.
ఒక ఉదాహరణ… ఓ యువకుడికి కొత్తగా పెళ్లయింది… ఆల్ ఆఫ్ సడెన్ బ్రెయిన్ హేమరేజ్… కుప్పకూలాడు… హాస్పిటల్‌లో నెల రోజులు… అసలే పేద కుటుంబం… అప్పులు తెచ్చారు… మందులకు రియాక్ట్ అవుతున్నాడు అంటారు డాక్టర్లు… ఇక ఏమీ పే చేయలేని స్థితిలో ఇంటికి తీసుకెళ్లమన్నారు…
రోజూ సెలైన్లు, ఆక్సిజెన్… బతికాడో, మరణించాడో కూడా తెలియకుండా… జీవచ్ఛవంలా… చేసీ చేసీ, చూసీ చూసీ భార్య వదిలేసి వెళ్లిపోయింది… తల్లికి ఖర్చులు భరించే స్థోమత లేదు… ఆదుకునేవాడు లేడు… విధి దయ చూపి ఓ రోజు పొద్దున మింగేసింది… ఆ ఆక్సిజెన్ పైప్ కట్టయి ఉంది… ఇక ఆ మిస్టరీ లోతులోకి వెళ్లకండి…
Ads
.
మీకు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా గుర్తుంది కదా… అందులో ఓ పిల్లాడు… ప్రాణం ఉంది, అంతే కానీ జీవలక్షణాలు ఏమీ లేవు… డాక్టర్లు తనను ఓ ఆబ్జెక్టుగా చూస్తుంటారు… విద్యార్థులకు ఓ లైవ్ స్పెసిమెన్… సరే, చిరంజీవి ప్రేమను పంచుతాడు, ఆ పిల్లాడు కోలుకుంటాడు… ఓ మిరకిల్… డాక్టర్లు రోగిని ఏ స్థితిలోనైనా మనిషిగా, ప్రాణిగా చూడాలని చెప్పటానికి కథలో ఆ పాత్రను పెట్టారు…
.
ఇప్పుడు ఓ వార్తలోకి వద్దాం… ఇందులో సుప్రీం కోర్టుకు ఓ అభినందన, ఓ సూచన… ఒక పాథటిక్ వార్త ఇది… పంజాబ్ వర్శిటీ విద్యార్థ హరీశ్ రాణా… తన హాస్టల్ నాలుగో అంతస్థు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు… తీవ్రగాయాలు… కోమాలోకి వెళ్లాడు… చాన్నాళ్లు హాస్పిటల్‌లో చికిత్స… అసలే పేద కుటుంబం… అప్పులు తెచ్చారు, ఉన్న ఇంటినీ అమ్మేసుకున్నారు… కృత్రిమ శ్వాస, పైపు ద్వారా ద్రవాహారం… ఇది 2013లో…
12 ఏళ్లు కోమాలోనే… వీపు మొత్తం పుండ్లు… కొడుకు అవస్థ, ఏమీ చేయలేని దురవస్థ… చంపేసి పుణ్యం కట్టుకొమ్మని కోర్టుకెక్కారు తల్లిదండ్రులు… ఢిల్లీ హైకోర్టు కూడా ‘యుథనేసియా’కు వోకే చెప్పింది… కానీ ప్రత్యేక వైద్య బృందం అవసరం లేదంది, దీంతో తల్లిదండ్రులు సుప్రీంకోర్టు మెట్లెక్కారు… అపెక్స్ బాడీ నొయిడా జిల్లా కోర్టును నివేదిక అడిగింది… ఆ కోర్టు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించింది… వాళ్లు ఆ యువకుడి స్థితిని నివేదించింది…
దీన్ని విచారించిన సుప్రీం ద్విసభ్య బెంచ్ ‘‘చాలా విచారం కలిగించే నివేదిక ఇది… అతన్ని ఇంకా అలా ఉంచడం సరికాదు’ అని వ్యాఖ్యానించింది… అంతేకాదు, మేమే వెళ్లి తన పరిస్థితిని చూస్తామని చెప్పింది… గుడ్… జనవరి 13న హాస్పిటల్ సందర్శిస్తామని, ఈలోపు ఎయిమ్స్ వైద్య నిపుణుల నుంచి కూడా మరో నివేదిక తెప్పించుకుంటామని చెప్పింది…
ఇదంతా ఎందుకంటే… మన దేశంలో కారుణ్య మరణాలకు అనుమతుల్లేవు… ఒకవేళ సుప్రీం న్యాయమూర్తులు గనుక కారుణ్య మరణానికి అనుమతిస్తే… దానికి చాలా విలువ ఉంటుంది… మన దేశంలో ఇది అత్యంత అరుదు… ఒకసారి ఈ కారుణ్య మరణాలేమిటో చూద్దాం…
యుథనేసియా (Euthanasia) లేదా కారుణ్య మరణం అనేది తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ, కోలుకునే అవకాశం లేని వ్యక్తులు గౌరవప్రదంగా ప్రాణాలు విడిచేందుకు చేసే ప్రక్రియ… దీనిపై భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితి ఇది….
మన దేశంలో పాసివ్ యుథనేసియా (Passive Euthanasia) చట్టబద్ధం, కానీ యాక్టివ్ యుథనేసియా (Active Euthanasia) నేరం…
-
పాసివ్ యుథనేసియా (Passive Euthanasia)..: ఒక రోగి కోలుకోలేని స్థితిలో (Persistent Vegetative State) ఉన్నప్పుడు, వారికి అందిస్తున్న కృత్రిమ ప్రాణవాయువు (Ventilator) లేదా మందులను నిలిపివేసి సహజ మరణం పొందేలా చేయడం… 2018లో సుప్రీం కోర్టు దీనిని అనుమతించింది…
-
యాక్టివ్ యుథనేసియా (Active Euthanasia): ప్రాణం తీయడానికి ఉద్దేశపూర్వకంగా విష ఇంజెక్షన్లు వంటివి ఇవ్వడం… ఇది మన దేశంలో నిషేధం…
-
లివింగ్ విల్ (Living Will)..: ఒక వ్యక్తి తాను స్పృహలో ఉన్నప్పుడే, భవిష్యత్తులో తను కోలుకోలేని స్థితికి వెళ్తే తనకు వైద్యం ఆపేయాలని ముందే రాసి పెట్టవచ్చు… దీనికి సంబంధించి 2023లో సుప్రీం కోర్టు నిబంధనలను మరింత సరళతరం చేసింది…
యుథనేసియాను అనుమతించే దేశాలు
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు యాక్టివ్ యుథనేసియాను, అసిస్టెడ్ సూసైడ్‌ను అనుమతిస్తున్నాయి…
-
నెదర్లాండ్స్: యుథనేసియాను చట్టబద్ధం చేసిన మొదటి దేశం (2002)…
-
బెల్జియం: ఇక్కడ మైనర్లకు (పిల్లలకు) కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి ఉంది…
-
కెనడా: దీనిని ‘మెడికల్ అసిస్టెన్స్ ఇన్ డైయింగ్’ (MAiD) అని పిలుస్తారు…
-
లక్సెంబర్గ్, స్పెయిన్, కొలంబియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (కొన్ని రాష్ట్రాలు): ఇక్కడ కూడా కఠినమైన నిబంధనలతో అనుమతి ఉంది…
-
స్విట్జర్లాండ్: ఇక్కడ ‘అసిస్టెడ్ సూసైడ్’ (వైద్యుని సలహాతో రోగి స్వయంగా ప్రాణం తీసుకోవడం) చట్టబద్ధం… అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు…
అనుసరించే విధానాలు (Methods)…. యుథనేసియా అమలులో ప్రధానంగా మూడు పద్ధతులు కనిపిస్తాయి:..
ఇంజక్షన్… ప్రాణాంతకమైన మందులను నేరుగా రక్తంలోకి ఇంజెక్షన్ ద్వారా ఎక్కించడం. ఇది సెకన్ల వ్యవధిలో పని చేస్తుంది…
నోటి ద్వారా… మత్తుమందు లేదా విషపూరిత ద్రవాన్ని రోగి స్వయంగా తాగడం…
చికిత్స నిలిపివేత… వెంటిలేటర్ తీసేయడం లేదా ఆహారం అందించే ట్యూబ్‌లను తొలగించడం (భారత్‌లో ఇదే అమలులో ఉంది)…
అయ్యా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులూ... ఆ యువకుడికి మరణం ప్రసాదించండి... అలాగే కారుణ్య మరణాలను మరింత సరళీకరించండి... బతకలేక, చావలేక ఉన్న దేహాత్మలకు విముక్తి కల్పించండి... ఇది ప్రాణదానంకన్నా మిన్న...!! ఆ వ్యక్తులే కాదు, ఎన్నో కుటుంబాలు దెబ్బతింటున్నాయి... ఇక్కడ కేవలం శారీరక వేదన మాత్రమే కాదు, బతికున్న వారు కూడా రోజూ చనిపోతుంటారు... right to die with dignity is Euthanasia....
Share this Article