఒక అమ్మాయి తన సవతి తండ్రితో లైంగిక వికారాలకు గురైంది… ఇదీ వాళ్లకు కావల్సిన కంటెంట్… బాగా సేలయ్యే కంటెంట్… వాళ్ల ఉద్దేశాలు చిరాకు తెప్పించాయి…
వాళ్లకు బాధితుల మనోభావాలేమీ అక్కర్లేదు… మసాలా కంటెంట్‌తో ప్రేక్షకులు, పాఠకుల్ని మాయ చేయడమే వాళ్లకు కావల్సింది… సమస్య నా ఒక్కదానిది కాదు, సొసైటీలో ఎందరో పిల్లలకు ఇదొక భీకరమైన సమస్య… ఆ సమస్య లోతుల్లోకి వెళ్లదు మీడియా… మేం వాళ్లకు ఐటమ్ సాంగ్స్… కొన్ని నా అనుమతి లేకుండానే నా గురించి రాసి హల్‌చల్ చేసేవి… అవి చదివాకే అమ్మకు నా సమస్య గురించి తెలిసింది.,. అప్పటికీ నా కథను బయటపెట్టినందుకు నన్ను నిందించింది… అలా చేసి ఉండాల్సింది కాదని మందలించింది…
పోతేపోనీ, నా బాల్యంలో కొందరు తమ వికృత చేష్టల ద్వారా ఇలాంటివి ఎలా డీల్ చేయాలో నాకు పరోక్షంగా నేర్పించారు… ఎస్, వాళ్లు నా సంతోషపు బాల్యాన్ని దొంగిలించవచ్చుగాక… కానీ నా యవ్వనంలో అలాంటి మోసాల్ని చేయనివ్వను… నా దేహంపై, మగాళ్ల అసలు స్వరూపాలపై నాకిప్పుడు సంపూర్ణ అవగాహన ఉంది…!!
( ఇది హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్‌బుక్ పేజీలో తాజాగా కనిపించింది… నేలకొండ భగవత్ కేసరి సినిమాలో ప్రధాన కథాంశం ఇలాంటిదే కదా… అందుకే వెంటనే దీన్ని తెలుగులోకి అనువదించాలని అనిపించింది…)
Share this Article