ముందుగా ఒక వార్త… ‘‘ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్‌ఎఫ్) – 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది.. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు..
ఇక ఈ అవార్డుల్లో గత ఏడాది విడుదలైన ‘జవాన్’, ‘యానిమల్’ చిత్రాలు పోటీ పడ్డాయి.. జవాన్‌లో షారుఖ్ నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నయనతార ఉత్తమ నటి అవార్డు అందుకుంది…
2024 విజేతలు వీరే…
Ads
ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్)..
ఉత్తమ నటి: నయనతార (జవాన్)..
ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ vs నార్వే)..
ఉత్తమ దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా (యానిమల్)..
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)..
ఉత్తమ విలన్: బాబీ డియోల్ (యానిమల్)…’’
చదివారు కదా… పేరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు… కానీ భారత ప్రభుత్వం ఇచ్చే ఆ ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకూ దీనికీ ఏమాత్రం సంబంధం లేదు… ప్రభుత్వం ఆయన పేరిట లైఫ్ అచీవ్‌మెంట్ పురస్కారం ఇస్తుంది ప్రతి ఏటా…
కానీ పైన చెప్పిన అవార్డులు ఆయన పేరిట ఆయన సంబంధీకులు ఏర్పాటు చేసుకున్న వేరే దుకాణం… పూర్తి పేరు దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డులు… వార్తలో చెప్పినట్టు అవేమీ ప్రతిష్టాత్మకంగా భావించబడేవి కాదు… పైన లిస్టు చూడండి… ఉత్తమ నటుడు షారూక్ ఖాన్, జవాన్‌లో నటనకు…
అది పక్కా కమర్షియల్ సినిమా… అలాంటివి షారూక్ అలవోకగా చేసేస్తాడు, ఆ పాత్ర తన నటనకు పెద్ద పరీక్ష కూడా కాదు… సేమ్, నయనతార కూడా… అందులో ఆమె గొప్పగా నటించిందేమీ లేదు… క్రిటిక్స్ అవార్డులు చూడండి, శాం బహదూర్‌లో నటనకు గాను విక్కీ కౌశల్‌కు అవార్డు ప్రకటన, సరైన ఎంపిక… అలాగే ఉత్తమ నటి రాణి ముఖర్జి, అదీ మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాలో నటనకు… అదీ సరైన ఎంపికే…
యానిమల్ దర్శకుడు సందీప్ వంగాకు ఉత్తమ దర్శకుడు అవార్డు అట… ఓ తెలుగు వాడికి అవార్డు సంతోషదాయకమే గానీ ఆ సినిమాలో తన దర్శకత్వానికి మంచి మార్కులు ఎన్ని పడ్డాయో, అన్ని మైనస్ మార్కులు కూడా పడ్డాయి… అంతెందుకు..? ఆ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బోలెడు మంది సెలబ్రిటీలు పెదవి విరిచారు… కామెంట్లు చేశారు… అల్ట్రా మేల్ కాన్సెప్టునే తప్పుపట్టారు… ఉత్తమ విలన్ బాబీ డియోల్ అట… అదీ యానిమల్ సినిమాలో నటనకు… ఇక చెప్పేదేమీ లేదు… ఏమో… స్కోచ్ అవార్డులు, ఆర్మాక్స్ సర్వేలు కూడా ఈ బాపతే కదా దాదాపు..!!
దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అని మరో సంస్థ కూడా ఉంది. ఆ సంస్థ 2017లో డేరా బాబాకు కూడా అవార్డు ఇచ్చింది.
Share this Article