.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) నామస్మరణతో ప్రపంచం మారుమోగిపోతోంది. మొన్నటిదాకా కంప్యూటర్ చదువే చదువు. ఇప్పుడు ఏఐ చదువే చదువు. ఊళ్ళో వీధి కొళాయికి నీళ్ళు మళ్ళించడం మొదలు రష్యా- ఉక్రెయిన్ మధ్య ఆకాశంలో క్షిపణులను పేల్చేయడం దాకా అంతా ఏఐ చూస్తున్నట్లే ఉంది. ఎంత ఆర్టిఫిషియల్ గా ఉన్నా అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడక తప్పని పరిస్థితిలో ఉన్నాం.
సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మనం డిజిటల్ మీడియాలో తరచుగా ఏమి సెర్చ్ చేస్తున్నామో, ఏవి వింటున్నామో, ఏవి చూస్తున్నామో పసిగట్టి వాటినే మన కళ్ల ముందుకు తోసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- కృత్రిమ మేధ వ్యవహారాలను తెలుసుకుంటే… వడ్లగింజలో దాగిన డిజిటల్ బియ్యపు గింజల వర్చువల్ నగ్న సత్యాలు బయటపడతాయి.
Ads
మన సెర్చ్ వ్యవహారాలను పసిగట్టడం పాతకథ. ఫోన్లలో మన మాటలను విని మన ముందుకు ఆ ప్రకటనలనే తోసే “యాక్టివ్ లిజనింగ్” డిజటల్ నిఘా చెవులు కొత్త కథ. అమెరికాలో కాక్స్ మీడియా గ్రూప్-సి.ఎం.జి. స్మార్ట్ ఫోన్లలో మనం మాట్లాడుకునే మాటలను మన అనుమతి లేకుండా విని… రికార్డ్ చేసే సాంకేతిక విధానాన్ని ఏనాడో కనుక్కుని… అనేక మార్కెటింగ్ కంపెనీలకు తన “గుట్టు చప్పుడు కాకుండా ఎదుటివారి మాటలను వినే సేవలను” గుట్టుచప్పుడు కాకుండా అందిస్తోంది. ఏటా వందల కోట్ల లాభాలు గడిస్తోంది.
ఇంటర్నెట్ తో అనుసంధానమైన స్మార్ట్ ఫోన్ అయితే చాలు. అందులో మైక్రో ఫోన్ ను ఈ నిఘా చెవులు వినగలుగుతాయి. ఏ యాప్ కయినా స్మార్ట్ ఫోన్లో మైక్రో ఫోన్ యాక్సెస్ ను నిరోధిస్తే అంటే మైక్రో ఫోన్ ను ఆపితే కొంతవరకు ఈ నిఘా చెవుల నుండి తప్పించుకోవచ్చు అని అంటున్నారు కానీ… అది కేవలం మన భ్రమ అని ఈ రంగంలో నిపుణులు సాంకేతిక ఆధారాలతో చెబుతున్నారు.
ఫేస్ బుక్ మాతృ సంస్థ- మెటా “ఆండ్రో మెడా” పేరిట మన మనసును చదివే కృత్రిమ మేధను ఆవిష్కరించి… వాడుకలోకి తెచ్చింది. సామాజిక మాధ్యమాల్లో మనమేమి చూస్తున్నామో, వింటున్నామో, దేనికోసం ఎక్కువగా వెతుకుతున్నామో పసిగట్టి… ఆండ్రో మెడా ఆ కంటెంట్ ను, ఆ ప్రకటనలనే మనముందుకు ఆటోమేటిగ్గా తోస్తుంది. దీనివల్ల అటు ప్రకటనల ఆదాయం పెరిగింది. ఆ ప్రకటనల ద్వారా రిటైల్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి.
కృత్రిమ మేధ చిత్ర విచిత్రమైన పనులు చేసి పెడుతోంది. చివరకు డిజిటల్ పునర్జన్మ దాకా వెళుతోంది ఆ కృత్రిమత్వం. మనిషి పోతే ఆ మనిషి జ్ఞాపకాలే మిగులుతాయి. ఆ మనిషి రాసిన రాతలు, ఫోటోలు, ఆడియో, వీడియోలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ మనిషి బతికే ఉన్న అనుభూతిని కలిగించవచ్చని సరికొత్త ప్రయోగాలు చెబుతున్నాయి.
హిందూ సనాతన ధర్మం మౌలిక సూత్రమే పునర్జన్మ. మన పుణ్యకర్మలన్నీ జన్మ రాహిత్యం కోసమే. లేదా మంచి జన్మ కోసమే. అలాంటి పునర్జన్మ డిజిటల్ వేదికలమీద కూడా వస్తోంది. దీనికి “డిజిటల్ పునర్జన్మ” అని పారిభాషిక పదాన్ని కూడా స్థిరపరిచారు.
ఉదాహరణకు ఒక మనిషి ఎనభై ఏళ్ళు బతికి… వయసుతో వచ్చిన అనారోగ్య సమస్యల వల్ల చనిపోయాడు. అతడు వాడిన సామాజిక మాధ్యమాల ద్వారా అతడి గొంతును, రాసే పద్ధతిని, ఆలోచనా విధానాన్ని కృత్రిమ మేధ పట్టుకుని… అతడిలాగే అతడి బంధువులకు ఉత్తరాలు రాస్తుంది. ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెబుతుంది.
ఎప్పుడు కావాలంటే అప్పుడు పలకరిస్తూ ఉంటుంది. దాదాపుగా అతడు బతికే ఉన్నట్లు బంధువులతో మాట్లాడుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి ప్రయోగాల దశలో ఉన్న డిజిటల్ అమరత్వం భవిష్యత్తులో నిజం కాబోతోందని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు.
వినడానికి విఠలాచార్య కల్పిత కథలా ఉన్నా సాంకేతికంగా ఇది చాలా సులభం. అయితే ఇందులో మానసికమైన, నైతికమైన, స్వభావపరమైన చాలా విషయాలున్నాయి. పోయిన మనిషి పోకుండా ఎల్లకాలం ఇలా వెంటపడుతూ ఉంటే ఆ క్షణమే పోయినట్లు జీవితమంతా ఏడుస్తూ కూర్చునే ప్రమాదం ఉంది. మంచి జ్ఞాపకాలైతే పరవాలేదు కానీ… చెడు జ్ఞాపకాలైతే గుండెను మళ్ళీ మళ్ళీ మెలిపెట్టడం తప్ప దీని ద్వారా సాధించేది ఏమీ ఉండదు.
ఇది సాంకేతిక అమరత్వమే కానీ… అసలు సిసలు అమరత్వం కానే కాదు. అలాంటిది సృష్టిలో ఉండనే ఉండదు. అసలు సిసలు అమరత్వాన్ని గూగుల్ చాట్ బోట్ లాంటి కృత్రిమ మేధ ఇవ్వగలిగితే… ఇక లోకానికి చచ్చే చావు వచ్చినట్లే. చావులేని, చావలేని డిజిటల్ అమరత్వమైనా సామాన్యం కాదు అనుకునేవారు ఇక మృత్యుంజయ మంత్రాలను పక్కనబెట్టి… డిజిటంజయ మహా మంత్రాలే దిక్కు, మొక్కు అనుకుంటారేమో!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article