ఎన్నికల వ్యూహాలకు కన్సల్టెన్సీలు… పథకాల రచనకు కన్సల్టెన్సీలు… ప్రతి శాఖలో కన్సల్టెన్సీలు… ఎక్కడ చూసినా కన్సల్టెన్సీలు…
.
ఓ బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజీకి ఓ ఫేమస్ కన్సల్టెంట్ వచ్చాడు ఏదో గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి… ఓ విద్యార్థి తననే అడిగాడు… ‘‘కన్సల్టెన్సీ అంటే ఏమిటి సార్..?’’
.
ఏ మూడ్‌లో ఉన్నాడో గానీ కన్సల్టెంట్ కాస్త అర్థమయ్యేట్టుగానే చెప్పడానికి రెడీ అయ్యాడు… ఓ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు…
.
‘పర్ సపోజ్, నా దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు… ఒకతను శుభ్రంగా ఉన్నాడు, మరొకతను మురికిగా కనిపిస్తున్నాడు… నేను ఇద్దరికీ స్నానం చేసి రావల్సిందిగా సూచించాను… ఆ ఇద్దరిలో ఎవరు నేను చెప్పింది పాటిస్తాడు..?’
.
ఒక విద్యార్థి బదులిచ్చాడు… ‘మురికిగా ఉన్న వ్యక్తి స్నానం చేస్తాడు…’
కన్సల్టెంట్ అడ్డంగా తలూపాడు… ‘నో, మురికిగా ఉన్నవాడికి శుభ్రత ఇంపార్టెన్సే తెలియదుగా… సో, శుభ్రంగా ఉన్నవాడే స్నానం చేస్తాడు, ఎందుకంటే, వాడికి స్నానాలు, శుభ్రత అలవాటు కాబట్టి… ఐనాసరే, ఇప్పుడు చెప్పండి, వారిలో ఎవరు స్నానం చేస్తారు..?
.
ఈసారి ఇంకో విద్యార్థి బదులిచ్చాడు… ‘శుభ్రంగా ఉన్న వ్యక్తి స్నానం చేస్తాడు…’
మళ్లీ కన్సల్టెంట్ అడ్డంగా తలూపాడు… ‘నో, మురికిగా ఉన్నవాడే స్నానం చేస్తాడు, ఎందుకంటే వాడికి శుభ్రత ఇప్పుడు అవసరం కాబట్టి, ఇప్పుడు మళ్లీ ఆలోచించి చెప్పండి, ఎవరు స్నానం చేస్తారు..?
.
ఈసారి ఆ ఇద్దరు విద్యార్థులు కూడబలుక్కుని బదులిచ్చారు… ‘మురికి వ్యక్తి స్నానం చేస్తాడు, ఎందుకంటే వాడికి అవసరం కాబట్టి…’
మళ్లీ కన్సల్టెంట్ అడ్డంగా తలూపాడు… ‘నో, ఇద్దరూ స్నానం చేస్తారు… ఒకడికి ఎప్పుడూ శుభ్రంగా ఉండటం అలవాటు కాబట్టి, మరొకడికి శుభ్రంగా ఉండటం ప్రస్తుత అవసరం కాబట్టి… మళ్లీ ఆలోచించి చెప్పండి, ఎవరు స్నానం చేస్తారు..?
.
ఒకరిద్దరు సహవిద్యార్థులు కూడా కలగజేసుకుని, అందరూ కలిసి బదులిచ్చారు… ‘ఇద్దరూ స్నానం చేస్తారు…’
సేమ్, కన్సల్టెంట్ అడ్డంగా తలూపాడు… ‘నో, ఇద్దరిలో ఎవరూ స్నానం చేయరు… ఒకడికేమో శుభ్రంగా ఉండటం తెలియదు, ఇంకొకడు ఎలాగూ శుభ్రంగానే ఉన్నాడు… మళ్లీ ఆలోచించి చెప్పండి, వారిలో ఎవరు స్నానం చేస్తారు…?
.
ఓ విద్యార్థి మృదువుగా అడిగాడు ఇలా… ‘సార్, ప్రతిసారీ మీరు భిన్నమైన జవాబు చెబుతున్నారు… పరస్పరం భిన్నమైన పాజిబులిటీని చెబుతున్నారు… ప్రతిదీ కరెక్టే అనిపిస్తోంది… కానీ, అసలు కరెక్ట్ జవాబు ఏమిటి..?
.
అప్పుడు చెప్పాడు కన్సల్టెంట్… ‘ఇదే కన్సల్టెన్సీ అంటే… వాస్తవం ఏమిటి, కరెక్టు ఆన్సర్ ఏమిటి అనేది ఇక్కడ ముఖ్యం కానేకాదు… ఒక ప్రశ్నకు ఎన్నిరకాల జవాబులు, ఒక అంశం చుట్టూ ఎన్నిరకాల సాధ్యాసాధ్యాలు ఉన్నాయో, తీసుకునే డబ్బుకు సరిపడా ఎన్నిరకాల సమర్థ వాదనలు నిర్మించగలమో అదే కన్సల్టెన్సీ…
.
ఆ మేనేజ్‌మెంట్ విద్యార్థులు చాలాసేపటి వరకూ కోలుకోలేదు… (ఓ ఇంగ్లిష్ పోస్టుకు నా తెలుగు అనువాదం…)
Share this Article