చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన పెళ్లయిన చాలాకాలానికి తల్లి కాబోతోంది… గుడ్… అయితే ఆ వార్తలతోపాటు మరో చిన్న వార్త ఆకర్షించింది… ఆమె సరోగసీ ద్వారా బిడ్డను కనబోతోంది అని..! అంత పెద్ద అపోలో హాస్పిటల్స్‌కు యువరాణి, మెగా రాజ్యపు మహారాణి అందరు మహిళల్లాగే కడుపు మోయడం, పురుటి నొప్పులు పడటం ఏమిటసలు అన్నట్టుగా సాగింది ఆ వార్త…
అది చట్టవిరుద్ధమేమీ కాదు… మొన్నమొన్ననే కదా నయనతార కవలల్ని కన్నది ఇలాగే… మనకు తెలియని కేసులు వందల్లో…! అయితే ఉపాసన మనస్తత్వాన్ని బట్టి ఆమె అందరిలాగే గర్భాన్ని ఆస్వాదిస్తుంది తప్ప సరోగసీ జోలికి పోకపోవచ్చు… సరోగసీ మహిళ కావాలి అంటే వాళ్ల ఎదుట వందల మంది క్యూ కడతారు… అది కాదు సమస్య… కానీ ఆమె అటువైపు వెళ్లకపోవచ్చు… దాన్ని వదిలేస్తే మూడునాలుగు రోజులుగా ఎక్టోలైఫ్ అనే ఓ కృత్రిమ గర్భాల ల్యాబ్ గురించిన వీడియో, వార్తలు బాగా హల్‌చల్ చేస్తున్నాయి..,.
ఇదేమిటయ్యా అంటే… ప్రపంచపు మొదటి కృత్రిమ గర్భ సౌకర్యం… ఇంకా సరళంగా చెప్పాలంటే తల్లి కడుపులో పెరగాల్సిన అవసరం లేకుండా, ప్రసవం సమయంలో రిస్కులు లేకుండా బిడ్డను ల్యాబులో పెంచుతారు… అయితే ఆర్టిఫిషియల్ వూంబ్ అనే పదం కరెక్టు కాదు… నిజమైన పిండాలే అవి… కృత్రిమ తల్లి కడుపులు… అంతే… ఏటా 30 వేల మందికి అలా జన్మనిస్తాడట ఎక్టోలైఫ్ ఓనర్… కానీ చట్టాలు, నైతిక విషయాలు ఈ ‘‘వ్యాపారానికి’’ అడ్డంకులు అని కూడా బాధపడిపోయాడు…
Ads
ప్రిమెచ్యూర్ డెలివరీ బేబీలను కొన్నాళ్లు ఇంక్యుబేటర్‌లో ఉంచడం కొత్తేమీ కాదు… వీర్యాన్ని, అండాన్ని ప్రయోగశాలల్లో ఫలదీకరించడం కొత్తేమీ కాదు… కాకపోతే బిడ్డకు ఓ తల్లి కడుపు కావాలి… అదే సరోగసీ… ఆ అవసరం లేకుండా మేం ప్రత్యేక చాంబర్లలో పెంచుతాం అంటో ఎక్టోలైఫ్… కేవలం తల్లికడుపు సౌకర్యం కల్పించడం వరకైతే ఏ చట్టాలు అడ్డుపడవు… కానీ..?
15 రోజులకు మించి ఏ పిండంపైనా పరిశోధనలు చేయడానికి వీల్లేదు… అది ఒక అడ్డంకి… ఈ ప్రక్రియలో మరో సౌలభ్యం కల్పిస్తున్నారు వీళ్లు… పుట్టబోయే బిడ్డ రంగు, ఎత్తు, జుత్తు కలర్, కళ్ల కలర్, మొహం రూపురేఖలు ముందే ‘ఎంపిక చేసుకోవచ్చు’… ఆమేరకు జెనెటికల్ మోడిఫికేషన్స్ చేస్తారు… అంటే జన్యుమార్పిడి… సహజంగా, జెనెటికల్‌గా వచ్చే వ్యాధుల్ని నియంత్రించవచ్చు… కానీ మనుషుల్లోని వైవిధ్యం మాటేమిటి..?
పర్వత ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, తీరప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు… ఇలా మనిషి బతికే ప్రాంతం, ఖండాన్ని బట్టి మనుషుల స్టామినా, దైహిక లక్షణాలు ఉంటాయి… ఇప్పుడు ప్రతి తల్లి తన బిడ్డ కలర్, ఎత్తు తదితర లక్షణాల్ని ‘హై రేంజులో’ ఎంచుకుంటే ఇక అందరూ అలాగే ఉండిపోతారు కదా… వైవిధ్యం మాటేమిటి..? యాంత్రికంగా ఆరోగ్యకరమైన, దృఢమైన, అందమైన కోళ్లను పెంచుతున్నామా ఈ ఫామ్స్‌లో..? ఇదీ నైతికతకు సంబంధించిన మరో అడ్డంకి…
రాను రాను ఈ హైక్లాస్ పిల్లలే సమాజాన్ని శాసిస్తుంటే, నేచురల్‌గా పుట్టే లోక్లాస్ పిల్లల మాటేమిటి..? తన అండాన్ని ఇచ్చి, ఓ క్వాలిటేటివ్ దాత వీర్యాన్ని ఎంపిక చేసుకుని, డబ్బు చెల్లిస్తే చాలు, కొన్నాళ్లకు ఈ ల్యాబ్ ఓ బిడ్డను చేతుల్లో పెడుతుంది… పురుషుడికీ అంతే, తన వీర్యం ఇచ్చి, ఓ సూపర్ అండాన్ని ఎంపిక చేసుకుని, డబ్బు చెల్లిస్తే చాలు…
లేదా పిల్లలు కలిగే అవకాశాల్లేని దంపతులు ‘రిస్క్ లెస్ కడుపు’ అనే కోణంలో ఇలాంటి ల్యాబులను ఎంపిక చేసుకోవచ్చు… ఎటొచ్చీ జన్యుమార్పిడిని మతాలు, ప్రభుత్వాలు అంగీకరిస్తాయా..? ప్రస్తుతం ఇదంతా థియరీ… త్వరలో నిజంగానే చర్చకు రాబోతోంది… ఏ ఒక్క దేశం వోకే అన్నా సరే, మనిషి జననవిధానమే సమూలంగా మారిపోతుంది…! ప్రకృతి నియమాలకు పూర్తి విరుద్ధంగా…!!
Share this Article